Begin typing your search above and press return to search.

అయ్యర్ పై రాహుల్ మంట ఇవాళ్టిది కాదా?

By:  Tupaki Desk   |   8 Dec 2017 5:30 PM GMT
అయ్యర్ పై రాహుల్ మంట ఇవాళ్టిది కాదా?
X
ప్రధాని నరేంద్రమోడీని నీచవ్యక్తిగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మోడీ అసభ్య రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన దెప్పి పొడిచారు. అయితే ప్రధానిని ఇలాంటి పదజాలంతో దూషించడం గురించి పార్టీకి కాబోతున్న అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. రాహుల్ ఆగ్రహించారని తెలిసిన వెంటనే ఆయన ఆదేశాల మేరకు మణిశంకర్ అయ్యర్ క్షమాపణ కూడా చెప్పేశారు. నిజానికి అక్కడితో సమస్య సమసిపోవాలి. కానీ ఆయనను పార్టీనుంచి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఏంటి? ఇక్కడ విశ్లేషకుల అభిప్రాయాలు రకరకాలుగా ఉంటున్నాయి. అయ్యర్ అంతటి సీనియర్ వ్యక్తిని - మాజీ కేంద్ర మంత్రిని పార్టీనుంచి సస్పెండ్ చేసేంతటి తీవ్ర నిర్ణయం తీసుకోవడానికి ఇప్పటి కామెంట్స్ ఒక్కటే కారణం కాదని కొందరు వాదిస్తున్నారు. ఒక రకంగా చెప్పాలంటే రాహుల్ కు ఆయన మీద ఎప్పటినుంచో కక్ష ఉన్నదని కూడా వినిపిస్తోంది.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష కిరీటాన్ని తనకు జన్మతః సంక్రమించిన ఆస్తిలాగా రాహల్ ప్రస్తుతం అందుకుంటున్న తరుణం ఇది. అయితే పార్టీలో ఇలాంటి వైఖరిని వ్యతిరేకిస్తున్న నాయకులు కూడా అనేకమంది ఉన్నారు. ఒక రకంగా మణిశంకర్ అయ్యర్ కూడా అలాంటి కోవకు చెందిన వ్యక్తి. అయితే రాహుల్ కు పట్టాభిషేకం వ్యవహారాన్ని సమర్థిస్తున్నారో వ్యతిరేకిస్తున్నారో అర్థం కాకుండా.. ఆ ఎపిసోడ్ ను మెగలుల రాజరిక వారసత్వాలతో పోలుస్తూ అయ్యర్ చేసిన కామెంట్లు దుమారం సృష్టించాయి. కాంగ్రెస్ పార్టీ మొగలుల సంస్కృతికి ప్రతీక అంటూ భాజపా దీనిని సమర్థంగా వాడుకుంది. రాహుల్ ను ఔరంగజేబుతో పోలుస్తూ.. భాజపా జోకులు వేయడానికి అయ్యర్ ఆ రకంగా అవకాశం కల్పించారు. ఈ వ్యవహారం మీద కూడా రాహుల్ ఎప్పటినుంచో గుర్రుగా ఉన్నట్లు పార్టీ వర్గాలు పేర్కంటూ ఉంటాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే.. 2019 లో మోడీని ఎదుర్కొనగలిగే సంకీర్ణాన్ని నడపగలిగే శక్తి రాహుల్ కు ఉందా? అని సందేహాలు వ్యక్తం చేస్తూ అయ్యర్ గతంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. రాహుల్ సామర్థ్యం మీద ఆయన అనుమానాలు వెలిబుచ్చారు. మోడీని దెబ్బ కొట్టే స్థాయిలో వ్యతిరేక పార్టీలు జాతీయ స్థాయిలో సంకీర్ణంగా ఏర్పడితే గనుక.. కాంగ్రెస్ తన స్థాయిని తగ్గించుకుని సారథ్య బాధ్యత మరొకరికి ఇవ్వాలనేది అప్పట్లో మణిశంకర్ సూచన. బీహార్, యూపీ ఎన్నికల్లో తమ స్థాయిని తగ్గించుకున్నట్టే.. మోడీని ఎదుర్కొనే సంకీర్ణానికి సారథిగా మరో నేత ఉండాలని.. రాహుల్ గాంధీ చాలడు అని అర్థం వచ్చేలా ఆయన గతంలో మాట్లాడారు. ఇలాంటివన్నీ మనసులో ఉంచుకుని.. అయ్యర్ పై కారాలు మిరియాలు నూరుతున్న రాహుల్.. ఇప్పుడు ‘నీచ’ పదంతో అవకాశం రాగానే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేయించారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో ఉన్నాయి.