Begin typing your search above and press return to search.

స్వ‌ప‌క్ష నేత‌ల‌పై రాహుల్‌ కు న‌మ్మ‌కం లేదా?

By:  Tupaki Desk   |   16 Nov 2018 9:30 AM GMT
స్వ‌ప‌క్ష నేత‌ల‌పై రాహుల్‌ కు న‌మ్మ‌కం లేదా?
X
మ‌హా కూట‌మిలో సీట్ల పంప‌కం ప్ర‌స్తుతం తెలంగాణ రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది. పొత్తుల్లో భాగంగా సీట్లు ద‌క్క‌ని నేత‌లు త‌మ పార్టీల‌పై తిరుగుబావుటా ఎగ‌రేస్తున్నారు. స్వ‌తంత్ర అభ్య‌ర్థులుగా బ‌రిలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మ‌హా కూట‌మిలోని ప్ర‌ధాన ప‌క్ష‌మైన కాంగ్రెస్‌లో అస‌మ్మ‌తి సెగ‌లు మ‌రీ ఎక్కువ‌గా క‌నిపిస్తున్నాయి. త‌మ‌కు టికెట్ ద‌క్క‌క‌పోవ‌డంపై ప‌లువురు నేత‌లు హ‌స్తిన వెళ్లి అధిష్ఠానం వ‌ద్ద గోడు వెల్ల‌బోసుకుంటున్నారు.

అదే స‌మ‌యంలో కూట‌మిలో సీట్ల పంప‌కంపై ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అనుస‌రిస్తున్న వైఖ‌రి టీపీసీసీ నేత‌ల‌కు ఏమాత్రం రుచించ‌డం లేద‌ని తెలుస్తోంది. కూట‌మిలోని టీడీపీ, తెలంగాణ జ‌న స‌మితిల‌కు అవ‌స‌ర‌మైన‌దానికంటే మ‌రీ ఎక్కువ‌గా ఆయ‌న ప్రాధాన్య‌మిస్తున్నార‌ని వారు లోలోప‌ల మ‌ద‌న ప‌డుతున్న‌ట్లు స‌మాచారం.

స్వ‌ప‌క్ష సీనియ‌ర్ నేత‌లకు కూడా టికెట్ నిరాక‌రిస్తూ.. వారు ఎన్నెన్నో ఆశ‌లు పెట్టుకున్న స్థానాల‌ను మిత్ర‌ప‌క్షాల‌కు రాహుల్ కేటాయించ‌డం రాష్ట్ర కాంగ్రెస్‌కు దిగ్భ్రాంతి క‌లిగిస్తోంది. ముఖ్యంగా టీపీసీసీ మాజీ అధ్య‌క్షుడు పొన్నాల ల‌క్ష్మ‌య్య‌, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాక‌ర్ రెడ్డి, సీనియ‌ర్ నేత మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డిల‌కు రాహుల్ మొండి చేయి చూపించిన తీరు రాష్ట్ర పార్టీ నేత‌ల‌కు మింగుడు ప‌డ‌టం లేదు.

జ‌న‌గామ‌, ఖ‌మ్మం సీట్లు త‌మ‌కు ద‌క్క‌క‌పోవ‌డంపై దిల్లీ వెళ్లి మ‌రీ రాహుల్‌ను పొన్నాల‌ - పొంగులేటి క‌లిశారు. అయితే - ఈ ద‌ఫా స‌ర్దుకుపోవాల్సిందేన‌ని వారిద్ద‌రికి ఏఐసీసీ అధ్య‌క్షుడు మొహం మీద‌నే చెప్పేశారు. జ‌న‌గామ‌ను తెలంగాణ జ‌న స‌మితికి, ఖ‌మ్మంను టీడీపీకి ఇప్ప‌టికే కేటాయించామ‌ని.. అందులో మార్పులేవీ ఉండ‌బోవ‌ని తేల్చిచెప్పారు. దీంతో ద‌శాబ్దాలుగా కాంగ్రెస్‌కు సేవ‌లందిస్తున్న ఆ ఇద్ద‌రు నేత‌లు హ‌తాశుల‌య్యారు. భ‌విష్య‌త్తుపై ఏమాత్రం హామీ ఇవ్వ‌కుండా ఇలా టికెట్ ఇచ్చేది లేదంటూ రాహుల్ కుండ‌బ‌ద్ద‌లు కొట్ట‌డం వారికి మింగుడు ప‌డ‌టం లేదు. మ‌ర్రి శ‌శిధ‌ర్ రెడ్డిని కాద‌ని స‌న‌త్ న‌గ‌ర్ టికెట్‌ను టీడీపీకి ఇవ్వ‌డ‌మూ టీపీసీసీ నేత‌ల‌కు ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

వాస్త‌వానికి జ‌న‌గామ‌లో కోదండ‌రాంతో పోలిస్తే పొన్నాల‌కే విజ‌యావ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌న్న‌ది విశ్లేష‌కుల అభిప్రాయం. ఇక ఖ‌మ్మం, స‌న‌త్ న‌గ‌ర్‌ల‌లోనూ కాంగ్రెస్‌ కు గెలుపు అవ‌కాశాలు ఎక్కువే. సీనియ‌ర్ల‌ను నిరాశ‌ప‌ర్చి మ‌రీ.. గెలిచే అవ‌కాశాలున్న అలాంటి స్థానాల‌ను మిత్ర‌ప‌క్షాల‌కు రాహుల్ ఇవ్వాల్సిన అవ‌స‌ర‌మేంట‌ని ప్ర‌స్తుతం టీపీసీసీ వ‌ర్గాల్లో తీవ్ర చ‌ర్చ న‌డుస్తోంది. స్వ‌ప‌క్ష నేత‌ల కంటే మిత్ర‌ప‌క్షాల నాయ‌కుల‌పైనే ఏఐసీసీ అధ్య‌క్షుడికి ఎక్కువ భ‌రోసా ఉన్న‌ట్లు క‌నిపిస్తోంద‌ని విశ్లేష‌కులు కూడా చెబుతున్నారు.