Begin typing your search above and press return to search.

సీడబ్ల్యూసీ సమావేశం ఇచ్చిన సంకేతం ఏమిటి?

By:  Tupaki Desk   |   8 Nov 2016 3:19 AM GMT
సీడబ్ల్యూసీ సమావేశం ఇచ్చిన సంకేతం ఏమిటి?
X
కాంగ్రెస్ పార్టీ యువరాజు రాహుల్ పట్టాభిషేకానికి అవసరమైన కీలక పరిణామం పూర్తి అయినట్లేనని చెప్పాలి. పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక మండలి అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేవంలో తొలిసారి పార్టీ పగ్గాల్ని రాహుల్ గాంధీకి అప్పగించే అంశంపై చర్చ జరగటమే కాదు.. పగ్గాలు తీసుకోవాలని కోరటం కీలక ప్రక్రియగా చెబుతున్నారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ హాజరు కావాల్సి ఉన్నా.. ఆరోగ్య కారణంతో గైర్హాజరయ్యారు. ఎప్పుడూ లేని విధంగా సీడబ్ల్యూసీ సమావేశంలో పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని రాహుల్ ను కోరటం చూస్తే.. కాంగ్రెస్ వరకూ ఇదో కీలకాంశంగా చెప్పాలి.

సాంకేతికంగా చూస్తే.. పార్టీ పగ్గాలు మరో ఏడాది పాటు సోనియాగాంధీ చేతిలో ఉన్నట్లే. అయితే.. ఇదంతా రాహుల్ గాంధీ భవిష్యతు దృష్ట్యా అని చెప్పక తప్పదు. తాజాగా జరిగిన సమావేశంలో రాహుల్ ను పార్టీ పగ్గాలు అందుకోవాలన్న సూచన చేయటం.. రాహుల్ఇప్పుడు కాదని చెప్పటం ద్వారా తనకు పదవుల పట్ల పెద్ద ఆసక్తి లేదన్న విషయాన్ని స్పస్టం చేసినట్లుగా కనిపిస్తుంది.

ఎందుకిలా అంటే.. దానికి కారణం లేకపోలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పార్టీ పగ్గాలు చేపట్టటం రాహుల్ ను పెట్టటం ఖాయం. వచ్చే ఏడాది పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందులో యూపీ.. పంజాబ్ లాంటి ముఖ్యమైన రాష్ట్రాలు ఉన్నాయి. ఇప్పటివరకూ ఉన్న అంచనాల ప్రకారం.. త్వరలో జరిగే వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించే ఛాన్స్ లేదు. అంటే.. రాహుల్ కానీ ఇప్పటికిప్పుడు పార్టీ పగ్గాలు చేపడితే.. ఎన్నికల ఓటమి ఆయన ఖాతాలో పడుతుంది. శుభమా అని పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే.. ఎన్నికల ఓటమి ఆయన సమర్థతపై సందేహాలు కలిగేలా చేయటంతో పాటు.. నెగిటివ్ ముద్రను చెరుపుకోవటానికి ఆయన చాలానే అవస్థలు పడాల్సి ఉంటుంది. అందుకే.. సీడబ్ల్యూసీ సమావేశంలో పగ్గాలు తీసుకొమ్మని కోరినా రాహుల్ సున్నితంగా తిరస్కరించారని చెప్పొచ్చు.

ఇంతేకాదు.. తాజాగా చోటు చేసుకున్న పరిణామం వెనుక మరో కారణం కూడా ఉందని చెప్పొచ్చు. ఇప్పటికే అనారోగ్యంతో ఉన్న సోనియా.. కాంగ్రెస్ పగ్గాలు కొడుక్కి ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా వాయిదా వేస్తున్న నేపథ్యంలో.. రేపొద్దున ఏదైనా అత్యవసరమైతే.. తన తర్వాత పగ్గాలు ఎవరికి అందాలన్న విషయంపై గ్రౌండ్ ప్రిపేర్ చేసినట్లుగా చెప్పాలి. ఏమైనా.. సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పగ్గాలు రాహుల్ చేపట్టాలన్న మాట అనుకోకుండా జరిగింది కాదని.. పక్కా వ్యూహంతో చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.