Begin typing your search above and press return to search.

లండన్‌కు పరారైపోయిన రాహుల్ గాంధీ

By:  Tupaki Desk   |   16 Jun 2019 6:10 AM GMT
లండన్‌కు పరారైపోయిన రాహుల్ గాంధీ
X
టీకాలు వేయడానికి హెల్త్ డిపార్టుమెంటువాళ్లు స్కూలుకి వచ్చేటప్పటికి భయంతో పారిపోయే విద్యార్థిలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా తమ పార్టీ సీఎంలు - సీనియర్ నేతలు దిల్లీకి వచ్చేటప్పటికి తాను లండన్ పారిపోయారు. ఎన్నికల్లో మోదీ దెబ్బ చాలా గట్టిగా తగిలేసరికి అధ్యక్ష పీఠం నుంచి దిగిపోతానంటూ రాజీనామా చేసిన రాహుల్‌ ను ఆ పార్టీ నిర్ణయం వెనక్కు తీసుకోమని కోరుతోంది. కానీ, ఆయన మాత్రం ససేమిరా అంటున్నారు. దీనిపై అనిశ్చితి ఇంకా వీడలేదు. ఈలోగానే రాహుల్ అయిదు రోజుల కిందట లండన్ వెళ్లిపోయారు.

రాహుల్ సోమవారం తిరిగొస్తారని తాజా సమాచారం. అయితే.. ఆయన విదేశాలకు వెళ్తున్నట్లు పార్టీలోని సీనియర్లకు సైతం సమాచారం లేదట. అంత చడీచప్పుడు లేకుండా ఆయన వెళ్లిపోయారు. దీంతో నీతి ఆయోగ్ సమావేశానికి వచ్చిన కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో మన్మోహన్ సింగ్ సమావేశం కావాల్సి వచ్చింది. అయితే.. వచ్చింది కూడా ముగ్గురు ముఖ్యమంత్రులే. రాజస్తాన్ - చత్తీస్‌ గఢ్ - కర్నాటక సీఎంలు మాత్రమే మన్మోహన్‌ తో సమావేశానికి వచ్చారు.

మధ్యప్రదేశ్ సీఎం కమల్ నాథ్ డుమ్మా కొట్టేశారు. కమల్ తన కుమారుడిని గెలిపించుకునే తాపత్రయంలో పడి పార్టీని గాలికొదిలేశారని రాహుల్ ఇటీవల విమర్శించడంతో కమల్ గుర్రుగా ఉన్నారు. దాంతో ఆయన దిల్లీకి రాలేదు. అలాగే పంజాబ్‌లో రాహుల్ గాంధీ సిద్ధూని ప్రోత్సహిస్తున్నారన్న కోపంతో అమరీందర్ రాలేదు. ఇక పాండిచ్చేరి సీఎం నారాయణ స్వామి అలకకు కూడా ఆయన కారణాలు ఆయనకు ఉన్నాయట.

ఒకవేళ తాను దిల్లీలో ఉండి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలతో సమావేశం పెడితే ఈ ముగ్గురు రారని.. ఒకవేళ వచ్చినా తనను నిలదీయడం ఖాయమని తెలిసే రాహుల్ చల్లగా జారుకున్నారని టాక్. ఈ సమావేశం రాహులే నిర్వహించి దానికి ముగ్గురు సీఎంలు రాకపోతే విభేదాలు బట్టబయలైపోయేవి. అప్పుడు తన నాయకత్వంపై మరింత రచ్చ మొదలవుతుందన్న భయంతో రాహుల్ లండన్ చెక్కేసినట్లు కాంగ్రెస్ పార్టీలో వినిపిస్తోంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ వైఫల్యానంతరం రాహుల్ స్తబ్దుగా ఉంటున్నారు. పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగలేనని, గాంధీ కుటుంబేతర వ్యక్తికి అధ్యక్ష పగ్గాలు అప్పగించాలని చెబుతూ సీడబ్ల్యూసీలో ఆయన తన రాజీనామా ప్రతిపాదన చేశారు. అయితే, ఆ ప్రతిపాదనను సీడబ్ల్యూసీ ఏకగ్రీవంగా తోసిపుచ్చినప్పటికీ రాహుల్ మనసు మార్చుకోకపోవడంతో పార్టీలో ఒక రకమైన గందరగోళం కొనసాగుతోంది.