Begin typing your search above and press return to search.

రాహుల్ అక్కడ పోటీ చేస్తారా.. మిత్రపక్షం ఫైర్!

By:  Tupaki Desk   |   1 April 2019 1:30 AM GMT
రాహుల్ అక్కడ పోటీ చేస్తారా.. మిత్రపక్షం ఫైర్!
X
రాహుల్ ను కేరళలో పోటీ చేయించాలని అనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఇది దాదాపుగా ఖరారు అయిన అంశమే. దక్షిణాది నుంచి రాహుల్ ఎంపీగా పోటీ చేస్తారని కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ విషయంలో ముందుగా కర్ణాటక పేరు వినిపించినా చివరకు కేరళకు ఫిక్స్ అయ్యారు. అక్కడ వయనాడ్ సీటు నుంచి రాహుల్ పోటీ చేయబోతున్నారని కాంగ్రెస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చేసిందట. ఈ మేరకు గట్టిగా ప్రచారం జరుగుతూ ఉంది.

ఇలాంటి నేపథ్యంలో ఈ విషయంలో అసహనం వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ పార్టీకి సన్నిహితంగానే ఉన్న సీపీఎం. రాహుల్ ను అక్కడ ఎందుకు పోటీ చేయిస్తున్నట్లో చెప్పాలని సీపీఎం నేత ఏచూరీ డిమాండ్ చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీని గద్దె దింపాలనే ప్రయత్నంలో తాము ఉన్నామని - అలాంటిది తమపార్టీ అభ్యర్థి పోటీలో ఉన్న చోట రాహుల్ పోటీ చేయడం ఏమిటని సీతారాం ఏచూరీ ప్రశ్నించారు.

కేరళలో కాంగ్రెస్ వర్సెస్ కమ్యూనిస్టు పార్టీల రాజకీయం జరుగుతోందనేది తెలిసిన సంగతే. అక్కడ ఒక టర్మ్ కాంగ్రెస్ కూటమికి మరో టర్మ్ లెఫ్ట్ పార్టీల కూటమికి అవకాశం లభిస్తూ ఉంది. ఇప్పుడు లెఫ్ట్ పార్టీల చేతిలో అధికారం ఉందక్కడ. లెఫ్ట్ కూటమిని గద్దె దించాలని కాంగ్రెస్ ఆరాటపడుతూ ఉంది.లోక్ సభ సార్వత్రిక ఎన్నికల్లో కూడా లెఫ్ట్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ పోరాటం సాగనుంది.

ఇలాంటి నేపథ్యంలో రాహుల్ వచ్చి కేరళలో బరిలోకి దిగుతుండటం సహజంగానే లెఫ్ట్ కూటమికి అసహనాన్ని కలిగిస్తూ ఉంది. మోడీని దించాలనే ఆరాటంతో తాము ఉంటే..తమను ఓడించాలని రాహుల్ చూడటం ఏమిటని వారు అంటున్నారు.రేపు కేంద్రంలో కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్నా దానికి లెఫ్ట్ పార్టీ ల మద్దతు తప్పనిసరి అయ్యే పరిస్థితి ఉంది. ఇలాంటి నేపథ్యంలో తమకు పట్టున్న కేరళలో రాహుల్ బరిలోకి దిగుతుండటం ఆ పార్టీలను అసహనానికి గురి చేస్తూ ఉంది. మరి అవసరమైన మిత్రపక్షాలను నొప్పించడానికి రాహుల్ వెనుకాడకుండా పోటీకి దిగుతాడేమో చూడాలి!