Begin typing your search above and press return to search.

కేసీఆర్ ఇలాకాలో రాహుల్..దంచేశాడుగా

By:  Tupaki Desk   |   1 Jun 2017 7:02 PM GMT
కేసీఆర్ ఇలాకాలో రాహుల్..దంచేశాడుగా
X
ఒకింత గ్యాప్ అనంత‌రం తెలంగాణ‌లో ప‌ర్య‌టించిన ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన ప్రజాగర్జనలో ప్ర‌సంగించారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇలాకా అయిన పూర్వ‌పు మెద‌క్ జిల్లా ప‌రరిధిలోకి వ‌చ్చే సంగారెడ్డి ప్ర‌సంగించిన సంద‌ర్బంగా రాహుల్ గాంధీ ఒకింత దూకుడుగానే టీఆర్ఎస్ ర‌థ‌సార‌థిపై మండిప‌డ్డారు. హక్కులను కాపాడుకునేందుకే ప్రజలు తెలంగాణను కోరుకున్నారని రాహుల్‌గాంధీ అన్నారు. నీళ్లు, నిధుల కోసం ప్రజలు తెలంగాణను కోరుకున్నారన్నారు. తెలంగాణ ప్రజల బాధను, ఆకాంక్షను అర్థం చేసుకుని సోనియా తెలంగాణ ఇచ్చారన్నారు.అయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం రాచరిక పాలన సాగిస్తోందని పరోక్షంగా సీఎం కేసీఆర్ కుటుంబంపై రాహుల్ ఆరోప‌ణ‌లు ఆరోపించారు. ఒక్క కుటుంబం కోసమేనా తెలంగాణ ప్ర‌జ‌లు పోరాడింది అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను లాక్కునేందుకేనా తెలంగాణ ఏర్పడింది అని వ్యాఖ్యానించారు.

రాష్ట్రం ఏర్పడితే నిరుద్యోగ సమస్య తీరుతుందని భావించి తెలంగాణ విద్యార్థులు, యువత ఉద్యమాన్ని నడిపారని రాహుల్ గాంధీ అన్నారు. గుత్తేదారుల హితం కోసమే సీఎం పనిచేస్తున్నారన్నారు. ప్రజల భవిష్యత్‌ను కేవలం నలుగురి చేతుల్లోనే వేద్దామా అని రాహుల్‌ ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ మూడేళ్ల పాలనలో 2854మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని రాహుల్‌గాంధీ అన్నారు. సీఎం నియోజకవర్గంలోనే వంద మంది రైతులు బలవన్మరణం పొందారన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఎమ్మెల్యేలను లాక్కోవడానికి తెలంగాణ ఏర్పడిందా అని రాహుల్‌ ప్రశ్నించారు.రూ.350కోట్లతో కేసీఆర్‌ కొత్త ఇల్లు కట్టుకున్నారని రాహుల్‌గాంధీ ఆరోపించారు. ప్రపంచంలో ఏ సీఎంకు కూడా ఇలాంటి ఇల్లు ఉండదేమో అన్నారు. అదంతా ప్రజలు, విద్యార్థుల డబ్బు కాదా అని ఆయన ప్రశ్నించారు. మీ జేబులో డబ్బు తీసుకుని తన కోసం ఇల్లు కట్టుకున్నారని విమ‌ర్శ‌లు గుప్పించారు. తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఫోన్‌ వెనుక మేడిన్‌ తెలంగాణ అని ఉండేలా అభివృద్ధి చేస్తామని రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. మేం అధికారంలోకి వచ్చాక మేడిన్‌ తెలంగాణ ప్రమోట్‌ చేస్తామని చెప్పారు. 70 ఏళ్లలో అత్యంత నిరుద్యోగ సమస్య ఇప్పుడు దేశంలో ఉందని తెలిపారు. దేశంలో 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మోడీ చెప్పారు, ఇక్కడేమో ఇంటికో ఉద్యోగమని కేసీఆర్‌ చెప్పారని రాహుల్‌ గుర్తు చేశారు. అక్కడ మోడీ, ఇక్కడ కేసీఆర్‌ అబద్దాలు చెబుతూ పోతున్నారని విమర్శించారు.

భూసేకరణ చట్టానికి ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, ఇక్కడ కేసీఆర్‌ తుంగలో తొక్కుతున్నార‌ని రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో పేద రైతుల భూములను బలవంతంగా లాక్కున్నారని, భూముల మీదే అత్యంత అవినీతి జరుగుతూ ఉండేదని రాహుల్‌ తెలిపారు. లక్షల కోట్ల విలువైన భూములను లాక్కునేవారని గుర్తు చేశారు. అలాంటిది అవినీతికి వ్యతిరేకంగా భూసేకరణ చట్టం తెచ్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమని పేర్కొన్నారు. రైతుల అనుమతి లేకుండా భూమిని సేకరించకూడదనే చట్టాన్ని తీసుకొచ్చామని తెలిపారు. ఈ చట్టాన్ని మోడీ ప్రభుత్వం మూడు సార్లు రద్దు చేసే ప్రయత్నం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్‌ హయాంలో రూ.70వేల కోట్ల రుణాలు మాఫీ చేశామని కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ అన్నారు. రైతులకు బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదంటే ఇదేం రుణమాఫీ అన్నారు. మా హయాంలో ఒకే దఫాలో రైతులందరికీ రుణమాఫీ చేశామన్నారు. రుణమాఫీ చేస్తే పట్టా పుస్తకాలు, మహిళల నగలు ఇంకా ఎందుకు బ్యాంకుల్లో ఉన్నాయని ప్రశ్నించారు.