Begin typing your search above and press return to search.

ఛాప్టర్‌ క్లోజ్‌ అయినా ఆయన పోరాటం ఆపడా?

By:  Tupaki Desk   |   11 Sep 2015 4:27 AM GMT
ఛాప్టర్‌ క్లోజ్‌ అయినా ఆయన పోరాటం ఆపడా?
X
''కేంద్రంలోని మోడీ సర్కారు రైతుల ప్రయోజనాలకు గండికొట్టే విధంగా, కార్పొరేట్‌ సంస్థలకు దోచిపెట్టే విధంగా అరాచకమైన రీతిలో భూసేకరణ చట్టాన్ని తీసుకువచ్చింది.. దీన్ని వ్యతిరేకించాలి'' అనే అధ్యాయం ఇప్పుడు ముగిసిపోయింది. ప్రతిపక్షాలు ఎన్ని రకాలుగా ఆందోళనలు చేసినప్పటికీ.. వెనక్కు తగ్గకుండా.. తెచ్చిన ఆర్డినెన్స్‌ కు రెండు దఫాలుగా ఆర్డినెన్స్‌ రూపంలోనే కొనసాగింపులు ఇచ్చుకుంటూ వచ్చిన మోడీ సర్కార్‌.. చివరికి ఆరెస్సెస్‌ కూడా అక్షింతలు వేసేసరికి ఇక వెనక్కి తగ్గక తప్పలేదు. రైతు ప్రయోజనాలకు కంటగింపుగా ఉండే అన్ని పాయింట్లను సరిచేసి.. రైతులందరికీ ఆమోదయోగ్యంగా ఉండే.. విధంగా సరికొత్త భూసేకరణ చట్టాన్ని తీసుకువస్తాం అంటూ.. మోడీ సర్కారు ప్రకటించేసింది. దీంతో భూసేకరణ గురించి ఇన్నాళ్లుగా దేశంలో జరుగుతున్న ఆందోళనలు విజయవంతం అయిపోయినట్లే. ఇక ఆ ప్రస్తావన ముగిసినట్లే.

ఛాప్టర్‌ క్లోజ్‌ అయిపోయింది గానీ.. తాను మాత్రం అదే పాయింటు పట్టుకునే పోరాడుతూ ఉంటా అన్నట్లుగా కాంగ్రెస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వ్యవహరిస్తున్నారు. రైతు వ్యతిరేక భూసేకరణ చట్టం అనే సమస్య సజీవంగా ఉన్నంత వరకు దానికోసం తాను చాలా కష్టపడి పోరాడుతున్నట్లుగా రాహుల్‌ గాంధీ పనిచేశారు. ఆయన దేశంలోని చాలా రాష్ట్రాల్లో రైతులను కూడగట్టి పాదయాత్రలు చేశారు. ఢిల్లీలో రైతులతో ఆందోళనలు కూడా నిర్వహించారు. సదరు చట్టానికి వ్యతిరేకంగా పోరాడడంలో ఆయన చిత్తశుద్ధిని శంకించడానికి వీల్లేదు. అయితే అది ముగిసిపోయింది.

ప్రభుత్వం వెనక్కు తగ్గిన తర్వాత.. కాంగ్రెస్‌ పార్టీ విజయోత్సవాలను జరుపుకుంది. ప్రభుత్వం వెనక్కు తగ్గడం అనేది పూర్తిగా తమ పార్టీ చేరసిన పోరాటం ద్వారా మాత్రమే సాధ్యమైనదంటూ.. సోనియాగాంధీ చాలా ఘనంగా చాటుకున్నారు. నిజమే అనుకుందాం. వారి విజయమే అయినప్పటికీ.. ఆ అధ్యాయం ముగిసింది కదా. కానీ, రాహుల్‌ గాంధీ మాత్రం ఇప్పటికీ దాన్నే పట్టుకు వేళ్లాడుతున్నారు. తాజాగా ఒడిసా లో పర్యటంచిన రాహుల్‌.. మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నదంటూ పాత విమర్శనే మళ్లీ వినిపించారు. భూసేకరణ చట్టం గురించి కాకుండా, తన దగ్గర పాయింటేమీ లేకపోయినా.. మోడీ రైతు వ్యతిరేక సర్కార్‌ అంటూ పాత పాట పాడుతూ.. ముక్తాయిస్తున్నారు. అక్కడ కూడా మోడీ సర్కారు రైతుల భూమిని లాక్కోవాలని చూస్తున్నదంటూ మాట్లాడడం విచిత్రంగానే కనిపిస్తోంది. జాతీయ పార్టీ ఉపాధ్యక్షుడికి కేంద్రాన్ని విమర్శించడనికి మరో అంశమే దొరకడం లేదా.. ముగిసిపోయిన ఛాప్టరే గుర్తుకు వస్తోందా అని జనం నవ్వుకుంటున్నారు.