Begin typing your search above and press return to search.

రాహుల్‌ కు మోదీ అడ్డంగా దొరికిపోయారుగా!

By:  Tupaki Desk   |   20 Feb 2018 6:31 AM GMT
రాహుల్‌ కు మోదీ అడ్డంగా దొరికిపోయారుగా!
X
కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత నిజంగానే రాహుల్ గాంధీలో స‌త్తా చాలా వేగంగానే పెరుగుతోంద‌ని చెప్పాలి. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉండ‌గానే... కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన రాహుల్ గాంధీ... ఆ ఎన్నిక‌ల్లో మోదీకి నిజంగానే చుక్కలు చూపారు. కాస్తంత ముందుగా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడిగా రాహుల్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు తీసుకుని ఉండి ఉంటే.. మోదీ ప‌రిస్థితి ఎలా ఉండేదో గానీ... ఎన్నిక‌ల ప్ర‌చారం ముగుస్తుంద‌న‌గా రాహుల్‌కు అవ‌కాశం ద‌క్కితే... చావు త‌ప్పి క‌న్ను లొట్ట‌బోయిన చందంగా గుజ‌రాత్ ఎన్నిక‌ల్లో బీజేపీ గెలిచేసింది. అయితే రాహుల్ మాత్రం త‌న స‌త్తా ఏ పాటిదో అన్న విష‌యాన్ని మాత్రం బాగానే నిరూపించుకున్నారు. ఆ త‌ర్వాత నుంచి ప్ర‌తి అంశంపై బీజేపీని, ఆ పార్టీ నేత‌ల‌ను, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ స‌ర్కారు వైఫ‌ల్యాల‌ను ఎండ‌గ‌డుతూ సాగుతున్న రాహుల్ నానాటికీ ప‌రిణ‌తి చెందిన రాజ‌కీయ‌వేత్త‌గా స‌రికొత్త రూపులో క‌నిపిస్తున్నారు. అప్ప‌టిదాకా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడిగానే కాకుండా గ్రాండ్ ఓల్డ్ పార్టీ ఎంపీగా అధికార ప‌క్షంతో మొట్టికాయ‌లు వేయించుకున్న మాదిరిగా వ్య‌వ‌హ‌రించిన రాహుల్‌... పార్టీ అధ్య‌క్ష బాధ్య‌త‌లు స్వీక‌రించిన మ‌రుక్ష‌ణ‌మే త‌న‌లోని సిస‌లైన రాజ‌కీయ నేత‌ను బ‌య‌ట‌కు తీశార‌ని చెప్పాలి.

అసలిప్పుడు రాహుల్ గాంధీ సంధిస్తున్న ఏ ఒక్క ప్ర‌శ్న‌కు కూడా స‌మాధానం చెప్పే ద‌మ్మూ దైర్యం బీజేపీ వ‌ద్ద లేవ‌నే చెప్పాలి. ఎందుకంటే... రాహుల్ గాంధీ స్పాంటేనియ‌స్‌ గా వ‌దులుతున్న మాట‌ల తూటాలు బాగానే పేలుతున్నాయి. అప్ప‌టిదాకా బీజేపీ సంధించిన సెటైర్ల‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోయిన రాహుల్‌... ఇప్పుడు అవే సెటైర్ల‌ను మ‌రింత స్పాంటేనియ‌స్‌ గా సంధిస్తూ త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఇప్పుడు దేశ‌మంతా బ్యాంకుల‌కు కుచ్చు టోపీ పెట్టిన నీర‌వ్ మోదీ - విక్ర‌మ్ కొఠారీలకు సంబంధించిన చ‌ర్చే న‌డుస్తోంది. ఒక‌టి కాదు - రెండు కాదు వేలాది కోట్ల రూపాయ‌ల మేర బ్యాంకుల‌ను బురిడీ కొట్టించేసిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా - నీర‌వ్ మోదీ విదేశాల‌కు తుర్రుమంటే... చేతులు క‌ట్టుకుని చూస్తున్న పిల్లాడిలా మోదీ స‌ర్కారు వ్య‌వ‌హ‌రించింద‌న్న వాద‌న లేక‌పోలేదు. అదే స‌మ‌యంలో ఏళ్ల త‌ర‌బ‌డి నీర‌వ్ మోదీ.. పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకుకు క‌న్న‌మేసి కోట్లాది రూపాయ‌ల‌ను లాగేస్తున్నా... అస‌లు ఈ గుట్టును క‌నుక్కోలేక‌పోయిన రిజ‌ర్వ్ బ్యాంకు - ఇత‌ర ఆడిటింగ్ సంస్థ‌ల‌ను ప‌ల్లెత్తు మాట అన‌లేక‌పోయిన మోదీ సర్కారుపై నిన్న రాహుల్ గాంధీ సంధించిన విమ‌ర్శ‌లు నిజంగానే బాగా పేలాయ‌ని చెప్పాలి.

గ‌డ‌చిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్డీఏ ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా న‌రేంద్ర మోదీ రంగంలోకి దిగితే... యూపీఏ అభ్య‌ర్థిగా రాహుల్ గాంధీ బ‌రిలోకి దిగారు. ఈ క్ర‌మంలో నాడు మోదీ చేసిన ప్ర‌సంగాల‌ను- పంచ్ డైలాగుల‌ను మ‌నం ఇప్ప‌టికీ మ‌రిచిపోలేం. అయితే ఇప్పుడు దేశంలో జ‌రుగుతున్న ఆర్థిక నేరాల‌పై త‌న‌దైన రీతిలో సెటైర్లు వేసిన రాహుల్ గాంధీ... నాడు మోదీ నోట వినిపించిన మాట‌ల‌నే ఇప్పుడు త‌న ప్ర‌శ్న‌లుగా మార్చుకుని సంధించేశారు. గత ఎన్నికలప్పుడు తనను తాను ‘దేశానికి కాపలాదారుణ్ని’ అని చెప్పుకొన్న నరేంద్ర మోదీ... కోట్లాది రూపాయలకు ఎగనామం పెట్టిన నీరవ్‌ మోదీ పారిపోయినప్పుడు ఎక్కడున్నారని రాహుల్‌ ప్రశ్నించారు. *మొదట లలిత్‌ మోదీ - తర్వాత విజయ్‌ మాల్యా - ఇప్పుడు నీరవ్‌ మోదీ పారిపోతున్నప్పుడు... ‘దేశ కాపలాదారు’ ఏమయ్యారు? నేను అవినీతి చెయ్యను. ఎవరినీ అవినీతిని చెయ్యనివ్వను అన్న మోదీ మౌనానికి కారణమేంటో తెలుసుకోవాలని యావద్దేశం ఉత్సకతతో ఉంది* అంటూ రాహుల్ సంధించిన సెటైర్‌ కు నిజంగానే మోదీ నోట మాట వ‌చ్చే ప‌రిస్థితే క‌నిపించ‌డం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.