Begin typing your search above and press return to search.

కింద ప‌డిన ఫోటోగ్రాఫ‌ర్ ను పైకి లేపిన రాహుల్

By:  Tupaki Desk   |   25 Jan 2019 11:22 AM GMT
కింద ప‌డిన ఫోటోగ్రాఫ‌ర్ ను పైకి లేపిన రాహుల్
X
చిన్న చిన్న విష‌యాలే కానీ కొన్ని సంద‌ర్భాల్లో పెద్ద ఎత్తున ప్ర‌భావాన్ని చూపిస్తుంటాయి. తాజాగా అలాంటిదే ఒక‌టి చోటు చేసుకుంది. త‌న క‌ళ్ల ముందు ప‌డిపోయిన ఒక ఫోటోగ్రాఫ‌ర్ ను పైకి లేపేందుకు కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ స్పందించిన తీరును ప‌లువురు ప్ర‌శంసిస్తున్నారు. త‌న‌ను క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నంలో అదాటున కింద ప‌డిన ఫోటోగ్రాఫ‌ర్ ను వెంట‌నే పైకి లేపేందుకు త‌న‌కు తానుగా ఉరుక్కుంటూ ముందుకొచ్చిన రాహుల్ తీరుకు సోష‌ల్ మీడియాలో తెగ పొగిడేస్తున్నారు.

స‌ద‌రు వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. ఈ రోజు (శుక్ర‌వారం) ఉద‌యం ఒడిశా రాజ‌ధాని భువ‌నేశ్వ‌ర్ ఎయిర్ పోర్ట్ లో చోటు చేసుకున్న ఈ ఉదంతం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. కింద‌ప‌డిన ఫోటోగ్రాఫ‌ర్ ను పైకి లేపేందుకు రాహుల్ రియాక్ట్ అయిన తీరును ప్ర‌స్తావిస్తూ.. ప్ర‌ధాని మోడీపై విరుచుకుప‌డ‌టానికి ఇదో అస్త్రంగా వాడుతున్నారు కాంగ్రెస్ నేత‌లు.

2013లో గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా మోడీ వ్య‌వ‌హ‌రిస్తున్న వేళ‌.. ఆయ‌న ఒక స‌భ‌లో మాట్లాడుతుండ‌గా.. అప్ప‌టి రాష్ట్ర డీజీపీ అమితాబ్ పాథ‌క్ ఒక్క‌సారి కుప్ప‌కూలారు. అయితే.. అదేమీ ప‌ట్ట‌న‌ట్లుగా మోడీ వ్య‌వ‌హ‌రించ‌టం ప‌లు విమ‌ర్శ‌ల‌కు గురైంది. ఆ త‌ర్వాత తాను కుదుట‌ప‌డిన‌ట్లుగా డీజీపీ పేర్కొన్నారు. అప్ప‌టి వీడియోను మోడీ వ్య‌తిరేకులు అదేప‌నిగా షేర్ చేస్తుంటారు.

తాజాగా కాంగ్రెస్ స‌భ్యులు హ‌సీబా రియాక్ట్ అవుతూ.. రాహుల్ ను పొగుడుతూ.. మోడీని త‌ప్పు ప‌ట్టే ప్ర‌య‌త్నం చేశారు. కింద‌ప‌డిన ఫోటోగ్రాఫ‌ర్ కు సాయం అందించేందుకు కాంగ్రెస్ చీఫ్ ఎలా ప‌రుగులు పెట్టారో చూడండి అంటూ ఆమె ట్వీట్ చేశారు. గ‌తంలో త‌న క‌ళ్ల ఎదుట రాష్ట్ర డీజీపీ అధికారి కుప్ప‌కూలినా త‌న‌కుప‌ట్ట‌న‌ట్లుగా మోడీ వ్య‌వ‌హ‌రించార‌ని.. క‌నీసం త‌న ప్ర‌సంగాన్నికూడా ఆప‌లేద‌ని ఆమె గుర్తు చేశారు. నాడు జ‌రిగిన ఘ‌ట‌న‌ను గుర్తు తెస్తూ.. మోడీకి.. రాహుల్ కు మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఒక‌రి ప్రాణాలు పోతున్నా మోడీజీ ప‌ట్టించుకోర‌ని.. త‌న స్పీచ్ ను కంటిన్యూ చేస్తార‌ని చుర‌క‌లేసిన ఆమె.. మీ ప‌క్క‌నున్న వ్య‌క్తి హ‌ఠాత్తుగా గుండెపోటుకు గురైతే మీరు ఆ వ్య‌క్తికి సాయం చేసేందుకు ఉరుకులు పెడ‌తారు. కానీ.. మ‌న ప్ర‌ధాని అలా కానే కాదంటూ 2013 నాటి వీడియోను ఆమె షేర్ చేశారు. విష‌యం ఏదైనా స‌రే..చ‌ప్పున త‌మ‌కు త‌గ్గ వాద‌న‌తో ప్ర‌చారానికి తీసుకెళ్ల‌టం నేత‌ల‌కు చేత‌నైనంత బాగా మ‌రెవ‌రికీ రాదేమో?