Begin typing your search above and press return to search.

కేంద్రం కక్ష సాధించిందా రాహుల్?

By:  Tupaki Desk   |   8 Dec 2015 1:43 PM GMT
కేంద్రం కక్ష సాధించిందా రాహుల్?
X
తన దాకా వస్తే కానీ తత్వం బోధ పడదని ఊరికే చెప్పలేదేమో. అధికారంలో ఉన్నప్పుడు నచ్చిన వారు.. మాట వినని వారి విషయంలో చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందన్న విషయాన్ని అక్షరాల చేసి చూపించిన సోనియమ్మ ఫ్యామిలీకే.. ఇప్పుడు కేసుల గోల చుట్టుకుంది. నేషనల్ హెరాల్డ్ ఇష్యూలో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయిన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ.. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీలు ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.

నేషనల్ హెరాల్డ్ కేసులో.. నిందితులుగా ఉన్న గాంధీ ఫ్యామిలీల చర్య.. అనుమానాస్పదంగా.. సందేహాలు రేకెత్తించేలా ఉందంటూ కోర్టు వ్యాఖ్యానించి.. వారు కోర్టుకు రావాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయం వ్యక్తం చేయటం తెలిసిందే. తాము కోర్టుకు రాకుండా ఉండేలా అవకాశం ఇవ్వాలంటూ కోరిన కోర్కెను తోసిపుచ్చిన కోర్టు మాటతో తర్వాతి వాయిదాకు తప్పనిసరిగా హాజరు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.

దీంతో.. ఈ వ్యవహారంపై సోనియాగాంధీ.. రాహుల్ గాంధీలు స్పందించారు. తాను ఇందిరమ్మ కోడలినంటూ అత్తగారి పేరుప్రఖ్యాతుల్ని తన ఖాతాలో వేసుకోవాలని కోడలు గారి తాపత్రయ పడితే.. కేంద్రం తన మీద రాజకీయ కక్ష సాధింపు చర్యకు పాల్పడుతుందంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కేంద్రాన్ని లాగిన రాహుల్.. తనకు కోర్టు నుంచి ఆదేశాలు రావటం వెనుక కేంద్రం చక్రం తిప్పుతున్నట్లుగా ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యానించటం గమనార్హం.

ఒకవేళ అదే నిజం అనుకుంటే.. అవినీతి ఆరోపణల మీద.. కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిన వెంటనే వైఎస్ జగన్ ను అరెస్ట్ చేయటాన్ని.. ఆయనపై ఛార్జ్ షీట్ విధించటం వెనుక కూడా కాంగ్రెస్ కక్ష సాధింపు ధోరణి ఉన్నట్లేనా? జగన్ విషయంలో ద్వంద వైఖరిని అనుసరించిన కాంగ్రెస్.. పార్టీలో ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకొని చూసుకొని.. పార్టీ నుంచి వెళ్లి పోయిన వెంటనే ఆయనపై అవినీతి ముద్ర వేసి జైలుకు పంపటం కూడా కుట్రేనని రాహుల్ ఒప్పుకుంటారా? ఒకవేళ జగన్ విషయంలో నాటి కేంద్రం కుట్ర చేసి ఉంటే..ఈ రోజు రాహుల్ విషయంలో కేంద్రం కుట్ర చేసిందని అనుకోవచ్చు. నిజానికి జగన్ ఒక్కడినే కాదు.. పదేళ్ల యూపీఏ హయాంలో ఇలాంటివెన్నో చోటు చేసుకున్నాయి. అవన్నీ కూడా కుట్రల ఖాతాలో వేద్దామా రాహుల్..?