Begin typing your search above and press return to search.

రాహుల్ కండీషన్స్.. ఈ నేతలకు నో టికెట్!!

By:  Tupaki Desk   |   20 Oct 2018 11:19 AM GMT
రాహుల్ కండీషన్స్.. ఈ నేతలకు నో టికెట్!!
X
కాంగ్రెస్ లో టికెట్ల కేటాయింపుపై జోరుగా చర్చలు నడుస్తున్నాయి. ఈసారి ఎలాగైనా సరే గెలిచి తీరాలని కాంగ్రెస్ వ్యూహాత్మకంగా అడుగులువేస్తోంది. మహాకూటమిలోని మిగతా పార్టీలకు అడిగినన్ని సీట్లు ఇవ్వరాదని ఆచితూచి అడుగులు వేస్తోంది. తాజాగా తెలంగాణ కాంగ్రెస్ లో కండీషన్స్ అప్లై నిబంధన గుబులు రేపుతోందట.. ఇది తలుచుకొని తాజా మాజీ నేతలు - సీనియర్లలో కంగారు మొదలైందట..

కాంగ్రెస్ అధిష్టానం ఈసారి గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలని కృతనిశ్చయంతో ఉందట.. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు తెలంగాణలోని మూడు సభల్లో పాల్గొన్న తర్వాత హైదరాబాద్ లో ఈ మేరకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాకు ఆమోదముద్రవేసి ఖరారు చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా మూడు కండీషన్ల ప్రకారం అభ్యర్థులను ఖరారు చేయనున్నారనే వార్త కాంగ్రెస్ టికెట్ ఆశిస్తున్న అభ్యర్థుల్లో కలవరం పెంచుతోంది.

కాంగ్రెస్ అధిష్టానం ఈసారి టికెట్ కావాలనుకునే అభ్యర్థుల ట్రాక్ రికార్డ్ పరిశీలిస్తోంది. ఇందులో ఆ మూడు కండీషన్లను పక్కాగా అమలు చేస్తోంది. ఆ మూడింటిలో రెండు లేకపోతే టికెట్ దక్కదని ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ మూడు ఏంటంటే..

1. వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వరాదు..

2. 2014లో 30వేలకంటే ఎక్కువ ఓట్ల తేడాతో ఓడిన నేతలకు టికెట్ కష్టమే..

3. గడిచిన ఎన్నికల్లో కనీసం 25వేల ఓట్లు సాధించని నేతలకు టికెట్ నిరాకరణ

ఈ మూడు నిబంధనలు బేస్ చేసుకొనే టికెట్టు ఇవ్వాలనే నియమం పెట్టుకున్నారట.. ఈ లెక్కన చూసుకుంటే కాంగ్రెస్ సీనియర్ నేత - శాసనమండలి పక్ష నేత షబ్బీర్ అలీ సహా కాంగ్రెస్ లోని చాలా మంది అనర్హులుగా తేలుతారు. షబ్బీర్ అలీ వరుసగా 2009 - 2010 ఉప ఎన్నిక - 2014లో కామారెడ్డి నుంచి టీఆర్ ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ చేతిలో 30వేలకు పైచిలుకు తేడాతో మూడు సార్లు ఓడిపోయాడు. ఈయనే కాదు.. చాలా మంది తాజా మాజీ ఎమ్మెల్యేలదీ ఇదే పరిస్థితి. మరి రాహుల్ గాంధీ వీరందరికీ టికెట్టు నిరాకరిస్తాడా లేదా అన్నది రేపటి వరకూ వేచిచూడాల్సిందే.