Begin typing your search above and press return to search.

రాహుల్‌ కు కొకైన్ అల‌వాటు..!

By:  Tupaki Desk   |   6 July 2018 6:10 AM GMT
రాహుల్‌ కు కొకైన్ అల‌వాటు..!
X
కొంద‌రు రాజ‌కీయ నాయ‌కులు వివాదాల‌కు ఆమ‌డ దూరంలో ఉంటారు. ఎవ‌రైన త‌మ‌ను వివాదంలోకి లాగితే మథ‌న‌ప‌డిపోతుంటారు. ఇలా ఎందుకు జ‌రిగింద‌ని క‌ల‌వ‌ర‌ప‌డుతుంటారు. ఇంకొంద‌రికి వివాదాలంటే మ‌క్కువ‌. సంద‌ర్భం ఏదైనా త‌మ‌దైన శైలిలో ఓ కామెంట్ వ‌దిలి ఊహించ‌ని ర‌చ్చ‌కు కార‌ణం అవుతుంటారు. రెండో కోవ‌కు చెందిన వారి జాబితాలో బీజేపీ ఎంపీ - సీనియ‌ర్ నేత సుబ్ర‌మ‌ణ్య‌స్వామి ఉంటార‌ని ప‌లువురు అంటుంటారు. దాన్ని నిజం చేస్తూ తాజాగా ఆయ‌న ఓ ర‌చ్చ సృష్టించారు. కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి డ్రగ్స్‌ అలవాటు ఉందని - డోపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తే ఆ విషయం తేలుతుందని స్వామి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

ప్రతి ఏడాది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డ్రగ్స్‌ టెస్ట్‌ నిర్వహించాలని పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. పోలీస్‌ శాఖతో సహా ప్రభుత్వ ఉద్యోగులంద‌రికీ డోప్‌ టెస్ట్‌ నిర్వహించాలని - నిందితులుగా తేలితే కఠిన చర్యలు తీసుకోవాలని పంజాబ్‌ సర్కార్‌ నిర్ణయించింది. నిషేధిత డ్రగ్స్‌ విక్రయించే - అక్రమ రవాణాకు పాల్పడే వారికి ఉరిశిక్ష విధించేలా కఠిన చట్టాన్ని రూపొందిస్తున్నామని ఆ రాష్ట్ర సీఎం అమరీందర్‌ సింగ్‌ ఇటీవల ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సార‌థ్యంలోని స‌ర్కారుపై ఇప్ప‌టికే కేంద్ర‌మంత్రి హర్‌ సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ కూడా స్పందించారు. ‘పంజాబ్‌లో డ్రగ్స్‌ అడిక్ట్స్‌ ఎక్కువగా ఉన్నారని కాంగ్రెస్‌ నేతలు ఆరోపిస్తున్నారు. 70 శాతం యువత డ్రగ్స్‌ మత్తులో ఊగుతోందని రాహుల్‌ అంటున్నారు. కానీ, వారి పార్టీలోనే ఉన్న డ్రగ్‌ అడిక్ట్స్‌ కు ముందుగా డోప్‌ టెస్టులు నిర్వహించండి. అది రాహుల్‌ తోనే మొదలుపెడితే బాగుంటుంది’ అని ఆమె వ్యాఖ్యానించారు. మహిళా మంత్రి చేసిన వ్యాఖ్య‌లే ర‌చ్చ అవుతుంటే స్వామి దానికి ఆజ్యం పోశారు.

ఓ మీడియా ఛాన‌ల్‌ లో సుబ్ర‌మ‌ణ్య‌స్వామి మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్‌ గాంధీకి డ్రగ్స్‌ అలవాటు ఉందని - డోపింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తే ఆ విషయం తేలుతుందని స్వామి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పంజాబ్‌ ప్రభుత్వం నిర్ణయం ప్రకారం ముందుగా డోపింగ్‌ టెస్ట్ రాహుల్‌ కు నిర్వహించాలి. ఆయన కోకైన్‌ తీసుకుంటారు కాబ‌ట్టి ఖచ్ఛితంగా విఫలం అవుతారు` అంటూ సంచ‌ల‌న కామెంట్లు చేశారు. కాగా, కేంద్ర‌మంత్రి - బీజేపీ ఎంపీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు మండిపడుతున్నారు.