Begin typing your search above and press return to search.

మాఫియా ఆంటీ అంటూ ట్వీట్ బాంబులేశాడు

By:  Tupaki Desk   |   12 Aug 2015 4:58 PM GMT
మాఫియా ఆంటీ అంటూ ట్వీట్ బాంబులేశాడు
X
ఏ లలిత్ మోడీ గురించి బుధవారం పార్లమెంటు అట్టుడికిపోయిందో.. అదే వ్యక్తి ట్విట్టర్ ద్వారా బాంబుల్లాంటి ట్వీట్స్ సంధించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీని.. ‘‘ఇటాలియన్ మాఫియా ఆంటీ’’ అంటూ సంబోధించిన ఆయన చాలానే అంశాల్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా గాంధీ కుటుంబానికి సన్నిహితుడైన కెప్టెన్ సతీష్ శర్మ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపటం ఖాయం.

లలిత్ చేసిన వ్యాఖ్యలు చూస్తే..

‘‘ఇటాలియన్ మాఫియా రాణికి డబ్బు ఇచ్చి ఉండాల్సింది. ఆ మొత్తాన్ని తనకు అప్పుగా ఇవ్వాలని వరుణ్ గాంధీని అడిగి ఉండాల్సింది‘‘

‘‘ఇటాలియన్ ఆంటీకి లలిత్ మోడీ రూ.400కోట్లు ఇచ్చి ఉంటే.. ఈ రోజు పార్లమెంటు సజావుగా జరిగి ఉండేది’’ అంటూ లలిత్ ను ఫాలో అయ్యే వ్యక్తి చేసిన వ్యాఖ్యకు ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తూ.. ‘‘ఓ కప్పు టీ కోసం సంతకం చేసే శక్తి లేదు. కేవలం డబ్బు తీసుకొచ్చే శక్తి మాత్రమే ఉంది. అయితే.. నే తెచ్చిన డబ్బునుక్రికెట్ మాఫియా ఖర్చు పెడుతోంది’’ అని వ్యాఖ్యానించారు.

‘‘1987లో వ్యాపారం మొదలు పెట్టినప్పుడు.. శ్రేయోభాషులు ఓ సలహా ఇచ్చారు. మొదట నాటి ప్రధాని రాజీవ్ గాంధీ ఇంటికి వెళ్లి ఓ టీ తాగి రావాలని సూచించారు. ఆ ఇంటికి కెప్టెన్ సతీష్ శర్మ తీసుకెళ్లారు. కావాలంటే ప్రధానమంత్రి ఇంటి రికార్డులు చూసుకుంటే అదెంత నిజమో తెలుస్తుంది. తర్వాత కెప్టెన్ సతీష్ శర్మకు సూట్ కేసు ఇవ్వాలని చెప్పారు. వారు చెప్పినట్లే చేశా. కాంగ్రెస్ వాళ్లు వ్యాపారం అలాగే చేస్తారు’’

‘‘వాళ్లు (కాంగ్రెస్) కావాలంటే ఖండించుకోవచ్చు. అయితే.. ఏ పని చేసినా మొదట అయితే.. ప్రధానమంత్రి నివాసానికి సంబంధించిన రికార్డులు పరిశీలిస్తే.. అందులో నా పేరు నమోదై ఉంటుంది. కావాలంటే చెక్ చూసుకోండి. ఈ విషయాల్ని ఇటాలియన్ కానీ.. కెప్టెన్ కానీ ఖండించుకోవచ్చు’’

‘‘ఎవరైనా ఢిల్లీలోని కెప్టెన్ సతీష్ శర్మ ఇంటికి వెళితే ఆయన వాళ్లకు ఒక గదిని ప్రత్యేకం చూపిస్తారు. ఆ గదిని ఎవరైనా చూడాల్సిందేనని.. కింద ఫ్లోర్ నుంచి సీలింగ్ వరకు అంతా డబ్బు ఉంటుంది. కావాలంటే ఒకసారి చూసుకోవచ్చు’’ అంటూ ట్వీట్ బాంబులేశాడు. మరి.. దీనికి సోనియాగాంధీ.. కెప్టెన్ సతీష్ శర్మ ఏం బదులిస్తారో..?