Begin typing your search above and press return to search.

అమ్మ కష్టాలను అర్థం చేసుకొనే మనసు లేదా!

By:  Tupaki Desk   |   19 March 2015 5:07 AM GMT
అమ్మ కష్టాలను అర్థం చేసుకొనే మనసు లేదా!
X
కాంగ్రెస్‌ యువరాజు రాహుల్‌గాంధీ సెలవు ఆయన ఇమేజ్‌కు డ్యామేజీగా మారుతోంది. అధికారికంగా సెలవు చీటి ఇచ్చి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన రాహల్‌గాంధీ మనస్తత్వం కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రాహుల్‌గాంధీ సెలవు తీసుకొంటున్న సమయంలో జరుగుతున్న పరిణామాలు.. ఆయన తల్లి, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కష్టపడుతున్న తీరును బట్టి రాహుల్‌కు అమ్మపై కూడా పెద్దగా మమకారం లేదేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఎన్నికల్లో ఓటమి పాలైతే ఎలాంటి ఇబ్బందులుంటాయో కాంగ్రెస్‌ అధిష్టానానికి ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. పదేళ్ల పాలనలో చేసిన పాపాలన్నీ కాంగ్రెస్‌కు ఇప్పుడిప్పుడే పీడగా మారుతున్నాయి. క్లీన్‌ ఇమేజ్‌ ఉన్న మన్మోహన్‌ సింగ్‌ ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది.

మరి మన్మోహనే ఇలా ఇరుక్కొన్నాడంటే యూపీఏ పాలనలో కేంద్రమంత్రులుగా చక్రం తిప్పిన మిగతా వారి పరిస్థితి ఏమిటో.. వారందరికీ ఎలాంటి కష్టాలు ఎదురవుతాయో.. చివరగా అవన్నీ కాంగ్రెస్‌ ఫస్ట్‌ ఫ్యామిలీకి ఎలా ముప్పుతిప్పలు పెడతాయో..అనేది ఇప్పుడు ఆ పార్టీ అభిమానులకు ఆందోళనకరమైన అంశంగా మారింది.

ఈ విషయంల సోనియాగాంధీ కూడా గ్రహించింది. అందుకే ఆమె ఇప్పుడు రోడెక్కుతోంది.. పాదయాత్రలు చేస్తోంది. ఇప్పుడే భారతీయ జనతా పార్టీపై ఎదురుదాడి చేయకపోతే రానున్న రోజుల్లో ఈ పరిణామాల తన మెడకు చుట్టుకొంటాయని సోనియాగాంధీకి అర్థమైంది. అందుకే ఆమె ఇప్పుడు అవినీతి కేసుల విచారణ అంటే.. అది తమపై కమలనాథులు చేపడుతున్న ప్రతీకార చర్యఅనే అభిప్రాయాన్ని కలిగించాలని భావిస్తోంది.

అయితే రాహుల్‌కు మాత్రం చీమ కుట్టినట్టుగా కూడా లేదు. ఆయన ఎక్కడుతున్నాడో.. ఏం చేస్తున్నాడో కానీ.. సోనియాగాంధీ ఇప్పుడు ఎన్డీయేను ఎదుర్కొనడానికి కష్టపడుతన్న తీరును అర్థం చేసుకొనే మనసు రాహుల్‌కు లేదని మాత్రం స్పష్టమవుతోంది!