Begin typing your search above and press return to search.

ఏపీ కోసం రాహుల్ ఆరాటం..ఓ కామెడీ

By:  Tupaki Desk   |   21 Jun 2018 4:53 PM GMT
ఏపీ కోసం రాహుల్ ఆరాటం..ఓ కామెడీ
X
ఏపీ రాజ‌కీయాల్లో కీల‌క ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నిక‌ల‌కు ఇంకా ఏడాది స‌మ‌యం ఉన్న‌ప్ప‌టికీ ప్రధాన పార్టీల‌న్నీ రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నాయి. ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి దూకుడు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర సంద‌ర్భంగా వైఎస్ జ‌గ‌న్ వేస్తున్న అడుగులు ఆ రాష్ట్రంలో హాట్ హాట్‌ గా మారుతున్న సంగ‌తి తెలిసిందే. రాబోయే ఎన్నిక‌ల్లో అధికారం కోసం జ‌గ‌న్ అస్త్రాల‌న్నింటినీ వ‌దులుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఇవ్వ‌ని హామీలు ఇస్తున్నారు. ఇలా జ‌గ‌న్ కీల‌క అడుగులు వేస్తున్న క్ర‌మంలో తాజాగా ఢిల్లీలో చోటుచేసుకున్న ప‌రిణామాలు ఆస‌క్తిక‌రంగా మారాయి.

కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ చార్జి ఊమెన్‌ చాందీ - జాతీయ ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు కె.రాజు - పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో పాటు ముఖ్య‌నేత‌లతో కూడిన బృందంతో సమావేశం అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తికరంగా మారాయి. ‘‘వైఎస్‌ రాజశేఖరరెడ్డి వేరు.. జగన్‌ వేరు. నిరుపేదల గురించి రాజశేఖరరెడ్డి ఆలోచించేవారు. కానీ జగన్‌ మాత్రం వ్యక్తిగత ప్రయోజనాల కోసమే ఆలోచిస్తారు. ఆయన స్వార్థపరుడు. కాంగ్రెస్‌ నిరుపేదలకు అండగా ఉంటుంది. జగన్‌ స్వభావం ఇందుకు విరుద్ధం. అందుకే మ‌నం జ‌గ‌న్‌ ను టార్గెట్ చేసుకోవాలి`` అంటూ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా ఓ కామెంట్ కూడా ఆయ‌న చేశారు. వైసీపీలో ఉన్న బలమైన నేతలంతా కాంగ్రెస్‌ భావజాలం కలిగినవారే కాబ‌ట్టి వారిని తిరిగి మన గూటికి ఆహ్వానించండి అంటూ హిత‌బోధ చేశారు.

అయితే, రాహుల్ చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌నకు ఏపీ రాజ‌కీయాల‌పై ఉన్న అవ‌గాహ‌న రాహిత్యాన్ని చాటుతున్నాయంటున్నారు. జ‌గ‌న్ విష‌యంలో కాంగ్రెస్ పార్టీ వ‌వ్య‌హ‌రించిన తీరును ప్ర‌జ‌లు ఎవ‌రూ మ‌ర్చిపోలేక‌పోతున్నార‌ని అంటున్నారు. జ‌గ‌న్ తండ్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి దుర్మ‌ర‌ణం అనంత‌రం...పార్టీని అధికారంలోకి తెచ్చిన నాయ‌కుడికి అండ‌గా నిల‌బ‌డాల్సింది పోయి వారి కుటుంబాన్ని క‌ష్టాల పాటు చేశార‌నే విష‌యం ఇప్ప‌టికీ ఏపీ ప్ర‌జ‌ల మదిలో ఉంద‌ని చెప్తున్నారు. దీంతోపాటుగా అప్పుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న టీడీపీతో క‌లిసి కుట్ర ప‌న్ని వైఎస్ జ‌గ‌న్‌పై కేసులు న‌మోదు చేశార‌ని భావిస్తున్నారు. మ‌రోవైపు త‌న తండ్రి చ‌నిపోయిన నాటి నుంచి వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల‌తో మ‌మేకం అవుతూ వారి ప‌క్షాన గ‌ళం విప్పుతున్న విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని అంటున్నారు. వీటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకునే ఇటీవ‌లి కాలంలో వైసీపీకి ప్ర‌జామోదం పెరుగుతోంద‌ని చెప్తున్నారు.

