Begin typing your search above and press return to search.

ఛాయ్ వాలాను సెల్ఫీ తీసుకున్న యువరాజు

By:  Tupaki Desk   |   6 March 2017 4:59 AM GMT
ఛాయ్ వాలాను సెల్ఫీ తీసుకున్న యువరాజు
X
కొన్ని నాటకీయ పరిణమాలు భలే ఆసక్తికరంగా సాగుతుంటాయి. ఎన్నికల వేళ.. భారీ మైలేజ్ పొందేందుకు నేతలు విపరీతంగా ప్రయత్నిస్తుంటారు. ఇందులో భాగంగా ఎప్పుడూ గుర్తుకు రాని సామాన్యులు.. ఛాయ్ వాలాలు.. చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారు గుర్తుకు వస్తుంటారు. రోడ్ల మీద తాము వెళుతున్నప్పుడు.. దారిన అలాంటి వారు రోజూ కనిపించినా పట్టించుకోని నేతలు.. ఎన్నికల వేళ మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించటం తెలిసిందే. మామూలు రోజుల్లో యమా స్పీడ్ గా దుమ్ము రేపుకుంటూ ఏసీ వాహనాల్లో దూసుకెళ్లే నేతలు.. ఎన్నికల వేళలో మాత్రం నాటకీయంగా చిన్నచిన్న దుకాణాల దగ్గర తమ వాహన శ్రేణిని ఆపేసి ముచ్చట్లు చెప్పేస్తుంటారు. వారు ఎదుర్కొంటున్న కష్టాల గురించి.. సమస్యల వివరాల్నిఅడిగి తెలుసుకుంటుంటారు. వారి సమస్యల్ని తీరుస్తామని హామీలు ఇచ్చేస్తుంటారు.

తాజాగా అలాంటి ప్రయత్నమే చేసిన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊహించని అనుభవం ఒకటి ఎదురైంది. అంతేనా.. సెల్ఫీ తీసుకొని మరీ వెళ్లటం విశేషం. ఇంతకీ.. రాహుల్ లాంటి నేత తనకు తానుగా సెల్ఫీ తీసుకునే పరిస్థితి ఎందుకు వచ్చిందన్న విషయంలోకి వెళితే..

ఐదు రాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ముఖ్య అధినేతలంతా బిజీబిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నెల 8న యూపీ చివరి విడత పోలింగ్ జరగనుండటం.. ఆ విడతలో వచ్చే అధిక్యం మొత్తం ఎన్నికల్ని ప్రభావితం చేస్తుందన్న అంచనాలతో మోడీ.. రాహుల్.. అఖిలేశ్..మాయావతి ఇలా ఎవరికి వారు విపరీతంగా శ్రమిస్తున్నారు. ప్రధాని లాంటి వారు రెండు రోజులుగా అదే పనిగా ప్రచారం చేస్తున్నారంటేనే.. ఎంత తీవ్రంగా పోరు సాగుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఇలా ప్రచారం చేస్తున్న రాహుల్.. ఆదివారం మధ్యహ్నం ఒకటిన్నర గంటల ప్రాంతంలో టీ తాగాలనిపించింది. వెంటనే.. అక్కడ కనిపిస్తున్న ఛాయ్ వాలా వద్దకు వెళ్లారు. రాహుల్ గాంధీ లాంటి వ్యక్తి నేరుగా తన దుకాణంలోకి రావటంతో.. ఆ కుటుంబం ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అయ్యింది. రాహుల్ కు స్వాగతం పలికి.. ఆయన కోరినట్లే చాయ్ తయారు చేసి ఇచ్చారు.

ఈ క్రమంలో ఛాయ్ వాలాను రాహుల్ కొన్ని ప్రశ్నల్ని వేశారు. అంతలో అక్కడ కనిపించిన వారి కుమార్తె పేరును అడిగారు రాహుల్. దానికి ఛాయ్ వాలా బదులిస్తూ.. ‘‘ప్రియాంక’’ అని చెప్పగానే రాహుల్ ఒక్కసారి పెద్దగా నవ్వేశారు. అయితే.. నువ్వు నా సిస్టర్ వి అన్న మాట అంటూ ప్రేమగా ఆ పాపను దగ్గరకు తీసుకొని.. సెల్ఫీ తీసుకున్నారు. అంతేకదా.. ఎక్కడో సంబంధం లేని ప్రాంతంలో ఒక సాదాసీదా ఛాయ్ వాలా కుమార్తె పేరు.. తానెంతో అభిమానించే సోదరి పేరు కావటం రాహుల్ ను భావోద్వేగానికి గురి చేసినట్లుగా చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/