Begin typing your search above and press return to search.

చిరును పంపుడేంది రాహుల్‌!

By:  Tupaki Desk   |   12 April 2018 6:51 AM GMT
చిరును పంపుడేంది రాహుల్‌!
X
క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. ఒక రాష్ట్ర ఎన్నిక‌లు దేశ వ్యాప్తంగా ఆస‌క్తిని రేకెత్తించేలా చేయ‌టం చాలా అరుదుగా జ‌రిగేది. తాజాగా అలాంటి ప‌రిస్థితే క‌ర్ణాట‌క ఎన్నిక‌ల విష‌యంలో నెల‌కొంది. ద‌క్షిణాదిన పాగా వేయ‌టానికి బీజేపీకి క‌ర్ణాట‌క‌కు మించిన అవ‌కాశం మ‌రెక్క‌డా ల‌భించ‌దు. ఇటీవ‌ల కాలంలో మోడీ ప్ర‌భ మంద‌గించింద‌న్న మాట బ‌లంగా ప్ర‌చారం జ‌రుగుతున్న వేళ‌.. బీజేపీ బ‌లాన్ని దేశానికి మ‌రోసారి చెప్పాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ ప‌రిస్థితి కూడా ఇదే రీతిలో ఉంది. ఒక‌ప్పుడు ఎక్కువ రాష్ట్రాల్లో కాంగ్రెస్ జెండా ఎగిరే ప‌రిస్థితి నుంచి ఇప్పుడు వేళ్ల మీద లెక్క పెట్టే దుస్థితికి దిగ‌జారిన నేప‌థ్యంలో క‌ర్ణాట‌క‌లో విజ‌యం కాంగ్రెస్ కు త‌ప్ప‌నిస‌రైంది.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ఏడాది స‌మ‌యం ఉన్న వేళ.. క‌ర్ణాట‌క‌లో విజ‌యం నైతిక స్థైర్యాన్ని పెంచ‌ట‌మే కాదు.. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని పొంగిపొర్ల‌టానికి క‌న్న‌డ విజ‌యం త‌ప్ప‌నిస‌రి. ఇలాంటి వేళ‌.. ఎలాంటి త‌ప్పుల్ని కాంగ్రెస్ చేయ‌కూడ‌దు. కానీ.. క‌ర్ణాట‌క ఎన్నిక‌ల ప్ర‌చారానికి మెగాస్టార్ చిరంజీవిని ప్ర‌చారం కోసం పంపాల‌న్న నిర్ణ‌యంపై విస్మ‌యం వ్య‌క్త‌మవుతోంది.

క‌ర్ణాట‌క ఎన్నిక‌ల విజ‌యంలో తెలుగువారి పాత్ర‌ను త‌క్కువ చేసి చూపించ‌లేం. ఎందుకంటే.. తెలుగువారి ఓట్లు చాలా నియోజ‌క‌వ‌ర్గాల గెలుపులో కీల‌కంగా మార‌నున్నాయి. దీంతో.. తెలుగువారిని ప్ర‌స‌న్నం చేసుకునేందుకు బీజేపీ.. కాంగ్రెస్ లు తెలుగు రాష్ట్రాల నుంచి నేత‌ల్ని ప్ర‌చారానికి పిలిపిస్తున్నారు.

ఒక అంచ‌నా ప్ర‌కారం.. ఒక్క బీజేపీనే దాదాపుగా 10వేల‌కు పైగా తెలుగువారిని ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో ప్ర‌చారానికి పుర‌మాయించింద‌ని తెలుస్తోంది. ఇలాంటి వేళ‌.. బీజేపీకి ధీటుగా కాంగ్రెస్ సైతం త‌న ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయాల‌ని భావిస్తోంది. దీంతో తెలుగువారికి బాగా సుప‌రిచిత‌మైన చిరంజీవిని రంగంలోకి దించాల‌ని కాంగ్రెస్ అధినాయ‌క‌త్వం భావిస్తుంద‌ని తెలుస్తోంది.

ఒక‌వేళ‌.. ఈ నిర్ణ‌యం నిజ‌మైతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖ‌రీదైన త‌ప్పు చేస్తున్న‌ట్లేన‌ని చెబుతున్నారు. ఎందుకంటే.. రాష్ట్ర విభ‌జ‌న‌కు కార‌ణ‌మైన ముఖ్య‌నేత‌ల్లో చిరంజీవి ఒక‌రు. ప్ర‌జారాజ్యంపార్టీని అడ్డంగా కాంగ్రెస్ లో క‌లిపేస్తూ నిర్ణ‌యం తీసుకోవ‌ట‌మే విభ‌జ‌న‌కు కార‌ణ‌మ‌ని న‌మ్మే వారు చాలామందే ఉన్నారు. విభ‌జ‌న విష‌యంలో కాంగ్రెస్ చేసిన త‌ప్పును ఇప్ప‌టికి జీర్ణించుకోలేని ఆంధ్రులు పెద్ద సంఖ్య‌లో ఉండ‌టం.. హోదా విష‌యంలో బీజేపీ త‌మ‌ను మోసం చేసింద‌న్న ఆగ్ర‌హం ఉన్నప్ప‌టికి.. కాంగ్రెస్ సైతం స‌రిగా స్పందించ‌లేద‌న్న కోపంతో ఉన్నారు.

ఇలాంటివేళ చిరంజీవిని క‌ర్ణాట‌క ప్ర‌చారానికి పంపితే లాభం కంటే న‌ష్ట‌మే ఎక్కువ‌న్న అభిప్రాయం ఉంది. అయినా.. విశ్వ‌స‌నీయ‌త లేని చిరంజీవిని క‌ర్ణాట‌క‌కు పంపి.. ఎలాంటి సందేశాన్ని ఆయ‌న చేత ఇప్పిస్తార‌న్న ప్ర‌శ్న‌ను ప‌లువురు సంధిస్తున్నారు. వీట‌న్నింటికి మించి హోదా విష‌యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున నిర‌స‌న‌.. ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్న వేళ చిరంజీవి ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్క మాట కూడా మాట్లాడ‌లేద‌ని..అలాంటిది ఆయ‌న ఏ ముఖం పెట్టుకొని క‌ర్ణాట‌క‌కు ప్ర‌చారానికి వెళ‌తార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. క‌ర్ణాట‌క‌కు ప్ర‌చారానికి చిరు వెళితే పీకేదేమీ లేద‌ని.. ప‌డే ఓట్లు కూడా చిరు పుణ్య‌మా అని ప‌డ‌కుండా పోయే ప్ర‌మాదం పొంచి ఉంద‌ని చెబుతున్నారు. మ‌రి.. కాంగ్రెస్ నేత‌లకు ఈ విష‌యాలేమీ ప‌ట్ట‌వా? అన్న‌ది ప్ర‌శ్న‌గా మారింది.