Begin typing your search above and press return to search.

రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్

By:  Tupaki Desk   |   7 Nov 2016 10:49 AM GMT
రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ యాక్టింగ్ ప్రెసిడెంట్
X
రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పగ్గాలు ఇంకా అప్పగించకపోయినా అనధికారికంగా ఆయన చేతికి అధికారం అందిందని చెబుతున్నారు. కొన్నాళ్లుగా పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యంతో బాధపడుతుండడంతో రాహులే అంతా చూసుకుంటున్నారు. తాజాగా అత్యంత కీలకమైన సమావేశాలూ ఆయన నేతృత్వంలోనే జరుగుతున్నాయి. దీంతో రాహుల్ యాక్టింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నట్లు చెబుతున్నారు.

తాజాగా అత్యంత కీలకమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం రాహుల్ సారథ్యంలోనే జరిగింది. అధ్యక్షురాలు సోనియా గాంధీ అనారోగ్యం కారణంగా గైర్హాజరు కావడంతో రాహులే నడిపించారు. పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్న ఈ భేటీలో ప్రస్తుతం దేశంలోని రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ తీసుకోవాల్సిన నిర్ణయాలపై చర్చలు సాగాయి. వచ్చే సంవత్సరం యూపీ - పంజాబ్ సహా గోవా - మణిపూర్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న సందర్భంగా పార్టీ వ్యూహ ప్రతివ్యూహాలపైనా నేతలు చర్చించినట్టు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మరో పది రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు - మోదీ సర్కారును ఇరుకున పెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా రాహుల్ బృందం చర్చించింది.

కాగా, రాహుల్ గాంధీకి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. అయితే.. సంస్థాగత ఎన్నికలు ఈ డిసెంబర్ చివరికి పూర్తి కావాల్సి వుండగా, వాటిని సైతం అసెంబ్లీ ఎన్నికలు ముగిసేవరకూ వాయిదా వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. దీంతో రాహుల్ కు అధికారికంగా పగ్గాలు అప్పగించడం అప్పటివరకు సాధ్యం కాదు. కానీ... సోనియా గైర్హాజరీలో ఆయనే అంతా తానై నడిపిస్తున్నారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/