Begin typing your search above and press return to search.

మోడీ సర్కారుకు.. స్వదేశీ వద్దు - విదేశీ ముద్దు!

By:  Tupaki Desk   |   29 Oct 2019 10:37 AM GMT
మోడీ సర్కారుకు.. స్వదేశీ వద్దు - విదేశీ ముద్దు!
X
భారత జాతీయ పార్లమెంట్ ఎంపీలు కశ్మీర్ లో పర్యటిస్తామంటే వారిని నిరోధిస్తూ ఉంది మోడీ సర్కారు. కశ్మీర్ కు చెందిన రాజకీయ నేతలను రెండున్నర నెలల నుంచి హౌస్ అరెస్ట్ చేసింది. వారిని ఇప్పటి వరకూ బయటకు వదలడం లేదు. ఈ మధ్యనే వారిని బయటి వారు కలిసే అవకాశాన్ని ప్రసాదించింది!

కశ్మీర్ కు సంబంధించి ఆర్టికల్ త్రీ సెవెన్టీని రద్దు చేసినట్టుగా భారతీయ జనతా పార్టీ ఘనంగా చెప్పుకుంటోంది కానీ, అక్కడ శాంతీయుత - సాధారణ పరిస్థితులు ఉన్నాయని మాత్రం గట్టిగా చెప్పలేకపోతోంది. కశ్మీర్ కు సంబంధించి మీడియా కవరేజ్ కూడా లేదు. అన్ని రకాల మీడియానూ నిరోధించారు కశ్మీర్ విషయంలో. ఇలాంటి నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ కు సంబంధించిన ఎంపీల పర్యటన జరుగుతూ ఉందక్కడ. వారు కశ్మీర్ లో నెలకొన్న పరిస్థితుల గురించి నివేదిక ఇవ్వబోతున్నారు.

ఆ సంగతలా ఉంటే.. కశ్మీర్ లో పర్యటనకు మోడీ సర్కారు భారత ఎంపీలకు పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని రాహుల్ గాంధీ ప్రస్తావించారు. తమ పార్టీ ఎంపీలు కశ్మీర్ లో పర్యటిస్తామంటే మోడీ సర్కారు ఒప్పుకోవడం లేదని - వారిని విమానాశ్రయం నుంచినే తిప్పి పంపుతూ ఉందని.. అదే విదేశీ ఎంపీలను తీసుకొచ్చి తిప్పుతోందని ఆయన విమర్శించారు.