Begin typing your search above and press return to search.

నో సీల్డ్ కవర్... కాంగ్రెస్ లో కొత్త రూల్ !

By:  Tupaki Desk   |   13 Dec 2018 6:27 AM GMT
నో సీల్డ్ కవర్... కాంగ్రెస్ లో కొత్త రూల్ !
X
నో సీల్డ్ కవర్.. ఇదీ కాంగ్రెస్ పార్టీ కొత్త సంస్కృతి. 100 సంవత్సరాల పైబడిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ తన పాత సాంప్రదాయాలకు చెల్లు చీటి రాస్తోంది. ఇప్పటి వరకూ దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగిన అక్కడ కాంగ్రెస్ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి అభ్యర్దిని ఎంపిక చేసి ఆ పేరును సీల్డ్ కవర్లో రాష్ట్ర నాయకత్వానికి పంపడం దశాబ్దాల ఆచారం. దీనిపై ప్రతిపక్షాలు అనేక సార్లు కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోశాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదంటూ నిప్పులు చెరిగాయి. శాసన సభ్యులు తమ నాయకుడిని స్వేచ్ఛ‌గా ఎన్నుకునే అవకాశం కాంగ్రెస్ పార్టీలో లేదని దుమ్మెత్తి పోశాయి. ఇందిరా గాంధీ ఏలిక నుంచి రాజీవ్ గాంధీ - పి.వి. నరసింహారావు - సోనియా గాంధీ ఏలికల వరకూ కాంగ్రెస్ పార్టీలో సీల్డ్ కవర్ సంస్కృతే రాజ్యమేలింది. శాసన సభ్యులు తమకు ఇష్టమైన అనుకూలమైన నాయకుడిని ఎన్నుకోవడం కాంగ్రెస్ చరిత్రతో ఎప్పూడూ లేదు. వైఎస్. రాజశేఖర రెడ్డి మరణం తర్వాత సమైక్య రాష్ట్రానికి రోశయ్య ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన ఎంపిక కూడా సీల్డ్ కవర్లోనే వచ్చింది. కొన్నాళ్ల తర్వాత నేను పదవిలో ఉండలేనంటూ రోశయ్య తప్పుకున్నారు. ఆ సమయంలో అనూహ్యంగా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన పేరును కూడా కాంగ్రెస్ అధిష్టానం సీల్డ్ కవర్లోనే పంపింది. ఈ సంప్రదాయం ఒక్క ఆంధ్రప్రదేశ్‌ కే కాదు - దేశంలోని అన్ని రాష్ట్రాలకు అనుసరించింది కాంగ్రెస్ పార్టీ.

అయితే రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్షుడు అయిన తర్వాత పాత సంప్రదాయాలకు తిలోదకాలు ఇవ్వడం ప్రారంభించారు. తాజాగా జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలలో 3 చోట్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ ముఖ్యమంత్రి ఎవరు అనేది జటిలంగా మారింది. ఇప్పుడు కూడా ఈ రాష్ట్రాలకు ముఖ్యమంత్రులను సీల్డ్ కవర్లో పంపుతారని అందరూ భావించారు. అయితే దానికి విరుద్ధంగా "మీకు ఎవరు ముఖ‌్యమంత్రి కావాలి" అంటూ రాహుల్ గాంధీ కార్యకర్తలను ప్రశ్నించారు. ఈ రాష్ట్రాలలో తమ ముఖ్యమంత్రి ఎవరో తేల్చుకునే బాధ్యతను కార్యకర్తలకే అప్పగించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరిని ఎన్నుకుంటే వారే ముఖ్యమంత్రి అని ప్రకటించారు. రాహుల్ తీసుకున్న ఈ నిర్ణయం కాంగ్రెస్ పార్టీలోనే కాదు.. ఇతర పార్టీలకు మార్గదర్శకం అయ్యిందంటున్నారు. నాయకుడిని ఎంచుకునే బాధ్య‌తను కార్యకర్తలకు ఇవ్వడం రాహుల్ గాంధీ పరిణితి రాజకీయాలకు నిదర్శనమని పరిశీలకులు అంటున్నారు. బహుశా రానున్న కాలంలో రాహుల్ ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీ మరిన్నీ ప్రజాస్వామ్య నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు.