Begin typing your search above and press return to search.

రాహుల్ ఐదు ప్ర‌శ్న‌ల‌తో ర‌చ్చే

By:  Tupaki Desk   |   29 Dec 2016 6:55 AM GMT
రాహుల్ ఐదు ప్ర‌శ్న‌ల‌తో ర‌చ్చే
X
నోట్లరద్దుపై కేంద్రం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ డిమాండ్ చేశారు. ఇప్పటివరకు ఎంత నల్లధనం పట్టుబడింది? సర్కార్ ఏమేం చర్యలు చేపట్టింది? అంటూ శరపరంపరగా మోడీ సర్కార్‌ పై ప్రశ్నలు సంధించారు. బ్యాంకుల నుంచి తీసుకునే సొమ్ముపై నియంత్రణలు వెంటనే ఎత్తివేయాలని, బాధితులైన రైతులు - వ్యాపారులు - పేదప్రజలకు పరిహారం చెల్లించాలంటూ మీడియాకు డిమాండ్ల పత్రం విడుదల చేశారు.

పార్టీ ప్రధాన కార్యాలయంలో 132వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం పార్టీ నేతలు - కార్యకర్తల సమావేశంలో రాహుల్ ప్రసంగించారు. వ్యవస్థాపక దినోత్సవం రోజున సాధారణంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆమె అస్వస్థతతో ఉండటంతో రాహుల్ ఆ బాధ్యతలను నిర్వర్తించాల్సి వచ్చింది. పార్టీ ఉపాధ్యక్షునికి ఈ గౌరవం దక్కడం పార్టీ చరిత్రలో అరుదు. పార్టీ చేసిన త్యాగాలను, పోరాటాలను ఈసందర్భంగా గుర్తు చేశారు. నోట్లరద్దు వల్ల తీవ్రంగా నష్టపోయినవారికి పరిహారం చెల్లించాలనేది మరో డిమాండ్. దారిద్య్ర రేఖకు దిగువన గల కుటుంబాలకు చెందిన మహిళలకు రూ.25 వేలు చెల్లించాలని సర్కార్‌ కు రాహుల్ సూచించారు. ఉపాధి హామీ కూలీని రెట్టింపు చేయాలని, పనిదినాలను పెంచాలని డిమాండ్ చేశారు. దుకాణాదారులకు ఆదాయపన్ను - అమ్మకంపన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని - రైతులకు రబీపంట దిగుబడి మద్దతుధరపై 20 శాతం బోనస్ ఇవ్వాలని సూచించారు. మీడియా ముందు డిమాండ్ల పత్రాన్ని విడుదల చేశారు.

##ప్రధాని దేశానికి కొన్ని విషయాలు వెల్లడించాల్సి ఉంది. నవంబర్ 8 తర్వాత నల్లధనం ఏమేరకు వెలికి వచ్చింది? దేశానికి నోట్లరద్దు వల్ల తలెత్తిన నష్టం ఎంత? ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? సర్కార్ ఏదైనా నష్టపరిహారం ఇచ్చిందా? నోట్లరద్దు నిర్ణయానికి ముందు ప్రధాని ఎవరినైనా సంప్రదించారా? సంప్రదిస్తే నిపుణుల పేర్లు వెల్లడించాలి అని రాహుల్ అన్నారు. ఇతర డిమాండ్ల గురించి వివరిస్తూ.. బ్యాంకుల నుంచి డబ్బు విత్‌ డ్రాపై పరిమితులను ఎత్తివేయాలని - అవి ఉన్నంతకాలం ఏడాదికి 18 శాతం చొప్పున డిపాజిట్లపై వడ్డీ చెల్లించాలన్నారు.

ప్రధాని మోడీపై రాహుల్‌ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నోట్లరద్దు పేరిట ప్రధాని భయోత్పాత - ఆగ్రహ రాజకీయాల్ని అనుసరిస్తున్నారని మండిపడ్డారు. ప్రధాని భావజాలాన్ని ఓడించాలని పార్టీవర్గాలకు పిలుపునిచ్చారు. నవంబర్ 8న ప్రధాని మోడీ నోట్లరద్దు పేరిట యజ్ఞం చేస్తున్నట్టు చెప్పారని గుర్తు చేస్తూ.. దేశంలోని 1 శాతం సంపన్నుల్లో భాగమైన 50 కుటుంబాల కోసం నోట్లరద్దు యజ్ఞం మొదలుపెట్టారని, ఈ యజ్ఞంలో పేదలు - రైతులు - కూలీలు - మధ్యతరగతి ప్రజలు - చిన్న దుకాణాదారులు బలిపశువులయ్యారని ధ్వజమెత్తారు. భయం, ద్వేషాలను వ్యాపింపజేసే మోడీ-ఆరెస్సెస్ భావజాలాన్ని ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దేశ ఆర్థిక స్వాతంత్య్రాన్ని మోడీ దెబ్బతీసారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ అంటే అందరినీ కలుపుకొని వచ్చేపార్టీ అని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ అంటే అందరి భావనలకు విలువనిచ్చే, అందరినీ ఆదుకునే పార్టీ అని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీ విచ్ఛిన్నకర శక్తి అని అన్నారు. ప్రభుత్వాన్ని కొద్దిమంది కోసం నడుపడం.. పేదల నుంచి డబ్బు లాగేసుకొని కొద్దిమందికి కట్టబెట్టడం వారి లక్ష్యం. భయాన్ని, ఆగ్రహాన్ని వ్యాపింపజేసి వాటి ఆధారంగా పరిపాలించాలన్నది వారి ఉద్దేశం. మేం మోడీజీపై కొన్ని ప్రశ్నలు లేవనెత్తాం. ఆ ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాల్సి ఉంది అని రాహుల్ అన్నారు.

రాహుల్ ప్రశ్నాస్త్రాలు

-నవంబర్ 8 తర్వాత నల్లధనం కలెక్షన్లు ఎంత?

-ఆర్థిక వ్యవస్థకు నోట్లరద్దు వల్ల కలిగిన నష్టం ఎంత?

-తర్వాత నోట్లరద్దు వల్ల ఎంతమంది మరణించారు?

-మృతుల కుటుంబాలకు ఏదైనా పరిహారం చెల్లించారా?

-నోట్లరద్దుపై మోడీ సర్కారు సంప్రదించిన నిపుణులు ఎవరు?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/