Begin typing your search above and press return to search.

రాహుల్‌ కు ఇంత మెచ్యురిటీ ఉందా?

By:  Tupaki Desk   |   29 Jan 2019 12:43 PM GMT
రాహుల్‌ కు ఇంత మెచ్యురిటీ ఉందా?
X
కాంగ్రెస్ పార్టీ ర‌థ‌సార‌థి రాహుల్ గాంధీ త‌న రాజ‌కీయ ప‌రిణితిని మ‌రో కీల‌క అంశంలో ప్ర‌ద‌ర్శించార‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఓవైపు త‌మ ప్ర‌త్య‌ర్థి బీజేపీని టార్గెట్ చేస్తూ...అదే స‌మ‌యంలో ఆ పార్టీ ఇర‌కాటంలో ప‌డేందుకు ఉన్న ప్ర‌తి అవ‌కాశాన్ని వాడుకుంటున్నార‌ని పేర్కొంటున్నారు. ప్యాంక్రియాటిక్ క్యాన్స‌ర్‌ కు చికిత్స పొందుతున్న గోవా సీం మ‌నోహ‌ర్ పారిక‌ర్‌ ను ఇవాళ ప‌రామ‌ర్శించారు. ప‌నాజీలో ఉన్న పారిక‌ర్ ఆఫీసుకు ఇవాళ ఉద‌యం రాహుల్ వెళ్లి స‌మావేశం అవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

త‌న త‌ల్లి సోనియాగాంధీతో స‌హా కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ ప్ర‌స్తుతం గోవా టూర్‌ లో ఉన్నారు. ఇవాళ మ‌ధ్యాహ్నం రాహుల్ కేర‌ళ‌లో ఓ స‌భ‌లో పాల్గొన‌నున్నారు. గోవాలో వ్యక్తిగత పర్యటన జరుపుతున్న రాహుల్, విధానసభ పరిసరాల్లో పారికర్ తో భేటీ అయ్యారు. ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేశారు. 63 ఏళ్ల పారికర్ పాంక్రియాస్ సంబంధ వ్యాధితో బాధ పడుతున్నారు. కాగా, గోవా గవర్నర్ మృదులా సిన్హా ప్రసంగం ముగిసిన వెంటనే సభ కార్యకలాపాలు నిలిచిపోగానే రాహుల్ గాంధీ మధ్యాహ్న సమయంలో విధానసభకు పరిసరాలకు చేరుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించారు. అక్కడికి చేరుకోగానే కాంగ్రెస్ అధ్యక్షుడు విధానసభ ఆవరణలోని ముఖ్యమంత్రి ఛాంబర్ కి వెళ్లి ఆయనను కలుసుకున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో 10 నిమిషాలు సమావేశమై వెళ్లిపోయారు. కాగా, పారికర్ ని కలుసుకోవడంపై ‘ఈ ఉదయం నేను గోవా సీఎంతో భేటీ అయ్యాను. ఇది వ్యక్తిగత సమావేశమే. ఆయన త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను’ అని రాహుల్ ట్వీట్ చేశారు.

ఫ్రాన్స్‌తో కుదిరిన‌ రాఫేల్ డీల్‌ పై విచార‌ణ చేప‌ట్టాల‌ని రాహుల్ డిమాండ్ చేస్తున్నారు. రాహుల్ గాంధీ రాఫెల్ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పేర్కొన్న టేపులు సరైనవేనని ప్రకటించారు. గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ దగ్గర ఈ వ్యవహారానికి సంబంధించిన ‘బాంబుల్లాంటి రహస్యాలు’ ఉన్నాయని చెప్పారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో రాహుల్ రాఫెల్ కి సంబంధించిన ఆడియో టేపులు, మనోహర్ పారికర్ పేరును ప్రస్తావించి సభలో కలకలం రేపారు. రాఫేల్ డీల్‌ పై దుమారం ముద‌రిస్తున్న రాహుల్ అదే స‌మ‌యంలో పారిక‌ర్‌ తో స‌మావేశం అవ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.