Begin typing your search above and press return to search.

మోడీపై రాహుల్‌ కు డౌట్‌..ముంద‌స్తుకు రెడీ

By:  Tupaki Desk   |   26 Dec 2017 8:17 AM GMT
మోడీపై రాహుల్‌ కు డౌట్‌..ముంద‌స్తుకు రెడీ
X
కాంగ్రెస్ అధ్యక్ష పీఠాన్ని అధిష్ఠించిన రాహుల్ గాంధీ త‌న రాజ‌కీయ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్ప‌టికే పార్టీ ప‌రంగా బ‌లోపేతానికి శ్రీ‌కారం చుట్టిన రాహుల్ ఈ క్ర‌మంలో త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థుల‌ను సైతం ఓ కంట క‌నిపెడుతూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో ప్ర‌ధానంగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోడీ వ్యూహాలకు కౌంట‌ర్ రెడీ చేస్తున్నారు. ఇందులో భాగంగా ముంద‌స్తు వ్యూహానికి తెర‌తీసిన‌ట్లు తెలుస్తోంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ లోక్‌సభ ఎన్నికలను 2019కి బదులు 2018లో నిర్వహించవచ్చునని రాహుల్ అనుమానిస్తున్నట్లు కాంగ్రెస్ వర్గీయులు చెబుతున్నారు.

అధ్య‌క్ష పీఠం చేప‌ట్టిన అనంత‌రం రాహుల్ గాంధీ కొద్దిరోజుల క్రితం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో తాజా వ్యూహంపై చర్చించినట్లు తెలిసింది. బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటినుంచే తగు ఏర్పాట్లు చేసుకోవటం మంచిదని రాహుల్ గాంధీ పార్టీవారికి స్పష్టం చేశారని తెలిసింది. 2018లో చత్తీస్‌ గఢ్ - కర్నాటక - మధ్యప్రదేశ్ - మేఘాలయ - మిజోరం - నాగాలాండ్ - రాజస్థాన్ - త్రిపుర శాసనసభలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్‌ సభకు ముందస్తు ఎన్నికలు జరిపించాలనుకుని మోడీ భావించిన పక్షంలో ఈ రాష్ట్రాలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తారు. ఇదే జరిగితే తగిన వ్యూహాన్ని ఇప్పటినుంచే అమలు చేయాలని రాహుల్ భావిస్తున్నట్లు ఏఐసీసీ నాయకుడొకరు తెలిపారు.

2018 ఎన్నికలకు ఒక కార్యాచరణ పథకాన్ని రాహుల్ ఇప్పటికే సిద్ధం చేసుకున్నారని - దీనిపై మరింత చర్చ జరిపిన అనంతరం తుది కార్యచరణను ఆచరణలో పెడతారనే మాట వినిపిస్తోంది. కిందిస్థాయి నుండి పని చేసుకురావాలని, కార్యకర్తలు - నాయకులను మోహరించి ప్రజలను కలుసుకునే పని ప్రారంభించాలన్నది రాహుల్ ఆలోచన. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న చాలా రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నందున ప్రజల్లో ఏర్పడుతున్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని కార్యచరణ పథకాన్ని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. మధ్యప్రదేశ్ - చత్తీస్‌ గఢ్ రాష్ట్రాల్లో బీజేపీ ఇంత వరకు వరుసగా మూడుసార్లు గెలిచింది. గత లోక్‌ సభ ఎన్నికల్లో ఎంపీలోని 29 సీట్లలో 26 చోట్ల - చత్తీస్‌ గఢ్‌ లోని 11 సీట్లలో 10 స్థానాలకు బీజేపీ గెలుచుకుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఈ సీట్లను నిలబెట్టుకోవటం చాలాకష్టం. అందుకే ఈ రెండు రాష్ట్రాల్లో కష్టపడి పని చేస్తే కాంగ్రెస్ సునాయసంగా అధికారంలోకి వస్తుందన్నది రాహుల్ ఆలోచన.

మహారాష్ట్ర - ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా బీజేపీ మెజారిటీ లోక్‌ సభ సీట్లు గెలుచుకుంది. మహారాష్ట్ర లో 48 సీట్లలో 41 స్థానాలను - యూపీలోని 80 సీట్లలో 71 స్థానాలను గెలుచుకుంది. గ్రామాన్ని యూనిట్‌ గా తీసుకుని పనిచేస్తే ఈ రెండు రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లు గెలుచుకోవచ్చునని కాంగ్రెస్ అధ్యక్షుడు అంచనా వేస్తున్నారు. ఇటీవల గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి తాము పనిచేస్తే 15 లేదా 16 ఎంపీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందని రాహుల్ అంచనా. ఉత్తర ప్రదేశ్ - మధ్యప్రదేశ్ - చత్తీస్‌ గఢ్ - రాజస్తాన్ - ఝార్ఖండ్ - హిమాచల్ ప్రదేశ్ - హర్యానా తదితర రాష్ట్రాల్లో బీజేపీ ఇంకా ముందుకు వెళ్లే పరిస్థితిలో లేదు. ఈ రాష్ట్రాల్లో బీజేపీ గత లోక్‌ సభ ఎన్నికల్లో సాధించిన సీట్లను తిరిగి దక్కించుకోవడం ప్రశ్నార్థకమే. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు మంచిరోజులు ఖాయమని రాహుల్ భావిస్తున్నారు. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలచుకోవాలని ఆయన ఆలోచిస్తున్నారు. స్థూలంగా గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఊపందుకున్న కాంగ్రెస్ పార్టీ కర్నాటక తదితర రాష్ట్రాల ఎన్నికలతోపాటు లోక్‌ సభ ఎన్నికలకు అప్పుడే సమాయత్తం అవుతోందని కాంగ్రెస్ వ‌ర్గాలు అంటున్నాయి.