Begin typing your search above and press return to search.

తెలంగాణ రాజకీయాన్ని మార్చే కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ లో ఏముంది?

By:  Tupaki Desk   |   7 May 2022 2:29 AM GMT
తెలంగాణ రాజకీయాన్ని మార్చే కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ లో ఏముంది?
X
సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోవటం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. తాజాగా వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రైతు సంఘర్షణ సభ.. పార్టీకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చేలా చేసిందని మాత్రం చెప్పక తప్పదు. భారీ బహిరంగ సభల్ని నిర్వహించటం.. ఆ సందర్భంగా ఘాటు వ్యాఖ్యలు చేయటం మామూలే అయినా.. రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగటానికి దగ్గర దగ్గర 18 నెలలకు పైనే ఉన్న వేళలో.. తమ ప్రభుత్వం కొలువు తీరితే.. ఏం చేస్తామన్న విషయాలకు సంబంధించి స్పష్టమైన కార్యాచరణను ప్రకటించటం అంత తేలికైన విషయం కాదు.

అయితే.. రోటీన్ కు భిన్నంగా కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన వరంగల్ డిక్లరేషన్ ఇప్పుడు ఆసక్తికరంగానే కాదు.. తెలంగాణ రాజకీయ స్వరూపాన్ని మార్చేలా ఉందని చెప్పాలి. రైతులే ప్రధానాంశంగా సిద్ధం చేసిన వరంగల్ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే.. తాము ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామన్న విషయాన్ని కళ్లకు కట్టినట్లుగా చెప్పటమే కాదు.. టైమ్ లైన్ కూడా చెప్పేయటం గమనార్హం. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినంతనే తాము ప్రకటించిన అంశాల్ని పక్కాగా అమలు చేస్తామని రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు.

టీపీసీసీ చీఫ్ గా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి చదివి వినిపించిన వరంగల్ డిక్లరేషన్ లో ఏముంది? అందులో కీలక అంశాలు ఏమిటన్నది చూస్తే..

- కాంగ్రెస్ ప్రభుత్వం కొలువు తీరినంతనే ఏకకాలంలో రూ.2లక్షల మేర రైతు రుణమాఫీ

- భూమి ఉన్న రైతులు, కౌలు రైతులకు ఇందిరమ్మ రైతు భరోసా పథకం పేరిట ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున పెట్టుబడి సాయం

- ఉపాధి హామీ పథకం కింద నమోదు చేసుకున్న భూమి లేని రైతులకు ఏటా రూ.12 వేల ఆర్థిక సాయం

- వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు తదితర పంట లకు మెరుగైన గిట్టుబాటు ధర.. రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోళ్లు. (ఏ పంటకు ఎంత మద్దతు ధర ఇస్తామన్న అంశాన్ని ప్రకటించారు. అన్ని పంటల కంటే వరికి భారీ మద్దతు ధరను ప్రకటించారు)

- మూసివేసిన చెరుకు కర్మాగారాలను తెరిపించేం దుకు చర్యలు.

- పసుపు బోర్డు ఏర్పాటు చేసి రెండు పంటలు పండించే రైతులకు ప్రయోజనం కలిగేలా చర్యలు.

- మెరుగైన పంటల బీమా పథకం అమలు. విపత్తుల వేళ శరవేగంగా నష్టాన్ని అంచనా వేసి రైతులకు పరిహా రం అందించేలా ఏర్పాట్లు.

- రైతుకూలీలు, భూమి లేని రైతులకు కూడా రైతు బీమా వర్తింపు.

- వ్యవసాయానికి ఉపాధి హామీ పథకం అనుసంధానం.

- పోడు భూములు, అసైన్డ్‌ భూములకు యాజమాన్య హక్కుల కల్పన.

- రైతుల పాలిట శాపంగా మారిన ’ధరణి’ పోర్టల్‌ రద్దు. అన్ని రకాల భూములకు రక్షణ కల్పించే విధంగా సరికొత్త రెవెన్యూ వ్యవస్థ ఏర్పాటు.

- రైతుల ఆత్మహత్యలకు కారణమైన నకిలీ విత్తనాలు, పురుగు మందుల విక్రేతలపై కఠిన చర్యలు, పీడీ యాక్ట్‌ కింద కేసులు. సదరు సంస్థలు, వ్యక్తుల ఆస్తులను జప్తు చేసి నష్టపోయిన రైతులకు అందించేలా నిబంధనలు.

- అవినీతికి తావు లేకుండా నిర్దిష్ట కాల పరిమితిలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి.

- రైతు హక్కుల పరిరక్షణ కోసం చట్టపరమైన అధికారాలతో ‘రైతు కమిషన్‌’ ఏర్పాటు.

- భూముల స్వభావం, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా తగిన పంటల ప్రణాళిక. వ్యవసాయాన్ని పండుగగా మార్చేలా ప్రణాళికలు.

- పంటలకు గిట్టుబాటు ధరల కల్పన.

ఏ పంటకు ఎంత మద్దతు ధర క్వింటాలుకు

పంట ప్రస్తుత మద్దతు ధర కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనుగోలు చేసేది

వరి 1960 2500

మొక్కజొన్న 1870 2200

కందులు 6300 6700

పత్తి 6025 6500

జొన్నలు 2758 3050

మిర్చి - 15వేలు

పసుపు - 12వేలు

ఎర్రజొన్న - 3500

చెరుకు - 4000