Begin typing your search above and press return to search.

రాహుల్ - ప్రియాంక: కాంగ్రెస్ పగ్గాలు ఎవరికంటే?

By:  Tupaki Desk   |   10 Sep 2019 1:30 AM GMT
రాహుల్ - ప్రియాంక: కాంగ్రెస్ పగ్గాలు ఎవరికంటే?
X
నడిపించే నాయకుడు ఎలా ఉండాలి.. ఓడినా గెలిచినా బాధ్యత వహించాలి.. తన చేతుల్లో అధికారం వచ్చినప్పుడు ముందుండి పోరాడాలి.. ఓడిపోయినప్పుడు కృంగిపోయి అస్త్రసన్యాసం చేసి.. గెలిచినప్పుడు తనదేనని క్రెడిట్ ఖాతాలో వేసుకుంటే అతడెప్పుడు నాయకుడు కాలేడు. ఇప్పుడు రాజకీయాల్లో కూడా నాయకత్వం లోపాలతో రాహుల్ గాంధీ తనను తానే తక్కువ చేసుకుంటున్నారు.

మొండి పట్టుదలతో ఒక రాష్ట్రానికి సీఎం అయిన నరేంద్రమోడీ బీజేపీ బాధ్యతలు భుజాలపై వేసుకొని 2014లో కాలికి బలపం కట్టుకొని తిరిగి ఒంటిచేత్తో అధికారంలోకి తీసుకొచ్చాడు. అవమానాలు, ఒత్తిడులు, ఎదురుదెబ్బలు తగిలినా తట్టుకొని నిలబడ్డారు. ఇప్పుడు ఆయన ఓర్పు, పట్టుదలకే ప్రజలే మరోసారి పట్టం కట్టారు.

కానీ రాహుల్ మాత్రం 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ ను గెలిపించి గెలుపును తనఖాతాల్లో వేసుకున్నారు. కానీ ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేసరికి పార్టీ ఓడిపోవడంతో అస్త్రసన్యాసం చేసి పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి వైదొలిగారు. విజయవంతమైన నాయకుడు ఎప్పుడూ పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు అలా వదిలేసి వెళ్లరు. ముందుండి పోరాడుతారు.. కసిగా పాటుపడుతారు. ఇక్కడే రాహుల్ వెనుకడుగేశారు.

నిజానికి యూపీ బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ చెల్లెలు ప్రియాంక యూపీలో ఓడినా కూడా అక్కడే ప్రజల్లో తిరుగుతూ ఓటమికి గల కారణాలు వెతుకుతూ ప్రభుత్వంపై ముందు ఎంత తీవ్రంగా ఫైట్ చేస్తుందో ఇప్పుడూ అదే చేస్తోంది. ప్రియాంక ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇక ఆయన తల్లి సోనియా కూడా ఓటమి ఎదురైనా తిరిగి 70 ఏళ్లకు పైబడిన వయసులో కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టి మళ్లీ పోరాడుతున్నారు.

తన ఫ్యామిలీలోని చెల్లి, తల్లి పోరాడినట్టుగా కూడా ఓటమి ఎదురైతే రాహుల్ పోరుబాట పట్టకపోవడం చర్చనీయాంశమైంది. విజయాల్లోనే కాదు.. అపజయాల్లోనూ తోడుండేవాడు అసలైన నాయకుడు.. కాలకేయ సైన్యం మహిష్మతి రాజ్యసేనలను చంపుతున్నప్పుడు ఓటమి ఎదురైన వేళ పారిపోతున్న సేనల్లో స్ఫూర్తిని నింపి యుద్ధాన్ని గెలుస్తాడు బాహుబలి. అది సినిమానే కావచ్చు. అందులోని నీతిని మన రాహుల్ గాంధీ ఒడిసిపట్టుకొని పోరాడితే కాంగ్రెస్ ఇప్పుడు ఇలా ఉండేదికాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

నాయకుడు లేని సేనలు చెదిరిపోతాయి. ఇప్పుడు కాంగ్రెస్ కాడి వదిలేసిన రాహుల్ గాంధీని చూసి ఆయన పార్టీ నేతలు కూడా బీజేపీలో చేరిపోతున్నారు. అందుకే ఇప్పుడు కాంగ్రెస్ ను నమ్ముకోవడం లేదు. ఇలాంటి స్వభావం గల రాహుల్ నాయకత్వాన్ని అందరూ కాలదన్నుతున్నారని చెప్పకతప్పదు. ‘ కాంగ్రెస్ పగ్గాలు ఎవరి చేతికి వెళితే బలపడుతుంది.?’ అని తుపాకీ.కామ్ పోల్ పెడితే రాహుల్ కు కేవలం 14299 మంది (31.5శాతం) మాత్రమే ఓట్ వేశారు. ఆయన చెల్లెలు ప్రియాంక గాంధీకి అత్యధికంగా 31311(68.75శాతం) మంది ఓట్లు వేయడం గమనార్హం.. దీన్ని బట్టి కాంగ్రెస్ పగ్గాలు ప్రియాంక చేతిలో వెళితే ఆ పార్టీ బలపడుతుందని ప్రజలు తేల్చారన్నమాట.. రాహుల్ పై నమ్మకం లేదని కుండబద్దలు కొట్టడం గమనార్హం.