Begin typing your search above and press return to search.

మోడీజీ.. రైతులను కూడా కౌగిలించుకోండి!

By:  Tupaki Desk   |   23 Jan 2018 4:19 AM GMT
మోడీజీ.. రైతులను కూడా కౌగిలించుకోండి!
X
ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యహూ గతవారం భారత పర్యటనకు వచ్చిన నేపథ్యంలో నెతన్యహూను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ కౌగిలించుకోవ‌డం...ఈ సందర్భంలో ప్రధాని మోడీ మీద కాంగ్రెస్ ఓ ఫన్నీ వీడియోను తయారు చేసి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయ‌డం..ఆ వీడియోకు హగ్‌ ప్లోమసీ అనే టాగ్‌ ను కూడా యాడ్ చేయ‌డం..దీనిపై అధికార బీజేపీ మండిప‌డ‌టం..గుర్తుండే ఉంటుంది. వ్య‌క్తిగ‌త అంశాల‌ను కూడా కాంగ్రెస్ రాజ‌కీయ చేస్తోంద‌ని బీజేపీ ఆరోపించిన‌ప్ప‌టికీ...కాంగ్రెస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ మరోసారి ప్రధాని మోడీపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.

తాజాగా మ‌రోమారు ట్విట్ట‌ర్‌ లో ప్ర‌ధానిని టార్గెట్ చేశారు. ప్రపంచ నేతలను మాత్రమే కాదు... భారత దేశానికి తిండి పెట్టే రైతులను - దేశాన్ని కాపలా కాసే జవాన్లను కూడా ప్ర‌ధాని మోడీ కౌగిలించుకోవాలని ప్రశ్నించారు. ఆఫీస్‌ ఆఫ్‌ ఆర్‌ జీ ట్విట్టర్ ఖాతాలో ఆయన ప్రధాని మోడీని పైవిధంగా ప్రశ్నించారు. ముఖ్యమైన వ్యక్తులను కౌగిలించుకోవడమంటేనే ప్రధాని మోడీకి ఇష్టమని.. సాధారణ పౌరులను హగ్ చేసుకోవడం ఆయనకు ఇష్టముండదని ఎద్దేవా చేశారు.

కాగా, ప్ర‌ధాని మోడీ కౌగిలింత‌ల వీడియోను రూపొందించి...దానికి‘హగ్ హైలైట్స్’ అంటూ విడుదల చేసిన కాంగ్రెస్ ఈ వీడియోలో వివిధ దేశాలకు చెందిన నాయకులను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న విధానాన్ని చూపించింది. టర్కీ ప్రధానితో ‘అద్భుత కౌగిలింత’ అని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో ‘మరింత వికృతం’ అని - హాలెండ్ మాజీ అధ్యక్షుడితో ‘టైటానిక్ కౌగిలింత’ అని - మెక్సికో అధ్యక్షుడితో ‘నన్ను ప్రేమించనీ’ అన్నట్టు ఉందని - జపాన్ ప్రధాని అబెను కౌగిలించుకుంటూ ‘నిన్ను ఎన్నటికి వెళ్లనివ్వను’ అన్నట్టు ఉందని ఆ వీడియోలో పేర్కొన్నారు.