Begin typing your search above and press return to search.

కాలమహిమ అంటే మరేంటి? పాదయాత్రకు చెక్ చెప్పినోళ్లే చేయాల్సి వస్తోంది?

By:  Tupaki Desk   |   8 Sep 2022 5:28 AM GMT
కాలమహిమ అంటే మరేంటి? పాదయాత్రకు చెక్ చెప్పినోళ్లే చేయాల్సి వస్తోంది?
X
కాలానికి మించిన పవర్ మరి దేనికి ఉండదు. కాల ప్రవాహంలో బండ్లు ఓడలు.. ఓడలు బండ్లు కావటం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వంలోని కీలక నేత రాహుల్ గాంధీ 'భారత్ జోడో యాత్ర' పేరుతో పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. మోడీ సర్కారుకు మంగళం పాడేందుకు వీలుగా.. భారత్ మొత్తం చుట్టి వచ్చేలా ఆయన పాదయా'త్ర సాగనుంది. మతశక్తుల్ని తరిమికొట్టి.. దేశాన్నిసమైక్యంగా ఉంచేందుకు భారత్ జోడో యాత్రను చేపట్టినట్లు రాహుల్ చెబుతున్నా.. వాస్తవం మాత్రం వేరే ఉందన్న విషయం రాజకీయం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలిసిందే.

కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎప్పుడూ ఎదుర్కొనంత సంక్షోభాన్ని పార్టీ ఎదుర్కొంటున్న వేళ.. కాంగ్రెస్ కు పునర్ వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు వీలుగా రాహుల్ గాంధీ స్వయంగా తన కాళ్లకు పని చెప్పాల్సన పరిస్థితి వచ్చింది.

తన తండ్రి ప్రాణాల్ని విభజన.. విద్వేషాలే తీశాయని పేర్కొన్న ఆయన.. సుదీర్ఘ పాదయాత్రకు తెర తీశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఆయన నడవనున్నారు. సుదీర్ఘంగా సాగే ఈ పాదయాత్ర వేళ.. ఒక ఆసక్తికర అంశం చర్చకు వస్తోంది.

దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి హఠ్మార్మణం తర్వాత తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న కార్యకర్తలు.. అభిమానుల ఇళ్లకు ఓదార్పు యాత్ర చేస్తానని జగన్ చెప్పటం.. ఆ పాదయాత్రకు అప్పట్లో కాంగ్రెస్ అధినేత్రి సోనియా నో చెప్పటం తెలిసిందే. కాంగ్రెస్ పార్టీలో ఉంటే తనకు తిప్పలు తప్పవన్న ఉద్దేశంతో జగన్ పార్టీకి గుడ్ బై చెప్పేసి వైసీపీని ఏర్పాటు చేయటం.. సొంతంగా పాదయాత్ర చేసి అధికారంలోకి రావటం తెలిసిందే.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. ఏ పవర్ జగన్ సొంతమవుతుందన్న ఉద్దేశంతో నాడు ఆయన చేపడతానని చెప్పిన ఓదార్పు యాత్రకు నో చెప్పిన కాంగ్రెస్ అధినాయకత్వం.. ఇవాల్టి రోజున పార్టీ ఉనికి కోసం పార్టీ అధినాయకత్వానికి చెందిన రాహుల్ స్వయంగా రోడ్ల మీదకు రావటాన్ని ప్రస్తావిస్తున్నారు. ఒక కీలక నేత పాదయాత్ర చేస్తాననో.. మరేదైనా యాత్ర చేస్తానని విన్నవించుకుంటే.. వారు సదరుయాత్రలు చేసేందుకు పర్మిషన్ ఇచ్చే స్థాయి నుంచి.. అధికారం కోసం ఇప్పుడు తామే పాదయాత్రలు చేయాల్సిన పరిస్థితి.

ఇదంతా చూస్తే.. చేసిన తప్పులకు ఏదో ఒక రోజు మూల్యం చెల్లించక తప్పదన్న మాట వినిపిస్తోంది. రాహుల్ తాజా పాదయాత్ర నేపథ్యంలో.. తమ అధినేత జగన్ ను అప్పట్లో ఓదార్పు యాత్ర చేయకుండా అడ్డుకున్న వైనాన్ని గుర్తు చేసుకుంటూ.. ప్రజాదరణ ఉన్న నేతల్ని కోల్పోయిన కాంగ్రెస్ కు ఇప్పుడు ఇలాంటి పరిస్థితి స్వయంకృతాపరాధమేనని చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.