Begin typing your search above and press return to search.

తండ్రి విష‌యంలో రాహుల్ కామెంట్లు డౌట్ పుట్టిస్తున్నాయి

By:  Tupaki Desk   |   12 March 2018 4:17 PM GMT
తండ్రి విష‌యంలో రాహుల్ కామెంట్లు డౌట్ పుట్టిస్తున్నాయి
X
తమ తండ్రి రాజీవ్ గాంధీ హంతకులను తాను - తన సోదరి ప్రియాంక గాంధీ పూర్తిగా క్షమించేశామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చెప్పిన సంగ‌తి తెలిసిందే. సింగపూర్‌లోని ఐఐఎం పూర్వ విద్యార్థుల సంఘ ప్రతినిధులతో ఇష్ఠాగోష్టిగా మాట్లాడుతూ - తన నానమ్మ ఇందిర - తండ్రి రాజీవ్ తీసుకున్న నిర్ణయాలకు మూల్యం చెల్లించక తప్పదని తమ కుటుంబానికి ముందే తెలుసునన్నారు. మా నానమ్మ తనను చంపేస్తారని ముందే నాతో చెప్పారు. మా నాన్న చనిపోతున్నారని నేను నాన్నతో ముందే అన్నాను అని రాహుల్ గుర్తు చేశారు. అయితే దీనిపై బీజేపీ ఎంపీ సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి త‌న‌దైన శైలిలో స్పందించారు.

రాహుల్ మాట్లాడుతూ `మా తండ్రి హత్య తర్వాత మేం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాం. కొన్నేళ్ల పాటు చాలా కోపంతో ఉన్నాం. కానీ మేం హంతకులను క్షమించాం` అని పేర్కొన్న సంగ‌తి తెలిసిందే. రాజీవ్ గాంధీ హత్యపై ఆయ‌న త‌న‌యుడైన రాహుల్ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సుబ్ర‌హ్మ‌ణ్య‌స్వామి అభిప్రాయపడ్డారు. రాజీవ్ హంతకులను క్షమిస్తున్నట్లు రాహుల్ చెప్పడం దేశభక్తి లేకపోవడానికి నిదర్శనం అని వ్యాఖ్యానించారు. రాజీవ్ అచ్చమైన జాతీయవాది అని, ఆయన హత్యకు బాధ్యులైన వారికి విధేయత లేదన్నారు. అలాంటి వారి పట్ల సానుకూలత చూపించాల్సిన అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. రాహుల్ కామెంట్ల‌ను చూస్తుంటే...సుపారీ హత్య లేదా పథకం ప్రకారం ఆర్థిక ప్రయోజనాలు పొందాలనే ఉద్దేశ్యంతో రాజీవ్ గాంధీని చంపించినట్లుగా అనుమానాలు తలెత్తుతున్నాయని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాజీవ్ హత్యపై దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

కాగా, 1991 మే 21న మాజీ ప్రధాని రాజీవ్‌ ను ఎల్టీటీఈ ఆత్మాహుతి దళ సభ్యురాలు హతమార్చిన సంగతి తెలిసిందే. ఎల్టీటీఈ వ్యవస్థాపకుడు ప్రభాకరన్ మృతదేహాన్ని టీవీ చానెల్‌లో చూసినప్పుడు ఆయన్ను ఎందుకు ఇలా అవమానిస్తున్నారు, ఆయన భార్యా పిల్లలు అనాథలయ్యారు భావం కలిగిందన్నారు. తన సోదరి ప్రియాంకకు కూడా అదే అభిప్రాయం వచ్చిందన్నారు. వ్యక్తులను ద్వేషించడం కష్ట సాధ్యమన్నారు. అంతకుముందు 1984లో తన నానమ్మ ఇందిరాగాంధీ హత్యకు ముందు ఆమె హంతకులతోనే బ్యాడ్మింటన్ ఆడేవాడినని గుర్తు చేసుకున్నారు. తన నానమ్మ మృతి చెందే నాటికి 14 ఏళ్ల‌ వయస్కుడినన్న రాహుల్.. నాటి నుంచి రోజంతా 15 మంది వ్యక్తిగత భద్రతా సిబ్బంది మధ్య గడుపుతున్నానన్నారు.