Begin typing your search above and press return to search.
రాహుల్ క్రైస్తవుడు..గుడికి ఎలా వెళ్తాడు?
By: Tupaki Desk | 28 Sep 2017 10:39 AM GMTతనదైన శైలిలో ప్రత్యేక అంశాలపై కామెంట్లు చేస్తూ తరచుగా వార్తల్లో నిలిచే బీజేపీ ఎంపీ సుబ్రమణ్య స్వామి మళ్లీ తెరమీదకు వచ్చారు. ఈ దఫా కొత్త చర్చకు ఇంకా చెప్పాలంటే వివాదానికి తెరతీశారు. అందులోనూ స్వామి అత్యంత తరచుగా విమర్శలు చేసే కాంగ్రెస్ పార్టీపై, ఆ పార్టీ యువనేత రాహుల్ గాంధీపై ఆసక్తికరమైన డౌట్ లేవనెత్తారు. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో మూడు రోజుల పాటు పర్యటించిన రాహుల్...కొన్ని ఆలయాలను కూడా సందర్శించి పూజలు నిర్వహించారు. ``హిందు వ్యతిరేక పార్టీ కాంగ్రెస్`` అనే ముద్రను తొలగించుకోవడానికి రాహుల్ ఇలా ఆలయాల పర్యటనకు పూనుకున్నారన్న కామెంట్లు ఈ సందర్భంగా వచ్చాయి.
అయితే, ఈ చర్చోపచర్చలకు కొనసాగింపుగా అన్నట్లుగా తనదైన శైలిలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆలయాల పర్యటనపై సుబ్రమణ్యస్వామి తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ ఆలయాల్లో పర్యటించడం సరికాదని స్వామి అన్నారు. అసలు ఆయన హిందువే అని ముందు నిరూపించుకోవాలని సవాలు విసిరారు. ``ఆయన క్రిస్టియన్ అని నాకు అనుమానంగా ఉంది.. టెన్ జన్ పథ్ లో చర్చి కూడా ఉంది`` అని స్వామి ఆరోపించారు. హిందూ సంప్రదాయాల ప్రకారం ఇతర మతస్థులు ఆలయాల్లో ప్రవేశం చేసే సమయంలో డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుందని గుర్తు చేశారు. మరోవైపు రాహుల్ పర్యటనను బీజేపీ తిప్పికొట్టింది. ఎన్నికల ముందే రాహుల్ గాంధీకి హిందువుల దేవాలయాలు గుర్తుకువచ్చాయని పేర్కొంటూ ఇది కేవలం కంటితుడుపు చర్య అని, ఆయన హిందువులకు చేసేది ఏమీ లేదని ఎద్దేవా చేసింది.
కాగా...హిందూ వ్యతిరేక - మైనారిటీలను బుజ్జగించే పార్టీ అనే ముద్రనుంచి కాంగ్రెస్ ను గట్టెక్కించడానికి కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగంగానే పలు హిందూ దేవాలయాలను సందర్శించి రాహుల్ పూజలు చేశారు. ద్వారకలో కృష్ణుడి ఆలయం సందర్శనతో ప్రారంభించి పలు దేవాలయాల్లో రాహుల్ పూజలు చేశారు. తద్వారా తాము హిందూ వ్యతిరేకులం కాదనే సందేశాన్నిస్తున్నారు.రాజ్ కోట్ లోని చోటిలాలో ఉన్న చాముండి మాతా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. రాజకీయంగా ప్రత్యేకత సాధించుకున్న సౌరాష్ట్ర ప్రాంతంలో ప్రధాని నరేంద్రమోడీ నిర్ణయాలైన పెద్దనోట్ల రద్దు - జిఎస్ టిలపై విమర్శలు సంధించారు.