Begin typing your search above and press return to search.

ఓం మీద రాహుల్ రచ్చ.. ఆయనకే నష్టం

By:  Tupaki Desk   |   18 Oct 2019 4:46 AM GMT
ఓం మీద రాహుల్ రచ్చ.. ఆయనకే నష్టం
X
ప్రధాని మోడీ మీద అభిమానం అంతకంతకూ పెరుగుతోంది? అదే సమయంలో రాహుల్ గాంధీ మీద విశ్వాసం అంతకంతకూ ఎందుకు తగ్గుతుంది? అన్న ప్రశ్న పలువురిని వేధిస్తోంది. సాత్వికంగా.. అన్ని వర్గాలకు ఆమోదయోగ్యంగా రాహుల్ విధానాలు ఉంటే.. వివాదమైనా సరే.. తాను అనుకున్నదే జరగాలన్న పట్టుదల మోడీకి ఎక్కువ. వాస్తవంగా చూస్తే.. అందరిని కలుపుకుపోయే వ్యక్తికే ఆమోదముద్ర పడుతుంది. కానీ.. అందుకు భిన్నంగా దేశంలో మోడీ క్రేజ్ అంతకంతకూ పెరిగిపోవటం వెనుక అసలు కారణం ఏమిటన్న కోణంలో విషయాన్ని చూస్తే.. రాహుల్ చేతకానితనంగానే చెప్పాలి.

కొన్ని దశాబ్దాలుగా అందరిని కలుపుకుపోవాలన్న ఉద్దేశంతో మెజార్టీలైన హిందువుల మనోభావాలు.. వారి ఆశలు.. ఆకాంక్షల్ని తొక్కి పట్టేసిన వైనంతో వారిలో వేదన అంతకంతకూ పెరిగిపోతోంది. మైనార్టీల విశ్వాసాలకు పెద్ద పీట వేసే వారు.. మెజార్టీలైన తమ వాదనల్ని కీలకరాజకీయ పార్టీలు పట్టించుకోవటం లేదన్న వేదన పెరిగింది. అదే సమయంలో తమ ఆశలకు తగ్గట్లు వారెందుకు వ్యవహరించటం లేదన్న ఆగ్రహం అంతకంతకూ ఎక్కువైంది. సరిగ్గా దీన్నే ప్రధాని మోడీ తనకు తగ్గట్లు మార్చుకున్నారు.

ఒకటిగా లేని హిందూ ఓటు బ్యాంకును ఏకం చేసే పనిలో భాగంగా వారి ఆశల్ని.. ఆకాంక్షల్ని తాను వింటున్నానన్న విషయాన్ని అర్థమయ్యేలా చెప్పటమే కాదు.. చేతల్లోనూ చూపిస్తున్నారు. దీంతో తమను అలక్ష్యం చేసిన రాజకీయ పార్టీలకు భిన్నంగా మోడీ తమకు దన్నుగా నిలుస్తున్నారన్న భరోసా ఆయా వర్గాల్లో ఎక్కువైంది. ఈ తీరే రాహుల్ వైఫల్యానికి కారణంగా చెప్పాలి.

తాజాగా రఫేల్ కు పూజలు నిర్వహించిన వేళలో.. దానిపై ఓం అన్న మాట రాయటం.. హారతులిచ్చి.. నిమ్మకాయలు తొక్కించిన వైనంపై పలువురు విమర్శలు సంధించారు. సాధారణంగా ఇలాంటివి కమ్యునిస్టులు చేస్తుంటారు. అయితే.. మెజార్టీల మనోభావాలకు తగ్గట్లు వ్యవహరించటం తప్పేం కాదు. కానీ.. దాన్ని క్వశ్చన్ చేయటం ద్వారా రాహుల్.. ఆయా వర్గాలకు దూరమవుతున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదు.

వ్యక్తిగతంగా ఉండే నమ్మకాలు వ్యవస్థల మీద కూడా ప్రభావం చూపిస్తాయి. ఓం రాయటాన్ని పెద్ద ఎత్తున ఆక్షేపించటం ద్వారా తనలోని కామ్రేడ్ నురాహుల్ చూపిస్తే.. మోడీ పరివారం మాత్రం.. ఓం రాయకుండా మరేం రాస్తాం చెప్పండి? అని ప్రశ్నించారు. దసరా వేళ ఆయుధ పూజ చేస్తాం కదా? అదే పని చేస్తే మమ్మల్ని ఎందుకు తప్పు పడతారు? శస్త్రపూజ నాడు ఓం కాకుంటే ఇంకేం రాయాలని తాను రాహుల్ ను అడుగుతున్నట్లుగా ప్రశ్నించారు.

మూఢనమ్మకమంటూ రాహుల్ లాంటివారు కొట్టిపారేయటం మీడియాలో వార్తగా బాగానే ఉంటుంది కానీ కోట్లాదిమంది ప్రజల్లో మాత్రం తమ సెంటిమెంట్లను రాహుల్ వ్యతిరేకించినట్లుగా ఉంటుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. గుళ్లకు వెళ్లి పూజలు చేసే రాహుల్.. రఫేల్ మీద ఓం రాస్తే అంతలా తప్పు పట్టటం ఎందుకన్న ప్రశ్నను అర్థం చేసుకోవచ్చు.

కమ్యునిస్టు నేతల మాదిరి ఇళ్లల్లో వారి పిల్లలేమో సంప్రదాయబద్ధంగా పెళ్లిళ్లు చేసుకుంటే.. కామ్రేడ్స్ మాత్రం తాము వాటికి దూరం ఉంటామని చెప్పినట్లే రాహుల్ తీరు ఉంటుందని చెప్పాలి. పూజలు.. పునస్కారాలకు దూరమనే కామ్రేడ్స్.. వారి పిల్లలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్న వైనం చూసినప్పుడు ఇంట్లో పిల్లల మీద ప్రభావం చూపించని కామ్రేడ్స్.. కోట్లాదిమందిని తమ వాదనతో కన్వీన్స్ చేయటమా? అనే సందేహం కలుగక మానదు. ఇప్పుడు రాహుల్ తీరు ఇందుకు మినహాయింపు కాదన్నది మర్చిపోకూడదు. అదే ఆయన్ను కోట్లాది మందికి డిస్ కనెక్ట్ అయ్యేలా చేస్తుందన్నది గుర్తిస్తే మంచిది.