Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ ఓడింది.. ఆ బయోపిక్ పేరు మారింది

By:  Tupaki Desk   |   30 May 2019 12:02 PM GMT
కాంగ్రెస్ ఓడింది.. ఆ బయోపిక్ పేరు మారింది
X
ప్రస్తుతం దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలలో బయోపిక్‌ల హవా కనిపిస్తోంది. రాష్ట్ర స్థాయికి చెందిన వారి జీవితానికి సంబంధించిన చిత్రాలు ఆయా ఇండస్ట్రీలకే పరిమితం అవుతుండగా, దేశం మొత్తం పరిచయం ఉన్న వాళ్లకు సంబంధించిన చిత్రాలు మాత్రం అన్ని భాషల్లో రూపొందుతున్నాయి. ముఖ్యంగా పెద్ద సెలబ్రిటీల జీవిత చరిత్రలను సినిమాలుగా మలచడానికి బాలీవుడ్‌ లోని దర్శకులు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలోనే ఇప్పటికే పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. వీటికి భారీ రెస్పాన్స్ ఉండడంతో మిగిలిన వారు కూడా ఇదే తరహా సినిమాలను తెరకెక్కించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ కోవలోనే మరికొన్ని సినిమాలు రూపుదిద్దుకుంటున్నాయి. వాటిలో కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ బయోపిక్ మూవీ ఒకటి.

ప్రముఖ దర్శకుడు రూపేశ్ పాల్ ''మై నేమ్ ఈజ్ రాగా'' పేరుతో రాహుల్ గాంధీ బయోపిక్ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో రాహుల్ గాంధీ పాత్రను అశ్వినీ కుమార్ పోషిస్తున్నారు. రాహుల్ కుటుంబం, ఆయన బాల్యం, విదేశాల్లో చదువులు, నాయనమ్మ, తండ్రి హత్యలు, పొలిటికల్ ఎంట్రీ తదితర విషయాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ కొద్దిరోజుల క్రితం విడుదలైంది. దీనికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అయితే, ఈ సినిమాను విడుదల చేసే సమయంలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ వెలువడింది. దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం.. సినిమా విడుదల ఆగిపోవడం జరిగిపోయాయి. ఇప్పుడు ఈ సినిమాను విడుదల చేయాలని భావించిన చిత్ర యూనిట్.. తాజాగా సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నో అంచనాలతో బరిలోకి దిగింది రాహుల్ గాంధీ సారథ్యంలోని కాంగ్రెస్ పార్టీ. అయితే, ఊహించని విధంగా ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ సింగిల్‌గా ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌ను చేరుకుంది. దీంతో ''మై నేమ్ ఈజ్ రాగా'' సినిమా పేరును మార్చింది చిత్ర యూనిట్. దీనికి ''రాగా- ద ఫాలెన్ స్టార్'' అని పేరు పెట్టింది. అంతేకాదు, విడుదలకు సిద్ధమైన ఈ సినిమాకు సంబంధించిన కథలో మార్పులు కూడా చేస్తున్నారు. ఈ విషయాన్ని దర్శకుడు స్వయంగా వెల్లడించారు. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్ స్టార్ల బయోపిక్‌లు చూసిన జనాలకు మొదటిసారిగా ఓ ఫెయిల్యూర్ పొలిటీషియన్‌ కు సంబంధించిన బయోపిక్ పరిచయం చేయబోతుండడం విశేషం.