Begin typing your search above and press return to search.

కశ్మీర్ పై రాహుల్ తాజా ట్వీట్ల సందేశం ఇదేనా?

By:  Tupaki Desk   |   28 Aug 2019 6:32 AM GMT
కశ్మీర్ పై రాహుల్ తాజా ట్వీట్ల సందేశం ఇదేనా?
X
సరైన సమయంలో సరైన రీతిలో స్పందించటం చాలా తక్కువమంది చేస్తుంటారు. సమకాలీన రాజకీయాల్లో చాలామంది రాజకీయ ప్రముఖులు చేస్తున్న తప్పును రాహుల్ ఏ మాత్రం చేయకపోగా.. కీలకమైన వేళలో కశ్మీర్ అంశంపై ఆయన ఇచ్చిన ట్వీట్ల క్లారిటీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కశ్మీర్ పై కాంగ్రెస్ పార్టీలో స్పష్టత లేదని.. ఈ ఇష్యూలో ఆ పార్టీలోనే భిన్నాభిప్రాయం ఉందన్న విమర్శ వినిపిస్తోంది.

కశ్మీర్ పై తాను అనుసరించే వైఖరికి.. మోడీ ప్లానింగ్ కు మధ్య తేడా ఉంది తప్పించి.. కశ్మీర్ అంశంపై అధికార.. ప్రతిపక్ష పార్టీల స్టాండ్ ఒక్కటేనన్న విషయాన్ని రాహుల్ తన తాజా ట్వీట్లతో తేల్చేశారు. కశ్మీర్ అంశం పూర్తిగా భారత అంతర్గత విషయమని.. ఇందులో పాకిస్థాన్ తో సహా మరే దేశం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని రాహుల్ స్పష్టం చేశారు.

చాలా విషయాల్లో ప్రభుత్వ చర్యల్ని నేను వ్యతిరేకించా. కానీ.. ఈ విషయం మాత్రం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నా. కశ్మీర్ భారత్ అంతర్గత అంశం. ఇందులో పాక్ తో సహా ఏ ఇతర దేశమైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు. జమ్ముకశ్మీర్ లో హింసాత్మక ఘటనలు జరుగుతున్నయంటే అదంతా పాక్ మద్దతు.. ప్రేరణతోనే ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే ప్రధాన దేశం పాకిస్థానేనన్న విషయం తెలిసిందే కదా? అని ట్వీట్ లో పేర్కొన్నారు. రాహుల్ ట్వీట్లపై ఆ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ స్పందించారు. తమ పార్టీ ఎప్పటినుంచో చెబుతున్న విషయాన్ని రాహుల్ చెప్పారని.. కశ్మీర్ విషయం మీద తాము మొదట్నించి ఒకే విధానంలో ఉన్నట్లు చెప్పారు.

ఇంతకీ.. రాహుల్ తాజా ట్వీట్ల వెనుక అసలు కారణం ఏమిటన్న విషయానికి వస్తే.. కశ్మీర్ అంశంపై మోడీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై యావత్ దేశంలోనూ హర్షాతిరేకాలు వ్యక్తం కావటం.. అంతర్జాతీయంగా ఒకే మాట వినిపిస్తుండటంతో పాటు.. అమెరికా అధ్యక్షుడి సమక్షంలోనే కశ్మీర్ అంశంపై మోడీ వినిపించిన వాణి నేపథ్యంలో.. ఈ ఇష్యూలో తాము వెనుకపడిపోయినట్లుగా ఉండకూదన్న ఉద్దేశమే తాజా ట్వీట్లుగా చెబుతున్నారు.

ఇప్పటికే కశ్మీర్ విషయంలో తాము సరిగా స్పందించలేకపోయామన్న వాదన కాంగ్రెస్ లో వినిపిస్తున్న వేళ.. దాన్ని తొలగించే క్రమంలో రాహుల్ వేసిన మొదటి అడుగు తాజా ట్వీట్లుగా చెప్పక తప్పదు.