Begin typing your search above and press return to search.

పార్టీ డిమాండ్‌ కు రాహుల్ ఓకే చెప్పేస్తున్నారు

By:  Tupaki Desk   |   17 March 2017 4:35 AM GMT
పార్టీ డిమాండ్‌ కు రాహుల్ ఓకే చెప్పేస్తున్నారు
X
ఐదు రాష్ర్టాల ఎన్నిక‌ల్లో భాగంగా ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పొందిన కాంగ్రెస్ పార్టీలో వ్యవస్థాగత మార్పులు చేయాలన్న వాదన పెరుగుతుండ‌టం నూత‌న ప‌రిణామాల‌కు వేదిక అయ్యే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఈ వాద‌న‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్‌ ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు స్వీకరించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న సీనియర్ నాయకుడు మల్లికార్జున ఖర్గే పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (పీఎసీ) చైర్‌ పర్సన్‌ గా నియమితులు కావడంతో ఆయన స్థానంలో రాహుల్ గాంధీని 2019లో జరిగే సార్వత్రిక ఎన్నికల వరకు నియమిస్తూ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీలోని ఉన్నత స్థాయి వర్గాలు చ‌ర్చించుకుంటున్న‌ట్లు ఢిల్లీ వ‌ర్గాలు అంటున్నాయి.

2014 నుంచి ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న ఖర్గే ఏప్రిల్ నుంచి పీఏసీ చైర్‌ పర్సన్‌ గా బాధ్యతలు నిర్వహించనున్నారు. పీఎసీ డిప్యూటీ చైర్‌ పర్సన్‌ గా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కావడంతో ఆ పదవి కూడా ఖాళీ అవుతోంది. ఉత్తరప్రదేశ్ - ఉత్తరాఖండ్‌ లో తీవ్రంగా దెబ్బతిన్న తరువాత రాహుల్ గాంధీ పార్టీలో వ్యవస్థాగతమైన మార్పులకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వ్యక్తిని పిఎసి చైర్‌ పర్సన్‌ ను చేయడం బహుశా ఇదే మొదటిసారి. మ‌రోవైపు రాహుల్ గాంధీ ఈ సంవత్సరాంతంలోగా కాంగ్రెస్ పార్టీ చీఫ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దీంతో అందరి దృష్టీ ఆయనపైనే ఉంది. రాహుల్ గాంధీ ఇప్పుడే కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ (సీపీపీ) చీఫ్‌ గా బాధ్యతలు స్వీకరించాలని, 2019 ఎన్నికల వరకు లోక్‌ సభలో ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగాలని పార్టీలోని ఒక వర్గం అభిప్రాయపడుతోంది.

కాగా, దక్షిణ భారతదేశానికి చెందిన ఒక నాయకుడిని కాంగ్రెస్ పార్ల‌మెంట‌రీ పార్టీ డిప్యూటి చీఫ్‌ గా నియమిస్తారనే ఊహాగానాలు పార్టీ వర్గాలలో సాగుతున్నాయి. ఆయ‌నే కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడయిన మాధవరావు సింధియా కుమారుడు, రాహుల్ గాంధీకి సన్నిహితుడు అయిన జ్యోతిరాదిత్య సింధియా. అయితే రాహుల్ గాంధీ పనితీరు నచ్చని పార్టీలోని ఒక వర్గం ఉత్తరప్రదేశ్‌ లో సమాజ్‌ వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రశ్నిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/