Begin typing your search above and press return to search.
కోపంతో చిందులేసిన యువరాజు
By: Tupaki Desk | 21 Oct 2015 1:40 PM GMTకూల్ గా ఉన్నట్లు కనిపించే చొట్టబుగ్గల యువరాజుకు పిచ్చ కోపం వచ్చేసింది. పదేళ్ల పాటు నాన్ స్టాప్ అధికారంతో బయటకు రావటానికి పెద్దగా ఇష్టపడక.. ఏడాదికోమారు ఏదో ఒక ప్రోగ్రాం పేరుతో పర్యటనలు చేసిన రాహుల్.. దేశం అట్టుడికిపోయిన ఉదంతాలపై స్పందించేవారు కాదు. ఎప్పుడైతే అధికారం చేజారి.. విపక్షంలోకి వెళ్లిపోయారు ఒక్కసారిగా కళ్లు తెరిచారు.
ఏక్కడ ఏం జరిగినా సరే.. వాయు వేగంతో పరుగులు తీస్తున్న ఆయన.. అక్కడ విలేకరులు అడిగే ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పటం లేదు. ప్రశ్నల మీద ప్రశ్నలు వేసే మీడియా దెబ్బకు మండిపడుతున్న ఆయన సహనం కోల్పోయి చిందులు వేస్తున్నారు.
తాజాగా హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్ లో ఇద్దరు చిన్నారుల్ని సజీవ దహనం చేసిన ఘటనలో బాధిత తల్లిదండ్రుల్ని పరామర్శించేందుకు వాలిపోయిన రాహుల్ కు చిత్రమైన అనుభవం ఎదురైంది.
ఇంతకీ మీరు.. బాధితులతో ఫోటోలు దిగేందుకు వచ్చారా? లాంటి ప్రశ్నలతో రాహుల్ సహనం కోల్పోయారు. అలా అడగటం తనను అవమానించటమేనని చెప్పిన ఆయన.. విలేకరులు అడిగిన ప్రశ్నలు బాధితుల్ని అవమానించేలా ఉన్నాయని వ్యాఖ్యానించారు. మీడియా ప్రతినిధులపై సహనం కోల్పోయిన ఆయన తీవ్రస్థాయిలో మండిపడటం కెమేరాల సాక్షిగా రికార్డు అయ్యింది.
ఫరీదాబాద్ ఘటనను రాజకీయం చేసేందుకు రాజకీయనేతలు పోటెత్తటంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు రాహుల్ మండిపడ్డారు. తాను మళ్లీ.. మళ్లీ వస్తానని ఆవేశంగా వ్యాఖ్యానించిన రాహుల్ ఇంతగా బ్యాలెన్స్ కోల్పోవాల్సిన అవసరం ఉందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.