Begin typing your search above and press return to search.

రఘువీరాకు రాహుల్ ఆ మాట చెప్పారట!

By:  Tupaki Desk   |   23 Sep 2016 8:10 AM GMT
రఘువీరాకు రాహుల్ ఆ మాట చెప్పారట!
X
చేసిన తప్పును దిద్దుకోవటం అందరికి చేతనయ్యే విషయం కాదన్నది కాంగ్రెస్ ను చూస్తే ఇట్టే అర్థమవుతుంది. విభజన అనివార్యం అన్న నేపథ్యంలో ఏపీ విభజన జరిగిందన్న విషయాన్ని ఏపీ ప్రజలకు అర్థమయ్యేలా చెప్పటంలో తప్పటడుగు వేస్తే.. విభజనకు తమను మాత్రమే దోషిగా నిలబెట్టకూడదని.. అందులో తమకెంత పాత్ర ఉందో.. అంతే పాత్ర బీజేపీకి ఉందన్న విషయాన్ని చెప్పలేకపోయారని చెప్పాలి. అప్పుడున్న భావోద్వేగ పరిస్థితుల్లో ఇలాంటివి అర్థం కావులే అని వదిలేసినా.. సమయం చూసుకొని అసలు వాస్తవాన్ని చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ.. ఇప్పటివరకూ కాంగ్రెస్ ఆ పని చేయలేదని చెప్పాలి.

విభజనతో కాంగ్రెస్ నేతల్లో చాలామంది చెల్లాచెదురై.. తలో పార్టీకి వెళ్లిన దుస్థితి తెలిసిందే. రానున్న కాలంలో కాంగ్రెస్ కు భవిష్యత్ లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా.. దింపుడు కళ్లెం ఆశలతో కాంగ్రెస్ లో కంటిన్యూ అవుతున్న నేతలు కొందరున్నారు. అలాంటి వారిలో రఘువీరా రెడ్డి ఒకరు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ కు చీఫ్ గా వ్యవహరిస్తున్న ఆయన.. పార్టీని జవసత్వాలు తెచ్చే ప్రయత్నంలో భాగంగా చేయకూడని తప్పులు చేసేస్తుండటం కనిపిస్తుంది.

ప్రత్యేక హోదా విషయం సీమాంధ్రప్రజల్లో సెంటిమెంట్ గా మారిన నేపథ్యంలో.. మోడీ పరివారం మీద ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ అధినాయకత్వాన్ని రంగంలోకి దించటంలో ఆయన అట్టర్ ప్లాప్ అయ్యారని చెప్పాలి. విభజన నిర్ణయంతో పోగొట్టుకున్న ఇమేజ్ ను.. ప్రత్యేక హోదా అంశంపై పోరాటం ద్వారా విభజన డ్యామేజ్ ను కంట్రోల్ చేసే అవకాశం ఉందన్న విషయాన్ని అధినాయకత్వానికి అర్థమయ్యేలా చెప్పటం.. వారిని సీన్లోకి తీసుకురాలేకపోయారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తుంది. మరి.. ఇలాంటి విమర్శలు రఘువీరా చెవిన పడ్డాయో ఏమో కానీ.. ప్రత్యేకహోదా కోసం జరుగుతున్న పోరాటానికి కాంగ్రెస్ పూర్తి మద్దుతు ఇస్తుందన్నారు. ప్రత్యేక హోదా మీద సాగుతున్న పోరాటానికి తన మద్దతు ఉంటుందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తనతో చెప్పినట్లుగా రఘువీరా వెల్లడించారు.

ఒకవేళ ఇదే నిజమని అనుకుంటే.. ప్రత్యేక హోదా అన్నది లేదన్న విషయాన్ని కేంద్ర ఆర్థికమంత్రి కుండబద్ధలు కొట్టేసిన రోజున.. వెంటనే ప్రెస్ మీట్ పెట్టేసి.. వారి నిర్ణయం తప్పని.. కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తుందని.. తాము ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తామని రాహుల్ కానీ.. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కానీ ఎందుకు చెప్పనట్లు? రఘువీరాతో చెప్పిన మాటను రాహుల్ అందరికి ఎందుకు చెప్పరో..?