Begin typing your search above and press return to search.

యువరాజుల వారికి చెంబు నీళ్లు పడవంతే

By:  Tupaki Desk   |   22 Aug 2015 6:56 AM GMT
యువరాజుల వారికి చెంబు నీళ్లు పడవంతే
X
చెప్పే మాటలకు చేసే పనులకు మధ్య సామీప్యం అనేది ఉండదని రాజకీయ నాయకుల్ని చూస్తేనే తెలుస్తుంది. గల్లీలో ఇలాంటి వారు ఉంటారు కానీ.. ఢిల్లీ స్థాయి నేతలు అందుకు కాస్త భిన్నంగా ఉంటారన్న నమ్మకం ఇంకా పోలేదు. అందులోకి.. దేశాన్ని దశాబ్దాల తరబడి ఏలిన గాంధీ కుటుంబం మీద ఏదో ఒక మూల కూసింత సాఫ్ట్ కార్నర్.

అందులోని సెలవులని సెప్పి ఎక్కడికోపోయి వచ్చిన నాటి నుంచి.. దేశాన్ని ఉద్దరించటానికే తాను పుట్టినట్లు.. సూటుబూటు మీద తనకసలు మమకారం లేదని.. తనలాంటి లాల్చీ ఫైజమాగాళ్ల వల్లే ఈ దేశానికి భవిష్యత్తు ఉంటుందని చెప్పుకుంటూ దేశం చుట్టూ తిరుగుతున్న కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ.. ఉన్నట్లుండి మారిపోయారేమోనన్న ఒకింత ఆశ.. కొంతమందిలో వచ్చేసింది.

దీనికి తగ్గట్లే.. యువరాజుల వారు నిత్యం రైతులు.. భూసేకరణ అంటూ సామాన్యుల విషయాలు మాట్లాడుతుంటే.. కాస్త ముదిరిపోయిన తర్వాత అయినా ప్రజా సమస్యల మీద దృష్టి పడినట్లుందేనని ఆనందపడినోళ్లు ఉన్నారు. అయితే.. అందరికి కనిపించుకునేలా లాల్చీ పైజమా వేసుకున్నంత మాత్రాన.. లోపల మనిషి మారిపోతాడా అన్న విషయం తెలిసే ఘటన తాజాగా చోటు చేసుకుంది.

తన సొంత నియోజకవర్గమైన అమేధీకి వెళ్లిన ఆయన.. అక్కడి రైతులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడి.. మాట్లాడి యువరాజు గొంతు తడారిపోతుందన్న ఆలోచనతో స్టీలు చెంబుతో కూసిన్ని నీళ్లు తీసుకొచ్చి పెట్టారు. చెంబు అలా పెట్టారో లేదో.. ఆయన వ్యక్తిగత సిబ్బంది.. సీల్ తీయని బ్రాండెడ్ వాటర్ బాటిల్ తీసుకొచ్చి పెట్టేశారు.

సూటుబూటు సర్కారు అంటూ నిత్యం ప్రధాని మోడీ మీద మండిపడే యువరాజుల వారు సైతం.. అదే కోవకు చెందిన వారని.. ఆయన సామాన్యుల మాదిరి చెంబునీళ్లు తాగరని.. సీల్ తీయని బ్రాండెడ్ వాటర్ బాటిల్ మాత్రమే తాగుతారన్న విషయాన్ని గుర్తించినా.. పెద్దోళ్ల యవ్వారం అని జరిగిన తతంగాన్ని మనసులోనే పెట్టుకొని మౌనంగా చూస్తుండిపోయారు.. గాంధీ కుటుంబాన్ని దశాబ్దాల తరబడి మోస్తున్న అమేధీ నియోజకవర్గ ప్రజలు.