Begin typing your search above and press return to search.

ప్ర‌ధాని ప‌ద‌వికి మోడీతో పోటీకి రాహుల్ రెఢీ

By:  Tupaki Desk   |   12 Sep 2017 7:41 AM GMT
ప్ర‌ధాని ప‌ద‌వికి మోడీతో పోటీకి రాహుల్ రెఢీ
X
ఆచితూచి మాట్లాడే అల‌వాటు ఉన్న కాంగ్రెస్ యువ‌రాజు.. ఆ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ తాజాగా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. ఎప్పుడూ బాధ్య‌త‌లు స్వీక‌రించేందుకు సిద్ధంగా ఉన్న‌ట్లు క‌నిపించ‌ని ఆయ‌న‌.. త‌న తీరుకు భిన్నంగా ఈ రోజున అమెరికాలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో మాట్లాడుతూ ఊహించ‌నిరీతిలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు.

వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లుగా వెల్ల‌డించారు. రెండు వారాల ప‌ర్య‌ట‌న‌లో భాగంగా అమెరికాకు వెళ్లిన రాహుల్‌.. తాజాగా బెర్క్ లీ లోని కాలిఫోర్నియా వ‌ర్సిటీలో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు ఎదురైన ఒక ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చే క్ర‌మంలో తాను ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీ ప‌డ‌తాన‌న్నారు. గ‌తంలో ప‌లుమార్లు పార్టీ కీల‌క బాధ్య‌త తీసుకోవాల‌ని కోరితే పార్టీ ఇష్ట‌మ‌నే అల‌వాటున్న రాహుల్‌.. ప్ర‌ధాని ప‌ద‌వికి పోటీ ప‌డ‌తారా? అన్న ప్ర‌శ్న అడిగినంత‌నే బుల్లెట్ మాదిరి తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. తాను పీఎం ప‌ద‌వికి పోటీ చేసేందుకు సిద్ధ‌మ‌ని.. త‌మ‌ది సంస్థాగ‌త‌మైన పార్టీ అయినందున తుది నిర్ణ‌యం పార్టీ తీసుకుంటుంద‌న్నారు. ప్ర‌స్తుతం తాను చెప్పిన అంశంపై చ‌ర్చ జ‌రుగుతోంద‌న్నారు.

ప్ర‌ధాని మోడీ చేస్తున్న విభ‌జ‌న‌ రాజ‌కీయాలు ప్ర‌జ‌ల్ని వేరు చేస్తున్నాయంటూ ఆవేద‌న వ్య‌క్తం చేసిన రాహుల్‌.. జీఎస్టీ.. పెద్ద‌నోట్ల ర‌ద్దు మీద త‌న అభిప్రాయాల్ని వెల్ల‌డించాడు. మోడీ స‌ర్కారు తీసుకున్న నిర్ణ‌యాల‌తో భార‌త వృద్ధిరేటు త‌గ్గిపోతోంద‌ని.. రైతుల‌కు తీర‌ని న‌ష్టం వాటిల్లుతోంద‌న్నారు. దేశ ప్ర‌జ‌ల్ని ఐక్యంగా నిలిపింది అహింస ఒక్క‌టి మాత్ర‌మేన‌ని.. మాన‌వ‌త్వాన్ని ముందుకు తీసుకెళ్లే ఆ అహింస‌పై ఇప్పుడు కొంద‌రు దాడులు చేస్తున్నార‌న్నారు. కోపం.. హింస వినాశ‌నానికి దారితీస్తుంద‌న్న రాహుల్‌.. 1984 అల్ల‌ర్ల అంశాన్ని ఉటంకిస్తూ న్యాయం కోసం పోరాడే వారికి తాను మ‌ద్దతుగా ఉంటాన‌న్నారు. హింస‌ను ఖండిస్తాన‌ని.. త‌న తండ్రి రాజీవ్ గాంధీ.. నాన‌మ్మ ఇందిరాగాంధీల‌ను హింసే బ‌లి తీసుకుంద‌ని గుర్తు చేసుకున్నారు. ఆ బాధ ఎలా ఉంటుంద‌న్న‌ది త‌న‌కే తెలుస‌న్నారు.

