Begin typing your search above and press return to search.

రాహుల్ తో ప్ర‌శాంత్ కిషోర్‌.. ఏం చేయ‌బోతున్నారు?

By:  Tupaki Desk   |   13 July 2021 4:30 PM GMT
రాహుల్ తో ప్ర‌శాంత్ కిషోర్‌.. ఏం చేయ‌బోతున్నారు?
X
ప్ర‌త్య‌ర్థుల‌ను చూసి కాదు.. ప్ర‌శాంత్ కిషోర్ ను చూసి రాజ‌కీయ పార్టీలు భ‌య‌ప‌డే ప‌రిస్థితి వ‌చ్చింది. అవును మ‌రి, పీకే ప్లాన్ వేశాడంటే.. స‌క్సెస్ అయ్యి తీరాల్సిందే అన్న‌ట్టుగా ఉంది ప‌రిస్థితి. ఆయ‌న ట్రాక్ రికార్డు ప‌రిశీలిస్తే.. అడుగు పెట్టిన ప్ర‌తిచోటా విజ‌య‌మే. దీంతో.. ప్ర‌శాంత్ కిషోర్ వ్యూహ క‌ర్తగా ఉన్నాడంటే.. ఆ పార్టీ అధికారంలోకి వ‌చ్చేస్తుంది అన్నంత‌గా న‌మ్మ‌కం వ‌చ్చేసింది రాజ‌కీయ పార్టీల‌కు! అలాంటి పీకే, రాహుల్ గాంధీతో స‌మావేశ‌మ‌య్యార‌న్న వార్త‌.. దేశ రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వీరిద్ద‌రూ క‌లిసి ఏం చేయ‌బోతున్నార‌న్న‌ది అత్యంత ఆస‌క్తిక‌రంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ ప‌రిస్థితి నానాటికీ తీసిక‌ట్టు అన్న చందంగా త‌యారైంది. రెండు ద‌ఫాలుగా ఓడిపోవ‌డం.. సీనియ‌ర్లుగా ఉన్న‌వారంతా పార్టీని బాగుచేయ‌డానికి కాకుండా.. దెబ్బ‌తీసిందుకే అన్న‌ట్టుగా త‌యారు కావ‌డంతో.. పార్టీని పున‌ర్ నిర్మించ‌డానికి రాహుల్ న‌డుం బిగించారు. దేశంలో జీ-32 పేరుతో ఏర్ప‌డిన కాంగ్రెస్‌ సీనియ‌ర్లంతా.. అధిష్టానం మీద త‌రచూ అసంతృప్తి వ్య‌క్తం చేస్తున్నారు. అదికూడా.. దేశంలో కీల‌క‌మైన ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ.. ఓ మీటింగు పెట్టుకొని సోనియా గాంధీ, రాహుల్ గాంధీల‌ను తిట్టాల్సిన కాడికి తిట్టేసి, ఆ త‌ర్వాత సైలెంట్ అయిపోతున్నారు. దీంతో.. ఇలాంటి వారంద‌రినీ ప‌క్క‌న పెట్టి, యువ‌త‌కు ప‌ట్టం క‌ట్టాల‌ని రాహుల్ నిర్ణ‌యించుకున్నార‌నే టాక్ మొద‌లైంది. తెలంగాణ‌లో రేవంత్ రెడ్డికి కిరీటం పెట్ట‌డం కూడా ఇందులో భాగ‌మేన‌నే చ‌ర్చ సాగింది.

ఇలాంటి ప‌రిస్థితుల్లో.. రాహుల్ గాంధీ - ప్ర‌శాంత్ కిషోర్ భేటీ కావ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. కేంద్రంలో రాబోయే ఎన్నిక‌ల‌కు చాలా స‌మ‌యం ఉంది. 2024లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. దీంతో.. ఇంత ముందుగానే ప్రణాళిక మొదలు పెట్టారా? అనే చ‌ర్చ మొదలైంది. దీనిపై ఎవ‌రి విశ్లేష‌ణ‌లు వారు చేస్తున్నారు.

కాంగ్రెస్ చాలా వీకైపోవ‌డంతో థ‌ర్డ్ ఫ్రంట్ పై చ‌ర్చ జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దేశంలోని బ‌లమైన ప్రాంతీయ పార్టీల‌న్నీ క‌లిసి బీజేపీ, కాంగ్రెస్ ప్ర‌త్యామ్నాయ వేదిక ఏర్పాటు చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న సంగ‌తి తెలిసిందే. అయితే.. కొన్ని పార్టీలు కాంగ్రెస్ లేకుండా థ‌ర్డ్ ఫ్రంట్ సాధ్యం కాద‌ని చెబుతున్నాయి. ఇది ప్ర‌యోగం ఖ‌చ్చితంగా ఓట్లు చీల్చి, మ‌ళ్లీ బీజేపీకే మేలు చేస్తుంద‌నే అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో పీకే-రాహుల్ స‌మావేశం కావ‌డం అత్యంత ప్రాధాన్య‌త సంత‌రించుకుంది.

అయితే.. ఇది పంజాబ్ ఎన్నిక‌ల గురించి కూడా కావొచ్చ‌ని కొంద‌రు అంటున్నారు. వ‌చ్చే ఏడాది పంజాబ్ లో ఎన్నిక‌లు జ‌ర‌గ‌బోతున్నాయి. అక్క‌డ కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే.. ముఖ్య‌మంత్రి అమ‌రీంద‌ర్ సింగ్‌, రెబ‌ల్ గా ఉన్న న‌వ‌జ్యోత్ సింగ్ సిద్ధూ మ‌ధ్య పోరాటం సాగుతోంది. రాహుల్ మ‌ద్ద‌తు పూర్తిగా సిద్ధూకే ఉంద‌ని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో పంజాబ్ ఎన్నిక‌లు కాంగ్రెస్ కు క‌త్తిమీద సాములా త‌యార‌య్యాయి. దీంతో.. ఈ ఎన్నిక‌ల‌ను జాగ్ర‌త్త‌గా డీల్ చేసేందుకే పీకేను రంగంలోకి దించిన‌ట్టు చెబుతున్నారు. మ‌రి, వీరిద్ద‌రూ ఎందుకు భేటీ అయ్యారు అన్న‌ది మాత్రం తెలియ‌లేదు.

రాహుల్ తోపాటు ప్రియాంక‌, ఆమె భ‌ర్త వాద్రా, హ‌రీష్ రావ‌త్ త‌దిత‌రులు పాల్గొన్నారు. ల‌క్నోలో ప‌ర్య‌ట‌న ర‌ద్దు చేసుకొని మ‌రీ ప్రియాంక‌.. ఈ భేటీలో పాల్గొన్నారు. దీంతో.. ఇంత‌ర అర్జెంటుగా వీరు భేటీ కావాల్సిన అవ‌స‌రం ఏమొచ్చింద‌ని చ‌ర్చించుకుంటున్నారు. అయితే.. వీరిలో ఎవ‌రు కూడా త‌మ భేటీ విష‌యాన్ని వెల్ల‌డించలేదు. మ‌రి, వాస్త‌వం ఏంట‌న్న‌ది తెలియ‌డానికి మ‌రికొంత స‌మ‌యం ప‌ట్టేలా ఉంది.