Begin typing your search above and press return to search.

మోడీ మాటల అబద్దాలు అని వీడియో తో సహా బయట పెట్టిన రాహుల్ !

By:  Tupaki Desk   |   28 Dec 2019 6:26 AM GMT
మోడీ మాటల అబద్దాలు అని వీడియో తో సహా బయట పెట్టిన రాహుల్ !
X
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్‌ ఆర్‌ సీ , ఎన్‌ పీఆర్‌ జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. కేంద్రం ఈ చట్టం అమల్లోకి తీసుకువచ్చినప్పటి నుండి దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాలలో పెద్ద ఎత్తున ప్రజలు తమ నిరసనలని తెలియజేస్తున్నారు. ఈ ఆందోళనల్లో కొందరు ప్రాణాలని కూడా పోగొట్టుకున్నారు. దీనిపై ప్రతి పక్షాలు , మరికొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యతిరేకం అంటూ ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ కొత్త చట్టం వల్ల దేశం లో నివసిస్తున్న ఎవరికీ కూడా ఎటువంటి నష్టం జరగదు అని చెప్తున్నారు.

ఇక పోతే దీని పై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ బీజేపీ పై ఫైర్ అవుతున్నారు. ఈ చట్టాన్ని తీసుకొచ్చిన మొదటి రోజు నుండి దీన్ని వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకం గా పోరాడుతున్నారు. ఈ నేపథ్యం లోనే రాహుల్ తాజాగా ప్రధాని మోడీ చెప్పేవన్నీ కూడా అబద్దాలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు. దీనితో రాహుల్ పై బీజేపీ నేతలు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ రాహుల్ ఈ సంవత్సరపు అబద్ధాల పుట్ట అని విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఏదైనా మాట్లాడితే అందులో అన్ని అబద్ధాలే ఉంటాయని, పార్టీ అధ్యక్షుడిగా ఎప్పుడు మాట్లాడినా అబద్ధాలే అని , అలాగే అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా అబద్ధాలు చెప్పడం మానేయలేదు అని మండి పడ్డాడు. పౌరసత్వ సవరణ చట్టం బీద ప్రజల పై పన్నులాంటిదంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యల మూలంగా కాంగ్రెస్ పార్టీతో పాటు దేశ ప్రజలను సైతం ఆయన ఇరకాటం లో పడేశారని అన్నారు.

తనపై బీజేపీ నేతలు చేస్తున్న విమర్శల కి రాహుల్ దీటుగా సమాధానం ఇచ్చారు. తనను అబద్ధాల పుట్టగా బీజేపీ నేతలు ప్రచారం చేస్తున్నారని , కానీ నేను ఏనాడూ కూడా అబద్దాలు చెప్పలేదు అని , ఎవరు అబద్దాలు చెప్తున్నారో ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. శనివారం మీడియాతో మాట్లాడిన రాహుల్ .. దేశంలో ఎక్కడా నిర్బంధ కేంద్రాలు లేవంటూ ప్రధాని మోదీ మాట్లాడిన వీడియోను తాను తాజా ట్వీట్‌ లో పోస్ట్ చేశానని, అదే వీడియోలో నిర్బంధ కేంద్రం విజువల్స్ కూడా పోస్ట్ చేశానని తెలిపారు. ఒకవైపు నిర్బంధ కేంద్రాలు లేవు అని మోడీ చెప్తుంటే .. మరి ఈ నిర్బంధ కేంద్రాలు ఎక్కడి నుంచి వచ్చాయని అయన నిలదీశారు. ఈ ఒక్కటి చాలు ఎవరు అబద్ధాలతో ప్రజలని మభ్యపెడుతున్నారో తెలుసుకోవడానికి అని అన్నారు. అలాగే పోస్ట్ చేసిన వీడియో లని చూడాలని దేశ ప్రజలని రాహుల్ కోరారు.