Begin typing your search above and press return to search.

రాహుల్ కొత్త యాంగిల్ - మోడీది దేశ‌ద్రోహం !

By:  Tupaki Desk   |   31 Oct 2018 2:36 PM GMT
రాహుల్ కొత్త యాంగిల్ - మోడీది దేశ‌ద్రోహం !
X
నేడు సర్దార్ వల్లభాయ్ పటేల్ జ‌యంతి సంద‌ర్భంగా ప‌టేల్ భారీ విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ'ని ప్రధాని మోదీ ఆవిష్క‌రించిన సంగ‌తి తెలిసిందే. గుజ‌రాత్ లోని న‌ర్మ‌దా న‌ది తీరంలో ఏర్పాటు చేసిన ఆ విగ్రహాన్ని మోదీ ...జాతికి అంకితం చేశారు. ప్ర‌పంచంలోకెల్లా ఎత్తైన విగ్రహంగా ప‌టేల్ విగ్ర‌హం రికార్డు సృష్టించింది. ఈ విగ్ర‌హం ఆవిష్క‌ర‌ణ సంద‌ర్భంగా కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. దేశంలోని వ్యవస్థల నిర్మాణానికి సర్దార్ పటేల్ ఎన‌లేని కృషి చేశార‌ని, కానీ, ఆ వ్యవస్థలన్నింటికీ ఒక పద్ధతి ప్రకారం కేంద్రం ధ్వంసం చేస్తోంద‌ని రాహుల్ మండిప‌డ్డారు. మోదీ స‌ర్కార్ దేశద్రోహానికి పాల్పడుతోందని రాహుల్ ట్వీట్ చేశారు. ఓ వైపు సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తూ,మ‌రోవైపు ఆయ‌న అభివృద్ధి చేసిన వ్య‌వస్థలను మోదీ నీరుగారుస్తుండటం సిగ్గుచేటన్నారు.

పటేల్ దేశభక్తుడని, స్వాతంత్ర్యం కోసం పారాడారని, సెక్యులర్ ఇండియాకు, దేశ ఐక్యతకు పాటుపడ్డారని రాహుల‌్ ట్వీట్ చేశారు. పటేల్ ఉక్కు సంకల్పం కలిగిన మనిషని, అచ్చమైన కాంగ్రెస్ నేత అని కొనియాడారు. మతదురభిమానం, మతతత్వాన్ని ఏమాత్రం సహించని గొప్ప వ్యక్తి అని అన్నారు. భరతమాత ముద్దుబిడ్డ ప‌టేల్ కు ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా సెల్యూట్ చేస్తున్నాన‌ని రాహుల్ ట్వీట్ చేశారు. కాగా, సీబీఐ, ఆర్బీఐలలో అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో రాహుల్ పరోక్షంగా మోదీ స‌ర్కార్ పై చుర‌క‌లంటించారు. సీబీఐ ఉన్నతాధికారుల మధ్య వివాదం, పరస్పరం అవినీతి ఆరోపణల నేప‌థ్యంలో రాహుల్ ఆ ట్వీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆర్బీఐలో సెక్షన్ 7 ప్రయోగించడం ద్వారా ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందనే వార్తలు దుమారం రేపిన సంగ‌తి తెలిసిందే. కేంద్ర బ్యాంకులలో ప్రభుత్వం జోక్యంపై ప‌లువురు ఆందోళనలు వ్యక్తం చేసిన నేప‌థ్యంలో ఆర్బీఐ స్వతంత్రను కాపాడుతామని కేంద్రం వివరణ కూడా ఇవ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.