రాష్ట్ర విభ‌జ‌న ఫ‌లితంగా కాంగ్రెస్ పార్టీ ఏపీలో తుడిచిపెట్టుకుపోయింద‌నేది కాంగ్రెస్ నేత‌లు కూడా నిర్మొహ‌మాటంగా చెప్పే మాట‌. అంతేకాకుండా పార్టీ నేత‌లు కూడా త‌మ భ‌విష్య‌త్‌ను వెతుక్కుంటూ అధికార టీడీపీలోకి, ప్ర‌తిప‌క్ష వైసీపీలో చేరిపోయారు. ఇదే స‌మ‌యంలో అధికార తెలుగుదేశం పార్టీ కేంద్రంపై పోరాట గ‌ళం వినిపిస్తూ క్షేత్ర‌స్థాయిలో బ‌ల‌ప‌డుతోంది. ఎక్క‌డిక‌క్క‌డ స‌మ‌స్య‌ల‌పై దీక్ష‌లు చేస్తూ మ‌రింత బ‌లోపేతం అవుతున్న స‌మ‌యంలో...వైసీపీ సైతం చేరిక‌ల‌ను ప్రోత్స‌హిస్తోంది. టీడీపీకి స‌మ ఉజ్జీగా ఏపీలో వైసీపీ మాత్ర‌మే ఉంద‌న్న‌ది నిజం. బీజేపీ, జ‌న‌సేన‌లు ప‌రిమిత సీట్ల‌కోసమే పోటీ ప‌డాల్సి వ‌స్తుంద‌నేది కాద‌న‌లేని అంశం.

ఇలా ఏపీ రాజ‌కీయాల ముఖ‌చిత్రం హాట్ హాట్‌గా సాగుతున్న స‌మ‌యంలో...ఎక్క‌డ కూడా కాంగ్రెస్ పేరు లేదు. ఆ పార్టీ బ‌ల‌మైన పోటీ కాదు క‌దా...క‌నీసం అన్ని సీట్లల్లో పోటీ చేస్తుందా? అనే విష‌యంలోనే హ‌స్తం పార్టీ ఏపీ నేత‌ల‌కు అస్ప‌ష్ట‌త ఉందనే టాక్ ఉంది. ఇలాంటి స‌మ‌యంలో ఇత‌ర పార్టీల నుంచి తిరిగి కాంగ్రెస్ గూటికి నాయ‌కులు రావ‌డం అనేది సాధ్య‌మ‌య్యే ప‌ని కాదు. ఇక రాహుల్ ఆర్డ‌ర్ వేసిన‌ట్ల కాంగ్రెస్ నేత‌లు జ‌గ‌న్ పార్టీని టార్గెట్ చేయ‌డం వ‌ల్ల ఫ‌లితం ఏం ఉంటుందో ఆలోచించుకోవాల్సిన సంగ‌తే. బీజేపీపై ఏపీలో పెరుగుతున్న వ్య‌తిరేక‌త త‌మ‌కు క‌లిసి వ‌స్తుంద‌నేది రాహుల్ అంచ‌నా అయిన‌ప్ప‌టికీ...ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఆ లెక్క‌లు అధికార టీడీపీ, ప్ర‌తిప‌క్ష వైసీపీ అనంత‌రం జ‌న‌సేన‌కే ద‌క్కుతుంద‌నేది కాద‌న‌లేని నిజ‌మ‌ని అంటున్నారు.

వీటితో పాటుగా జగ‌న్ ప్రజాక్షేత్రంలో ఉండి నాయ‌కుడిగా ఎదిగిన తీరుకు...రాహుల్ గాంధీ హ‌క్కుభుక్తంగా అధ్య‌క్ష ప‌ద‌విని పొందిన తీరుకు స్ప‌ష్ట‌మైన తేడా ఉంద‌ని ప‌లువురు నొక్కిచెప్తున్నారు. ఇంతేకాకుండా..ఏపీలో తెలుగుదేశం పార్టీతో లోపాయికారి పొత్తు పెట్టుకున్న తీరును సైతం ప్ర‌జ‌లు గ‌మ‌నించార‌ని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ బ‌లోపేతం గురించి ఆ పార్టీనేత‌ల‌కే అనేక అనుమానాలున్నాయ‌ని అంటున్నారు. అధికార టీడీపీని వ‌దిలేసి..ప్ర‌తిప‌క్ష పార్టీని వ‌దిలేయ‌డం అనేది కాంగ్రెస్‌-టీడీపీల కుమ్మ‌క్కుకు తార్కాణంగా నిలుస్తుంద‌ని...ఇది ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని స్ప‌ష్టం చేస్తున్నారు.