రాజ‌కీయంగా త‌న‌పై వ‌స్తున్న స‌టైర్ల పై స్పందించిన రాహుల్‌.. వెయ్యి మందితో కూడిన బీజేపీ యంత్రాంగం కంప్యూట‌ర్ల ముందు కూర్చొని త‌న‌ను తిడుతున్నార‌ని.. దేశాన్ని న‌డిపించే ఓ పెద్దాయ‌న వారిని ముందుండి న‌డిస్తున్న‌ట్లుగా మోడీ మీద ప‌రోక్ష ఆరోప‌ణ‌లు చేశారు.

ప్ర‌స్తుత ప్ర‌జాస్వామిక ప‌రిస్థితులు కాస్త భిన్నంగా త‌యార‌య్యాయ‌ని చెప్పిన రాహుల్.. వార‌స‌త్వ పాల‌న ప‌రిస్థితులే క‌నిపిస్తున్నాయ‌ని.. అఖిలేష్ యాద‌వ్‌.. స్టాలిన్ చివ‌ర‌కు సినిమాల్లో అభిషేక్ బ‌చ్చ‌న్.. వ్యాపార రంగంలో అంబానీ త‌న‌యుడు ఇలా ప‌లువురి పేర్ల‌ను ప్ర‌స్తావించారు.

లెఫ్ట్.. రైట్ ల‌లో భార‌త్ దేనివైపు ఉంటుంద‌న్న ప్ర‌శ్న‌కు బదులిస్తూ.. తాము ముక్కుసూటిగా ఉంటామ‌న్న మాట‌ను నాన‌మ్మ ఇందిర చెప్పార‌న్నారు. సంప్ర‌దింపుల ద్వారానే కాంగ్రెస్ పార్టీ నిర్ణ‌యాలు తీసుకుంటుందే త‌ప్పించి బ‌ల‌వంతంగా ప్ర‌జ‌ల‌పై త‌మ అభిప్రాయాల‌ను రుద్ద‌బోద‌న్నారు. 2012లో పార్టీలో కొంద‌రునేత‌ల మ‌ధ్య అహంకారం పెరిగినందు వ‌ల్లే త‌మ పార్టీ ఓట‌మిపాల‌య్యామ‌న్నారు.

మ‌న్మోహ‌న్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో తొమ్మిదేళ్ల పాటు మ‌న్మోహ‌న్‌.. చిదంబ‌రం.. జైరామ్ ర‌మేశ్ లాంటి రాజ‌కీయ‌వేత్త‌ల‌తో జ‌మ్ముక‌శ్మీర్ వ్య‌వ‌హారంపై ప‌ని చేశాన‌ని.. త‌మ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం ఉగ్ర‌వాదం జాడ‌లు లేకుండా పోయింద‌న్నారు. 2013లో మ‌న్మోహ‌న్ హ‌యాంలో ఉగ్ర‌వాద న‌డ్డి విరిచిన స‌మ‌యంలో తాను సంతోషంతో మ‌న్మోహ‌న్ సింగ్‌ ను హ‌త్తుకొని మ‌నం సాధించిన అతి పెద్ద విజ‌మ‌ని గుర్తు చేసుకున్నారు.

మోడీ మంచి వ‌క్త అన్న రాహుల్‌.. ఒక జ‌న‌సందోహంలో ఉన్న మూడు నాలుగు గ్రూపుల‌ను స‌ముదాయించేలా మాట్లాడ‌టం మోడీకే చెల్లుతుంద‌న్నారు. కానీ.. పార్టీలో త‌న‌తో పాటు ప‌ని చేసే స‌భ్యుల‌తో మాత్రం సంబంధం లేన‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని.. ఆ విష‌యాన్ని బీజేపీకే చెందిన కొంద‌రు నేత‌లు త‌న‌తో చెప్పిన‌ట్లుగా వెల్ల‌డించారు. స‌మాచార హ‌క్కు చ‌ట్టాన్ని కేంద్రం త‌న గుప్పిట్లో పెట్టుకోవ‌టంతో ప్ర‌భుత్వ లోపాలు.. అవినీతి స‌మాజానికి తెలియ‌జేయాల‌న్న కాంగ్రెస్ పార్టీ ప్ర‌య‌త్నానికి ఆటంకంగా మారింద‌న్నారు.