Begin typing your search above and press return to search.

పాతబస్తీకివెళ్లి అన్యాయాన్ని ప్రశ్నిస్తావా రాహుల్?

By:  Tupaki Desk   |   3 Feb 2016 4:36 AM GMT
పాతబస్తీకివెళ్లి అన్యాయాన్ని ప్రశ్నిస్తావా రాహుల్?
X
ఎక్కడ.. ఏ ఘటన జరిగినా పెద్దగా స్పందించని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ శీలానికి ఇప్పుడో పెద్ద పరీక్ష. కొన్ని అంశాల మీద ఆగమాగం చేసే ఆయన.. ఈసారి తన పార్టీకి చెందిన తెలంగాణ రాష్ట్ర రథసారధిపై ఒక రాజకీయ పార్టీ అధినేత చేయి చేసుకోవటాన్ని ఆయన ఎలా చూస్తారు. నడిరోడ్డు మీద కారులో ఉన్న తమ పార్టీ అధినేతను బయలకు లాగి మరీ దాడి చేయటంపై ఎలా రియాక్ట్ అవుతారు. తమ పార్టీకే చెందిన మరో మైనార్టీ నేతను కారులో నుంచి దించి మరీ పిడిగుద్దులు గుద్దేసి.. ముఖం వాచిపోయేలా కొట్టటంపై ఎలా రియాక్ట్ అవుతారు?

ముఖ్యనేతల పరిస్థితే ఇంత దారుణంగా ఉంటే.. కార్యకర్తలు పరిస్థితి మరెంత దయనీయంగా ఉంటుందో? అర్థం చేసుకోవచ్చు. మరి.. తమ పార్టీ నేతలపై జరిగిన దాడిని పార్లమెంటులో ప్రస్తావిస్తారా? చర్చకు తీసుకొస్తారా? అంతకంటే ముందే.. హైదరాబాద్ పాతబస్తీకి వచ్చి.. ఎక్కడైతే తమ పార్టీ ముఖ్యనేతలపై దాడి జరిగిందో అక్కడ ధర్నా చేస్తారా? నిరసన ప్రదర్శన చేయగలరా? అన్నది ఇప్పుడో పెద్ద ప్రశ్నగా మారింది.

రాహుల్ అంతలా రియాక్ట్ ఎందుకు కావాలి? అని ఎవరైనా అడగొచ్చు. తమ పార్టీ రాష్ట్ర సారథిని అందరూ చూస్తుండగా.. నడి రోడ్డు మీద కారులో నుంచి బయటకు లాగి మరి కొడితే.. రాహుల్ నిరసన చేయరా? ఒక్క నేత కూడా కాదు. ఇద్దరు ముఖ్యనేతల మీద అంతలా చెలరేగిపోవటాన్ని కాంగ్రెస్ ఖండించదా? వారికి నైతిక మద్ధతు ఇస్తూ రాహుల్ పాతబస్తీకి రారా? ఎక్కడో ఏదో అన్యాయం జరిగితే చెలరేగిపోయే కంటే.. తమ పార్టీకి చెందిన ముఖ్యనేతలకు జరిగిన అన్యాయాన్ని రాహుల్ ప్రశ్నిస్తారా? లేదా? అన్నవి ఇప్పుడు పెద్ద ప్రశ్నలుగా మారాయని చెప్పకతప్పదు.