Begin typing your search above and press return to search.

త్యాగానికి రెఢీ అంటున్న గాంధీ ఫ్యామిలీ!

By:  Tupaki Desk   |   25 July 2018 5:08 AM GMT
త్యాగానికి రెఢీ అంటున్న గాంధీ ఫ్యామిలీ!
X
మోడీ లాంటోడికి చుక్క‌లు చూపించాలంటే అంత చిన్న విష‌యం కాదు. అవ‌స‌ర‌మైతే.. భారీ త్యాగానికి సిద్ధం కావాల్సి ఉంటుంది. దీనికి సైతం సై అంటోంది కాంగ్రెస్ పార్టీ. ప్ర‌ధాని కుర్చీలో మోడీ కాకుండా ఇంకెవ‌రు కూర్చున్నా స‌రే త‌మ‌కు అభ్యంత‌రం లేద‌న్న సంకేతాన్ని తాజాగా తేల్చేయ‌టం చూస్తే.. 2019 ఎన్నిక‌లు మామూలుగా జ‌ర‌గ‌ద‌ని తేల్చి చెప్పిన‌ట్లైంది.

కొద్ది రోజుల క్రితం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ఎక్కువ సీట్లు వ‌స్తే.. ప్ర‌ధాని ప‌ద‌విని తాను చేప‌ట్టటానికి సిద్ధ‌మ‌న్న ప్ర‌క‌ట‌న చేసిన రాహుల్ గాంధీ సైతం.. పీఎం కుర్చీని వ‌దులుకునేందుకు రెఢీ కావ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

ఇటీవ‌ల మోడీ స‌ర్కారుపై అవిశ్వాస తీర్మానాన్ని పెట్ట‌టం అందులో విప‌క్షాల బ‌లం తేలిపోవ‌టం.. మోడీ అండ్ కో బ‌లం భారీగా ఉన్న నేప‌థ్యంలో.. బీజేపీ వ్య‌తిరేక పార్టీల‌న్నీ ఏకం అయ్యేందుకు వీలుగా రాహుల్ త‌న‌కు తానుత్యాగం చేసుకోవ‌టానికి సిద్ధ‌మ‌వుతున్న‌ట్లుగా చెబుతున్నారు.

ప్ర‌ధాని ప‌ద‌వి త‌మ‌కు ముఖ్యం కాద‌ని.. బీజేపీ.. ఆర్ ఎస్ ఎస్ కు సంబంధం లేని వ్య‌క్తుల‌కు సైతం ప్ర‌ధాని పీఠం మీద కూర్చొబెట్ట‌టానికి త‌మ‌కు ఎలాంటి అభ్యంత‌రం లేద‌న్న సంకేతాన్ని కాంగ్రెస్ ఇచ్చేసింది. దీంతో.. రాజ‌కీయం మ‌రింత వేడెక్క‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్ర‌ధాని కుర్చీని ఆశిస్తున్న ప్ర‌ముఖుల్లో మాయావ‌తి ఒక‌రుగా చెప్పాలి. ద‌ళిత మ‌హిళా అధినేత‌గా.. ఆమె విష‌యంలో కొన్నిపార్టీలు సానుకూలంగా ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో విప‌క్షాల్ని ఏకం చేయ‌ట‌మే త‌మ ముందు ఉన్న ల‌క్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ.. పొత్తుల‌కు అడ్డుగా ఉండే ప్ర‌ధాని ప‌ద‌విని వ‌దులుకోవ‌టానికి రాహుల్ సిద్ధ‌మ‌న్న సంకేతాన్ని ఇవ్వ‌టం ఆస‌క్తిక‌రంగా మారింద‌ని చెప్పాలి.

ఈ ప‌రిణామాన్ని గుర్తించినందుకో ఏమో కానీ.. తాజాగా రాజ్ నాథ్ సింగ్‌.. ఈ మ‌ధ్య‌న ప్ర‌ధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ న‌మ్మ‌ద‌గిన మిత్ర‌ప‌క్షం కాద‌న్న వాద‌న‌ను తెర మీద‌కు తెచ్చారు. మంగ‌ళ‌వారం రాజ్ నాథ్ మ‌రోసారి ఇదే మాట మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. అయితే.. కాంగ్రెస్ ను వేలెత్తి చూపిస్తున్న బీజేపీ సైతం మిత్ర‌ప‌క్షాల‌కు న‌మ్మ‌ద‌గిన పార్టీ ఎంత మాత్రం కాద‌న్న మాట‌నుఅంద‌రూ అంగీక‌రించే ప‌రిస్థితి.

2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో బీజేపీ మిత్ర‌ప‌క్షంగా వ్య‌వ‌హ‌రించిన పార్టీల్లో ఎన్ని ఇప్పుడు మోడీ ప‌రివారంతో ఉన్నార‌న్న ప్ర‌శ్న‌ను వేసుకుంటే మోడీ బ్యాచ్ డొల్ల‌త‌నం ఎంత‌న్న విష‌యం ఇట్టే అర్థం కాక మాన‌దు. ఇదిలా ఉంటే.. బీజేపీ కూట‌మికి ధీటైన కూట‌మిని ఏర్పాటు చేయాల్సి వ‌స్తే.. ఆ కూట‌మి త‌ర‌ఫున ప్ర‌ధాన‌మంత్రి అభ్య‌ర్థిగా మాయావ‌తి పేరును ప‌రిశీలించేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధ‌మ‌వుతోంది. మ‌రోవైపు ప‌శ్చిమ బెంగాల్ లో మాత్ర‌మే కాదు.. దేశంలో మ‌రెక్క‌డైనా స‌రే మోడీని ఢీ కొట్టే స‌మ‌ర్థ‌త‌.. సామ‌ర్థ్యం త‌న‌కు మాత్ర‌మే ఉన్నాయంటూ ఇటీవ‌ల చెప్పిన ప‌శ్చిమ‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని కూడా ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే.. ప్ర‌ధాని కుర్చీలో కూర్చోబెట్టానికి ఎవ‌రినైనా స‌రే అంటున్న‌ కాంగ్రెస్.. మోడీని ప్ర‌ధాని కుర్చీ నుంచి త‌ప్పించాల‌న్న విష‌యంలో మాత్రం మ‌హా ప‌ట్టుద‌ల‌తో ఉంద‌న్న విష‌యం తాజా ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.