Begin typing your search above and press return to search.

రాహుల్‌.. పేద వాడి అన్నం తిన్నారే!

By:  Tupaki Desk   |   16 Aug 2017 10:17 AM GMT
రాహుల్‌.. పేద వాడి అన్నం తిన్నారే!
X
కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అనూహ్యంగా ఓ పేద వాడిగా మారిపోయారు. క‌ర్ణాట‌క రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్ర‌భుత్వం రాష్ట్రంలోని పేద‌ల ఆక‌లి తీర్చేందుకు ఏర్పాటు చేసిన పేద‌ల క్యాంటిన్‌కు రాహుల్ విచ్చేశారు. అక్క‌డ ఏర్పాటు చేసిన భోజ‌నాన్ని రూ.10 వెచ్చించి మ‌రీ తీసుకుని రుచి చూశారు. ఎంతో బాగుంద‌ని కితాబిచ్చారు కూడా. ఆయ వెంటే ఉన్న సీఎం సిద్ద‌రామ‌య్య కూడా ప‌ది రూపాయ‌ల భోజ‌నాన్ని రుచి చూశారు. రాష్ట్రంలోని పేద‌లు ఆక‌లితో అల‌మ‌టించ‌కూడ‌ద‌నే ఉద్దేశంతోనే తాము ఈ క్యాంటిన్ల‌ను ప్రారంభించిన‌ట్టు చెప్పారు.

ఇందిరా క్యాంటిన్‌ గా పిలుచుకునే ఈ క్యాంటిన్‌ ల‌ను ప్ర‌స్తుతం రాష్ట్ర రాజ‌ధాని బెంగ‌ళూరులో ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన రాహుల్ గాంధీ క్యాంటిన్ ను ప్రారంభించారు. అనంత‌రం తానే స్వ‌యంగా రూ.10 వెచ్చించి భోజ‌నం తీసుకుని రుచి చూశారు. రూ.5 కే ఉద‌యం పూట టిఫెన్ కూడా ల‌భిస్తుంద‌ని సీఎం సిద్ద‌రామ‌య్య ఈ సంద‌ర్భంగా తెలిపారు. అనేక మంది కార్మికులు, ఉపాధి కోసం న‌గ‌రానికి వ‌చ్చేవారు మ‌ధ్యాహ్నం పూట ఖాళీ క‌డుపుతో ఉండ‌కూడ‌ద‌నే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్టు సీఎం చెప్పారు.

రాబోయే రోజుల్లో మైసూరు స‌హా ప‌లు ముఖ్య‌ప‌ట్ట‌ణాల్లో ఇందిరా క్యాంటీన్ల‌ను ప్రారంభిస్తామ‌న్నారు. అనంత‌రం, రాహుల్ గాంధీ మాట్లాడుతూ... బెంగుళూరులో ఉన్న ప్ర‌తి పేద వ్య‌క్తికి అన్నం పెట్టాల‌న్నదే ఈ ప‌థ‌కం ఉద్దేశ‌మ‌ని అన్నారు. ఖాళీ క‌డుపుతో ఎవ్వ‌రూ ఉండ‌కూడ‌ద‌ని అన్నారు. నాణ్య‌మైన ఆహారాన్ని ఇందిరా క్యాంటీన్ ద్వారా అతి త‌క్కువ ధ‌ర‌కే అందిస్తామ‌ని తెలిపారు. ఈ ప‌థ‌కాన్ని క‌ర్ణాట‌క‌లోని ఇత‌ర న‌గ‌రాల్లోనూ విస్త‌రించ‌నున్నట్లు పేర్కొన్నారు. కాగా, ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో భాగంగా కాంగ్రెస్ దీనిని ఇప్ప‌టికి ఏర్పాటు చేయ‌డం గ‌మ‌నార్హం. మ‌రోప‌క్క‌, దీనిపై ఇప్ప‌టికే విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నిక‌లు ఉన్నందున కాంగ్రెస్ ఇలాంటి జిమ్మిక్కుల‌కు పాల్ప‌డుతోంద‌ని బీజేపీ నేత‌లు విమ‌ర్శించారు.