Begin typing your search above and press return to search.

కోరి సాధించుకున్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితా? 'ముట్టడి' కి 14 రోజుల రిమాండ్

By:  Tupaki Desk   |   2 May 2022 3:28 AM GMT
కోరి సాధించుకున్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితా? ముట్టడి కి 14 రోజుల రిమాండ్
X
‘కోరి సాధించుకున్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితా?’ అన్న పదాలు చూసినంతనే చాలామంది తెలంగాణవాదులు నొసలు చిట్లిస్తారు. తెలంగాణ మీద విషం కక్కు ప్రయత్నంగా కొందరు అభివర్ణిస్తారు. తెలంగాణ ఇమేజ్ ను దెబ్బ తీసే కుట్రగా మరికొందరు భావిస్తారు. పలువురు ఏదో ఒకటి అనుకునే వారే. కొందరు మాత్రం నిజాన్ని నిజాయితీగా చూస్తూ.. నిజమే కదా? అనే వారు లేకపోలేదు. పోరాడి సాధించుకున్న రాష్ట్రం అధికార పార్టీ రాజ్యంగా మారిపోతే కష్టం. ఉద్యమ పార్టీగా పేరున్న టీఆర్ఎస్ పార్టీని.. తెలంగాణ రాష్ట్రం సాధించిన వేళ.. పార్టీ అధినేత కేసీఆర్ నోటి నుంచి ఒక విలువైన మాట వచ్చింది.

తమది ఇప్పటివరకు ఉద్యమ పార్టీ అని.. ఇకపై తాము రాజకీయ పార్టీగా అవతరిస్తామని.. ఆ దిశగా అడుగులు వేస్తామని చెప్పినప్పుడు ఎవరికి కూడా దాని మర్మం అర్థం కాలేదు. గులాబీ బాస్ చేతిలో రాష్ట్రాన్ని పెట్టిన తర్వాత..ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల్నిచూసిన వారు ముక్కున వేలేసుకునే పరిస్థితి. పోరాడి సాధించుకున్న తెలంగాణలో ‘నిరసన’.. ‘ఆందోళన’ అన్నవి చాలా.. చాలా చిన్న అంశాలు. ఎందుకంటే.. తెలంగాణ ఆస్తిత్వం మొత్తం ఈ రెండింటి మధ్యనే తిరుగుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు.

ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలకు విరుద్ధంగా వ్యవహరించే వారిని.. ఆందోళన చేసిన వారిని.. నిరసన వ్యక్తం చేసే వారి విషయంలో ఎంత కఠినంగా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదే పాలసీని ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక తెలంగాణ కోసం పని చేసే వారి విషయంలో వ్యవహరించి ఉంటే.. అసలు తెలంగాణ కల సాధ్యమయ్యేదా? ఎందుకు కాదు.. అలాంటివెన్నో చూసే కదా.. తెలంగాణ సాధించుకున్నది అన్న వాదన ఎవరైనా వినిపిస్తే.. వారి అమాయకత్వానికి జాలి పడటంతప్పించి ఇంకేమీ చేయలేం.

ఎందుకంటే.. తెలంగాణ సాధనలో భాగంగా.. పలు కార్యక్రమాలకు పిలుపునిచ్చినప్పుడు ఇప్పటి ప్రభుత్వం ఎలా అయితే.. నిరసనకారుల్ని.. ఆందోళనకారుల్ని ఇంట్లో నుంచి కూడా బయటకు రాకుండా ఆంక్షలు విధిస్తుందో తెలిసిందే. నిరసనల కోసం సిద్ధమవుతున్న వారిని అదుపులోకి తీసుకొని.. రోజులు తరబడి జైల్లోనే ఉండే పరిస్థితి ని తీసుకురావటం ద్వారా.. సహజ పరిణామమైన ఆందోళన విషయంలోనూ ఆచితూచి అన్నట్లు వ్యవహరిస్తున్న పరిస్థితి. తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కేసీఆర్ కావొచ్చు.. ఆయన పార్టీకి చెందిన నేతలు కావొచ్చు.. ఉద్యమంలో కీలక భూమిక పోషించిన కోదండరామ్ కావొచ్చు.. మరొకరు కావొచ్చు. వారి కేసులు పెట్టారు కానీ..అరెస్టు చేసేసి జైలుకు పంపే ‘ఉద్యమాన్ని’ మాత్రం చేయలేదు. ఈ అంశంలోనే తెలంగాణ రాష్ట్రం.. రాజ్యంగా మారిపోయిందన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు.

తాజాగా.. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగమైన ఎన్ ఎస్ యూ ఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ విషయానికే వద్దాం. కాంగ్రెస్ పార్టీ కీలక నేత రాహుల్ గాంధీ సభను ఉస్మానియా వర్సిటీ ప్రాంగణంలో నిర్వహించాలని భావించారు. అందుకు సానుకూలత ఎదురు కాని వేళ.. ఉస్మానియా వీసీ ఛాంబర్ ను ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు వీసీ ఛాంబర్ ను ముట్టడించారు.

దీంతోరంగంలోకి దిగిన పోలీసులు ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మరో 18 మంది మీదా కేసులు నమోదు చేశారు.ఇంతకూ వారి మీద పెట్టిన కేసు ఏమిటో తెలుసా? మహిళా కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా ప్రవర్తించారని. కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం రిమాండ్ కు తరలించారు. ఇదంతా చదివిన తర్వాతేమంటారు?