Begin typing your search above and press return to search.

గాంధీతో రోహిత్ కు పోలికా?

By:  Tupaki Desk   |   31 Jan 2016 6:33 AM GMT
గాంధీతో రోహిత్ కు పోలికా?
X
పోలికలకు ఒక పద్ధతి ఉండాలి. జాతిపిత గాంధీతో ఒక ఆత్మహత్య చేసుకున్నవిద్యార్థిని పోలిక తెస్తూ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పీహెచ్ డీ విద్యార్థి రోహిత్ ఆత్మహత్య వ్యవహారంపై సెంట్రల్ యూనివర్సిటీలో నెలకొన్న ఆందోళనలు తెలిసిందే. రోహిత్ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాలు పంచుకొని ఎనిమిది గంటల పాటు దీక్ష చేపట్టిన రాహుల్ గాంధీ.. తన దీక్ష అనంతరం ప్రసంగించారు.

ఈ సందర్భంగా గాంధీతో రోహిత్ ను పోల్చటం చర్చనీయాంశంగా మారింది. దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీ పోరాడిన పోరాటాలు.. ఈ క్రమంలో ఆయనకు ఎదురైన అవమానాలు.. కష్టాలు.. అన్నిఇన్నీ కావు. మానసికంగానే కాదు.. శారీరకంగా కూడా ఆయనకు చాలానే సమస్యలు ఎదురయ్యాయి. ఇన్ని కష్టాలకు ఓర్చి తాను అనుకున్న పనిని సాధించిన మహానుభావుడు గాంధీ అయితే.. తనకు మానసిక కష్టం వచ్చిందంటూ ఆత్మహత్య చేసుకున్న ఒక యువకుడిని జాతిపితతో పోల్చటం రాహుల్ కే చెల్లుతుంది.

ఇక్కడ రోహిత్ ను తప్పు పట్టటం లేదు. అతనికి అవమానాలు ఎదురయ్యాయి అనుకుంటే.. దాని మీద పోరాడాలి. జాతి జనుల్ని నిద్ర లేపాలి. చైతన్యపర్చాలి. తనకు ఎదురైన అవమానాలు మరెవరికి ఎదురుకాకుండా పోరాడాలి. అంతేతప్ప.. అస్త్రాల్ని వదిలేసి ఆత్మహత్యను ఆహ్వానించిన వ్యక్తిని జాతిపితతో పోల్చటం ఏమిటి? రేపొద్దున ప్రతి ఇష్యూపైనా డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకుంటే.. వాళ్లంతా గాంధీజీలు అయిపోతారా? ఇలాంటి వ్యాఖ్యలు రాహుల్ లాంటి నేతల నోటి నుంచి రావటం ద్వారా.. జాతి జనులకు రాహుల్ ఏం సందేశం ఇస్తున్నారు? తమకు ఏదైనా సమస్య ఎదురైతే ఆత్మవిశ్వాసంతో పోరాడాలని.. జాతి జనుల్లో చైతన్యం నింపాలని అనుకుంటున్నారా? లేక.. ఆత్మహత్యలు చేసుకోవాలని భావిస్తున్నారా?

ఈ ప్రపంచంలో అందరికి ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటిని అధిగమించటానికి పోరాడి.. విజయం సాధించి అందరికి స్ఫూర్తిగా నిలవాలే తప్పించి ఆత్మహత్య చేసుకున్న వైనాన్ని కీర్తించటం ఏమిటి? రోహిత్ ను జాతిపితతో పోల్చిన రాహుల్.. ఒకవేళ గాంధీ సైతం.. తనకు ఎదురైన అవమానాల్ని మనసులో నింపుకొని డిప్రెషన్ తో ఆత్మహత్య చేసుకుంటే.. గాంధీ జాతిపిత అయ్యేవారా? రాజకీయాలు చేయాలనుకోవటం తప్పుకాదు. కానీ.. యువతను తప్పుదారి పట్టేలా వ్యాఖ్యలు చేయటం అన్నింటికి మించిన పెద్ద తప్పు అన్న విషయాన్ని మర్చిపోకూడదు.

రోహిత్ కు జరిగిన అన్యాయం మీద పోరాడటం.. అందుకు కారణమైన వారిని శిక్షించాలన్న డిమాండ్ ను ఎవరూ కాదనరు. అయితే.. డిమాండర్లు సాపేక్షంగా ఉండాలన్న విషయాన్ని మర్చిపోకూడదు. రాహుల్ లాంటి నేతల మాటలకు చాలానే ప్రాధాన్యత ఉంటుందని తెలుసు. కానీ.. దాన్ని తన రాజకీయ లబ్థి కోసం వినియోగిస్తే.. ఆయన పరపతి హారతి కర్పూరంలా కాలిపోతుందన్న విషయం ఆయన గుర్తిస్తే మంచిది.