Begin typing your search above and press return to search.

రాహుల్ లేకున్నా అందరి చూపు అమేథీపైనే..

By:  Tupaki Desk   |   24 Jan 2017 5:13 PM GMT
రాహుల్ లేకున్నా అందరి చూపు అమేథీపైనే..
X
గాంధీ కుటుంబానికి పెట్టని కోట లాంటి నియోజకవర్గం అమేథీనే. దేశాన్ని అత్యధికంగా పాలించిన కాంగ్రెస్ పార్టీకి కర్త.. కర్మ.. క్రియ లాంటి గాంధీ పార్టీ ఈ పార్లమెంటు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించినా.. ఇక్కడ సమస్యలకు మాత్రం కొదవలేదు. దేశాన్ని నడిపించే కీలకవ్యక్తుల పట్ల తమకున్న ఆదరాభిమానాల్ని ఎప్పుడూ ప్రదర్శించే అమేథీ ప్రజలకు గాంధీ ఫ్యామిలీ చేసింది తక్కువనే చెప్పాలి.

ఇంతకీ.. ఇప్పుడు అమేథీ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చిందన్న సందేహం కలగక మానదు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ బరిలో లేనప్పుడు అమేథీ వంక అందరూ కన్నేయాల్సిన అవసరం ఏముందంటారా? అక్కడికే వస్తున్నాం. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నా.. మరే నియోజకవర్గానికి లేని ఒక ప్రత్యేకత ఇప్పుడు అమేథీ నియోజకవర్గానికి ఉంది.

తాజాగా ఈ నియోజకవర్గం నుంచి అమేథీ మహారాజాగా గుర్తింపు పొందిన సంజయ్ సింగ్ మొదటి.. రెండో భార్యలు బరిలోకి దిగనుండటం ఆసక్తికరంగా మారింది. సంజయ్ సింగ్ మొదటి భార్య గరిమా సింగ్. ఆమె ఆయన నుంచి విడిపోయి విడిగా ఉంటున్నారు. ఆమె బీజేపీ తరఫున అమేథీ బరిలోకి దిగనున్నారు. ఇదిలా ఉంటే.. సంజయ్ సింగ్ రెండో భార్య అమితా సింగ్. ఆమె కాంగ్రెస్ నుంచి పోటీ చేయాల్సి ఉంది. అయితే.. సమాజ్ వాదీ.. కాంగ్రెస్ పార్టీల మధ్యపొత్తు కుదరటం.. పొత్తులో భాగంగా ఈ సీటును సమాజ్ వాదీ పార్టీకి చెందిన మంత్రి గాయత్రి ప్రజాప్రతికి కేటాయించారు. తప్పనిసరి పరిస్థితుల్లో సమాజ్ వాదీ.. కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థిగా గాయత్రి బరిలోకి దిగుతున్నారు.

తనకు కాకుండా సమాజ్ వాదీకి సీటు కేటాయించటంపై అమితా సింగ్ అగ్గి ఫైర్ అవుతున్నారు. అమేథీ తన కటుంబమని.. తన ఇల్లు అని.. ఆ తాను నియోజకవర్గాన్ని విడిచిపెట్టలేనని అమితా సింగ్ చెబుతున్నారు. అవసరమైతే కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు సైతం సిద్ధమని చెబుతున్నారు. మరోవైపు ఆమెను బుజ్జగించటం కోసం కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే.. తాను మాత్రం కాంగ్రెస్ రెబెల్ అభ్యర్థిగా పోటీ చేయటం ఖాయమని ఆమె స్పష్టం చేస్తున్నారు. తాజా పరిణామాలతో రాహుల్ బరిలో లేకున్నా.. అందరి దృష్టి అమేథీ మీద పడేలా చేస్తోంది.