Begin typing your search above and press return to search.

టీ కాంగ్రెస్ లో కౌర‌వులెవ‌రు..?

By:  Tupaki Desk   |   28 Feb 2022 1:13 AM GMT
టీ కాంగ్రెస్ లో కౌర‌వులెవ‌రు..?
X
కాంగ్రెస్ పార్టీని న‌ష్ట‌ప‌రిచే వారిపై అధిష్టానం దృష్టి పెట్టింది. స్వ‌యంగా రాహుల్ గాంధీయే రంగంలోకి దిగారు. అన్ని రాష్ట్రాల్లో అసంతృప్తుల‌ను గుర్తించే ప‌నిలో ప‌డ్డారు. దీని కోసం ప్ర‌త్యేక టీంను ఏర్పాటు చేసిన‌ట్లు స‌మాచారం. ఎవ‌రు పార్టీకి స‌హ‌క‌రిస్తున్నారు..? పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొని బ‌లోపేతం చేసేందుకు ఎవ‌రు ప‌ని చేస్తున్నారు..? ఎవ‌రు అస‌మ్మ‌తి గ‌ళాలు వినిపిస్తున్నారు..? వంటి వివ‌రాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు.

కాంగ్రెస్ గుజ‌రాత్ ఎన్నిక‌ల ప్ర‌ణాళిక‌లో భాగంగా ఈ క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ప్ర‌సంగాల‌కే ప‌రిమితం అవుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేయ‌కుండా ఇత‌రుల‌ను చెడ‌గొడుతున్నారంటూ కొంద‌రు సీనియ‌ర్ నాయ‌కుల‌పై రాహుల్ గాంధీ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అలాంటి వారిని కౌర‌వులుగా అభివ‌ర్ణించారు. అవ‌కాశం వ‌చ్చిన‌పుడు బీజేపీలోకి, ఇత‌ర పార్టీల్లోకి వెళ్లేవారు వారేన‌ని.. ఇలాంటి వారిని త్వ‌ర‌గా వ‌దిలించుకోవ‌డ‌మే ఉత్త‌మం అని అభిప్రాయ‌ప‌డ్డారు.

గుజ‌రాత్ పీసీసీ మేధోమ‌థ‌న శిబిరంలో నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల‌ను ఉద్దేశించి రాహుల్ ప్ర‌సంగించారు. ఈ ఏడాది డిసెంబ‌రులో జ‌రిగే గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల కోసం పార్టీ నేత‌ల‌ను స‌మాయ‌త్తం చేసేందుకు ఈ స‌మావేశాలు నిర్వ‌హిస్తున్నారు. 2017లో 7 సీట్ల తేడాలో అధికారాన్ని కోల్పోయామ‌ని.. ఈ సారి క‌చ్చితంగా గెలిచి తీరాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. పార్టీని న‌ష్ట‌ప‌రిచే వారిని.. అసమ్మ‌తి వ‌ర్గాల‌ను ఏరివేయాల‌ని సూచించారు. వారిని కౌర‌వుల‌తో పోల్చ‌డం గ‌మ‌నార్హం.

దీనిపై తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ర‌క‌ర‌కాలుగా చ‌ర్చించుకుంటున్నారు. రాహుల్ అస‌మ్మ‌తి నేత‌ల‌పై ఇంత‌లా ఫైర్ అవ‌డం ఇదే తొలిసార‌ని చెబుతున్నారు. తెలంగాణ‌లో కూడా అలాంటి వారిపై తీవ్ర చ‌ర్య‌లు తీసుకునే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇక్క‌డ కూడా కౌర‌వుల‌ను గుర్తించి పార్టీ నుంచి బ‌య‌ట‌కు త‌రిమేయాల‌ని అధిష్ఠానం డిసైడ్ అయిన‌ట్లు తెలుస్తోంది. అయితే.. రాహుల్ వ్యాఖ్య‌లు టీ కాంగ్రెస్ లో ఎవ‌రికి వ‌ర్తిస్తాయోన‌న్న అనుమానాలు అంద‌రిలో మొద‌ల‌య్యాయి.

ప‌రోక్షంగా ఇవి జ‌గ్గారెడ్డి లాంటి వారిని ఉద్దేశించే అయి ఉంటుంద‌ని గుస‌గుస‌లాడుకుంటున్నారు. అస‌మ్మ‌తి వ‌ర్గాల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి.. కోవ‌ర్టుల‌ను బ‌య‌ట‌కు పంప‌డానికి రాహుల్ గాంధీ ఇలాంటి ఎత్తుగ‌డ‌ల‌కు పాల్ప‌డుతున్నార‌ని పార్టీ నేత‌ల అభిప్రాయంగా ఉంది. ఇక‌పై పార్టీలో ఎవ‌రైనా తోక జాడిస్తే.. పార్టీ లైన్ కు వ్య‌తిరేకంగా ప‌నిచేసే వారికి ఇది ఒక హెచ్చ‌రిక‌గా చెబుతున్నారు. టీ కాంగ్రెస్ లో కౌర‌వులెవ‌రో.. పాండ‌వులెవ‌రో తేలాలంటే వేచి చూడాల్సిందే.