Begin typing your search above and press return to search.

ఇటలీ క‌ళ్ల‌ద్దాలు కాదు..గుజ‌రాతీ గాగుల్స్‌ తో చూడు

By:  Tupaki Desk   |   3 Oct 2017 10:35 AM GMT
ఇటలీ క‌ళ్ల‌ద్దాలు కాదు..గుజ‌రాతీ గాగుల్స్‌ తో చూడు
X

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ సొంత‌రాష్ట్రమైన గుజ‌రాత్‌ లో ఎన్నిక‌లు స‌మీపిస్తున్న కొద్ది అధికార ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య మాట‌ల తూటాలు పేలుతున్నాయి. ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల‌కు ముందే గుజ‌రాత్‌ ను చుట్టేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో జ‌రుగుతున్న అభివృద్ధిపై మండిప‌డిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో రాహుల్ గాంధీపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తీవ్రంగా విరుచుకుపడ్డారు. రాహుల్ తన ఇటాలియన్ కళ్లద్దాలు తీసి అభివృద్ధిని చూడాలని షా తనదైన రీతిలో ఎద్దేవా చేశారు. గుజరాతీ గ్లాసులు ధరించి చూస్తే గుజరాత్‌ లో బీజేపీ ఎంత అభివృద్ది చేసిందో కనిపిస్తుందని ఆయన ఎద్దేవా చేశారు.

పోర్‌ బందర్‌ లో రెండో విడత గుజరాత్ గౌరవ్ యాత్రను షా ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు యుఎస్ పర్యటన ముగించుకొచ్చి ‘వెకేషన్’ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. గుజరాత్ సీఎంగా - ప్రధాన మంత్రిగా నరేంద్ర మోడీ ఏ అభివృద్ధి చేశారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారన్న షా ‘గుజారాత్‌ కు ఎయిమ్స్ - రాజ్‌ కోట్‌ కు అంతర్జాతీయ విమానాశ్రయం తెచ్చారు. నర్మదా డ్యామ్ - పట్టణ పేదలకు ఆరులక్షల ఇళ్లు ఇస్తున్నారు’ అని వివ‌రించారు. దురదృష్టవశాత్తూ రాహుల్‌ కు ఇవేమీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. కేంద్రంలో మూడేళ్ల పాలనలో మోడీ ఏం చేశారని అడుగుతున్నారని షా విమర్శించారు. ‘ఇటాలియన్ గ్లాసులు పెట్టుకుని చూస్తే రాహుల్‌ కు అభివృద్ధి ఏం కనిపిస్తుంది?. ముందు ఆ గ్లాసులు మార్చాలి’ అని బీజేపీ చీఫ్ హితవు పలికారు.

గుజ‌రాత్‌ లో మళ్లీ అధికారంలోకి వచ్చేస్తామని కాంగ్రెస్ పగటికలలు కంటోందని అమిత్ షా ఎద్దేవా చేశారు. ‘కలలుకనే హక్కు అందిరికీ ఉంటుంది. అయితే విదేశీ పర్యటనలు జరుపుతూ అడపాదడపా దేశం గురించి - అభివృద్ధి గురించి మాట్లాడమే విచిత్రం’ అని ఆయన అన్నారు. ఎన్నికల్లో గెలవాలంటే కష్టపడి పనిచేయాలని అంతేతప్ప వెకేషన్ రాజకీయాలు కాదని షా ఎద్దేవా చేశారు.