Begin typing your search above and press return to search.

వంద సీట్ల మార్కును దాటుతుందా లేదా? ఇదే చర్చ!

By:  Tupaki Desk   |   12 May 2019 12:45 PM GMT
వంద సీట్ల మార్కును దాటుతుందా లేదా? ఇదే చర్చ!
X
దేశ వ్యాప్తంగా పోలింగ్ చివరి దశల్లోకి వచ్చేసింది. మరో వారం రోజుల్లో పోలింగ్ పక్రియ దాదాపుగా పూర్తి అవుతుంది. ఈ క్రమంలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేది చర్చనీయాంశంగా నిలుస్తూ ఉంది. ఈ సారి భారతీయ జనతా పార్టీ హవా చాలా వరకూ తగ్గుతుందనేది మాత్రం స్పష్టం అవుతున్న అంశం.

అదెంత వరకూ తగ్గుముఖం పడుతుంది అనేది వేరే చర్చ. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటి? అంటే వందకు అటూ.. ఇటూ.. అనే మాటే వినిపిస్తూ ఉంది. భారతీయ జనతా పార్టీ కోల్పోయే సీట్లు వంద వరకూ ఉంటాయని బల్ల గుద్దేవాళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ వందకు పైగా ఎంపీ సీట్లను సాధిస్తుందని వాదించలేకపోతూ ఉన్నారు.

'కాంగ్రెస్ పార్టీ కోలుకోవచ్చు కానీ..' అనే విశ్లేషణే ఇప్పుడు వినిపిస్తూ ఉండటం విశేషం. కాంగ్రెస్ పార్టీ గత లోక్ సభ సార్వత్రిక ఎన్నికలప్పుడు చిత్తు చిత్తుగా ఓడింది. ఎంతగా అంటే ప్రధాన ప్రతిపక్ష హోదాలను కూడా సంపాదించుకోలేనంతగా. అదంతా గతం.

అయితే ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఉత్సాహాన్ని ఇచ్చే ఫలితాలు వచ్చాయి. గుజరాత్ - మధ్యప్రదేశ్ - రాజస్తాన్ - చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీకి ఊరట విజయాలు దక్కాయి. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం స్థాయి విజయాన్ని ఇప్పుడు పొందినా.. ఫర్వాలేదనిపించుకునే స్థాయిలో సీట్లను పొందుతుంది.

అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఎన్నుకున్నట్టుగా అక్కడి జనాలు లోక్ సభ ఎన్నికల్లో మళ్లీ కాంగ్రెస్ కే ఓటేస్తారా? అనేది మాత్రం ఫలితాలు వచ్చాకే చెప్పగలిగే అంశం. బెట్టింగ్ రాయుళ్ల అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీ వంద ఎంపీ సీట్లను రీచ్ కావడం కూడా కష్టమే. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వంద ఎంపీ సీట్లకు మించి గెలుస్తుందని కొంతమంది, కాదు డబుల్ డిజిట్స్ లోనే ఆగిపోతుందంటూ మరికొంతమంది బెట్టింగ్స్ కాస్తున్నట్టుగా సమాచారం. ఈ పాయింట్ మీద బెట్టింగులు భారీ స్థాయిలో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకీ కాంగ్రెస్ పార్టీ వంద సీట్ల మార్కును దాటగలదా లేదా? మే ఇరవై మూడు దీనికి సమాధానం లభించాల్సిందే!