Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీది ఐరన్ హ్యాండా?

By:  Tupaki Desk   |   20 Dec 2017 4:57 AM GMT
రాహుల్ గాంధీది ఐరన్ హ్యాండా?
X
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఏమాత్రం కాలం కలిసి రావడం లేదు... ఆయనకే కాదు, ఆయన ఎవరితో చేయి కలిపితే వారి పనీ అంతే అవుతోంది. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటికి సీఎంగా ఉన్న సమాజ్ వాది పార్టీ నేత అఖిలేశ్ యాదవ్‌ తో జట్టు కట్టారాయన. రాహుల్ తో పాటు అఖిలేశ్ కు అక్కడ దారుణమైన ఫలితాలు వెక్కిరించాయి.

రాజకీయ నాయకుడైన అఖిలేశ్ ఒక్కడికే కాదు, ఎన్నికల వ్యూహకర్త అయిన ప్రశాంత్ కిశోర్ కూ ఆ ఎన్నికలు మచ్చగా మారాయి. ఆ దెబ్బకు పీకే ట్రాక్ రికార్డు గాడి తప్పింది. ఆ తరువాత ఆయన తన బిచాణాను ఏపీకి మార్చారు... ఏపీలో వైసీపీ కోసం పనిచేసి నంద్యాల ఉప ఎన్నికతో తన సత్తా చూపించాలనుకున్నారు. కానీ... అక్కడా పీకేకి అపజయమే ఎదురైంది.

ఇక ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లోనూ రాహుల్ గాంధీ కోసం పనిచేసిన కుర్ర నేత - పాటిదాద్ అమానత్ ఆందోళన్ సమితి లీడర్ హార్దిక్ పటేల్ పాపం తనకున్న ఇమేజ్ మొత్తం పోగొట్టుకున్నాడు.24 ఏళ్ల హార్దిక్ పటేల్ గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. పెద్ద ఎత్తున ర్యాలీలలో పాల్గొన్నారు. బీజేపీని ఓడించాలని పిలుపునిచ్చారు. ఆయన సభలకు జనం భారీగా హాజరయ్యారు. హార్దిక్ ప్రచారంతో తాము అధికారంలోకి రావచ్చని కాంగ్రెస్ ఆశించింది. కానీ చివరకు బీజేపీ విజయం సాధించింది.

ఈ ఎన్నికల్లో స్వయంగా హార్దిక్ పోటీ చేయనప్పటికీ - ఆయన, కాంగ్రెస్ కలిసి బీజేపీని ఓడిస్తారని చాలామంది అంచనా వేశారు. కానీ, సాధ్యం కాలేదు. పైగా... హార్దిక్ అనేక ఆరోపణల్లో చిక్కుకుని తన ప్రతిష్ఠను కొంతవరకు పోగొట్టుకున్నారు. ఆయన కాంగ్రెస్ కు మద్దతివ్వడంతో బీజేపీ ఆయన్ను లక్ష్యంగా చేసుకుంది. ఈ క్రమంలో ఆయనకు సంబంధించినవిగా చెబుతున్న సెక్స్ వీడియోలు బయటకొచ్చాయి. వాటిని బీజేపీ కుట్రపూరితంగా మార్ఫింగ్ చేసి విడుదల చేసిందని ఆయన ఎంతగా ఆరోపణలను తిప్పికొట్టినా జనం పెద్దగా నమ్మినట్లు కనిపించలేదు. చిన్నవయసులోనే నాయకుడిగా ఎదిగిన హార్దిక్ పటేల్ వెంట సీనియర్ నేతలే తిరిగేవారు.. కానీ... ఈ రకమైన ఆరోపణలు ఆయన ఇమేజిని డ్యామేజీ చేశాయి. రాజకీయ ప్రభావాన్ని పక్కన పెడితే ఈ ఎన్నికల్లో రాహుల్ తో జత కట్టిన హార్దిక్ వ్యక్తిగతంగా ప్రతిష్ఠ - నమ్మకం కోల్పోయాడు.